icon icon icon
icon icon icon

Sachin Pilot: గతం గతః.. మా దృష్టంతా కలిసి పనిచేయడంపైనే: సచిన్‌ పైలట్‌

రాజస్థాన్‌ సీఎం గహ్లోత్‌(Ashok Gehlot), మాజీ డిప్యూటీ సీఎం పైలట్‌(Sachin Pilot) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపించేవి. కానీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో వారు కలిసి ముందుకు వెళ్తున్నతీరు ఆశ్చర్చపరుస్తోంది. దీనిపై గతం గతః అనే రీతిలో పైలట్ స్పందించడం గమనార్హం. 

Updated : 21 Nov 2023 20:43 IST

జైపుర్‌: అసెంబ్లీ ఎన్నికలకు రోజుల వ్యవధే ఉండటంతో రాజస్థాన్‌(Rajasthan)లో రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొనింది. అధికార కాంగ్రెస్‌(Congress) పార్టీ నేతలు అశోక్‌ గహ్లోత్‌(Ashok Gehlot), సచిన్‌ పైలట్(Sachin Pilot) మధ్య సీఎం కుర్చీ కోసం గట్టి పోటీ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రస్తుత ఎన్నికల్లో ఆ విభేదాలు పైకి కనపించకుండా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ(Modi) విమర్శలు చేయగా.. వాటిపై మీడియా అడిగిన ప్రశ్నలకు పైలట్ సమాధానం ఇచ్చారు.  

రెండురోజుల క్రితం రాజస్థాన్‌(Rajasthan)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. గహ్లోత్‌, పైలట్ మధ్య విభేదాల గురించి ప్రస్తావించారు. ‘క్రికెట్‌లో బ్యాటర్లు తమ జట్టు కోసం పరుగులు చేస్తుంటారు. కానీ కాంగ్రెస్‌లో మాత్రం నేతలు పరుగులు చేయడానికి బదులు కుమ్ములాడుకుంటారు. వారి మధ్య తీవ్రస్థాయి అంతర్గతపోరు ఉంది. వారు ఒకరిని ఒకరు రనౌట్‌ చేసుకోవడానికి ఐదేళ్లు కేటాయించారు’ అని మోదీని విమర్శించారు.

అయితే తమ మధ్య వైరం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు పైలట్ స్పందిస్తూ.. అదంతా గతం అని వ్యాఖ్యానించారు. మొత్తంగా తమ మధ్య సఖ్యతే ఉందనేలా మాట్లాడారు. ‘మేం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యాం. పార్టీ నా ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంది. అన్నీ మర్చిపోయి, క్షమించి, ముందుకెళ్లాలని హైకమాండ్ చెప్పింది. ఇప్పుడు నా దృష్టంతా కలిసిపనిచేయడంపైనే. వ్యక్తిగత శత్రుత్వం ఏమీ లేదు. గత 30 ఏళ్లకాలంలో రాజస్థాన్‌లో వరుసగా మేం విజయం సాధించలేదు. దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని పైలట్‌ వ్యాఖ్యలు చేశారు.

అధికారంలోకి వస్తే ‘కులగణన’.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

రాజస్థాన్‌ కాంగ్రెస్‌(Rajasthan Congress)లో  గహ్లోత్‌(Ashok Gehlot), పైలట్‌(Sachin Pilot) వర్గాల మధ్య ఆధిపత్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీఎం గహ్లోత్‌, మాజీ డిప్యూటీ సీఎం పైలట్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తలెత్తిన పరిణామాలు కాంగ్రెస్‌(Congress) అధిష్ఠానానికి తలనొప్పితెచ్చిపెట్టాయి. కానీ ఎన్నికలు తేదీ దగ్గరపడుతోన్న ఈ తరుణంలో వారు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటూ.. కలిసి ముందుకు వెళ్తుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img