icon icon icon
icon icon icon

Madhya Pradesh: ‘మధ్యప్రదేశం’ మళ్లీ కమలానిదే.. ఐదోసారి అధికారంలోకి భాజపా

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కమలం వికసించింది. స్పష్టమైన మెజార్టీ సాధించిన భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇంతకీ.. ఆ పార్టీని గెలుపు తీరాలకు చేర్చిన అంశాలేంటో ఓ సారి చూద్దాం. 

Updated : 03 Dec 2023 22:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌లా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh Assembly Elections 2023)లో మరోసారి కమలం వికసించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి భాజపా (BJP) స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలో 230 స్థానాలకు.. ప్రభుత్వ ఏర్పాటుకు 116 స్థానాల్లో విజయం సాధించాలి. అయితే, భాజపా 163 స్థానాల్లో  జయకేతనం ఎగురవేసింది. అఖండ మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. మరోవైపు సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో భాజపా విజయానికి దోహదం చేసిన అంశాలేంటో ఓ సారి చూద్దాం. 

భాజపా సీక్రెట్ మంత్ర

2018లో ‘మాఫ్‌ కరో మహరాజ్‌.. సాథ్‌ హై శివరాజ్’ (క్షమించండి మహరాజ్‌, మా నేత శివరాజ్‌) అంటూ ఎన్నికల సమయంలో భాజపా తీసుకువచ్చిన నినాదం భారీ హిట్‌ కొట్టింది. అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి మహరాజ్‌ అని సంబోధిస్తూ కాషాయ పార్టీ ఆ నినాదాన్ని ప్రచారం చేసింది. ఎన్నికల తర్వాత సింధియా భాజపాలో చేరడంతో.. 2023 ఎన్నికల్లో ఇదే నినాదాన్ని మార్చి ‘స్వాగత్ మహరాజ్‌.. సాథ్‌ హై శివరాజ్‌’ (స్వాగతం మహరాజ్‌.. మీతోనే శివరాజ్‌) అంటూ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఎన్నికల్లో ప్రచారం చేశారు.

ఈ సారి ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించకుండా.. ప్రధాని మోదీ పేరుతో ఓట్లను అడిగింది. ఇది పార్టీలోని సీనియర్‌ నాయకులు సీఎం పదవి గురించి ఆలోచించకుండా.. భాజపా గెలుపుపై దృష్టి సారించేలా చేసింది. దీంతో పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం, రాష్ట్రస్థాయి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ప్రచారం చేసి భాజపాను గెలుపు తీరాలకు చేర్చారు. ఫలితాలు వెలువడటంతో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. భాజపా అధినాయకత్వం మరోసారి శివరాజ్‌ సింగ్ వైపే మొగ్గు చూపుతుందా? లేదంటే కొత్త వారికి అవకాశమిస్తుందా? అనేది చూడాలి.

వ్యతిరేకతను దాటుకుని.. 

శివరాజ్ సింగ్ చౌహాన్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో పార్టీపై ప్రభావం చూపకుండా భాజపా జాతీయ నాయకత్వం అప్రమత్తతతో వ్యవహరించింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు, ఎంపీలను రంగంలోకి దించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కేంద్రంలో భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు ఇవి ఎంతో కీలకం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని భావించిన భాజపా అధిష్ఠానం రాష్ట్రంలో పలు అసెంబ్లీ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

పలుచోట్ల ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కారణంగా.. ఈ సారి వారి స్థానంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌ (దిమాని),  ప్రహ్లాద్‌ సింగ్ పటేల్‌ (నర్సింగ్‌పుర్), ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే (నివాస్‌ - ఎస్టీ రిజర్వ్‌)లతోపాటు ఆ పార్టీ నేత కైలాష్‌ విజయ్‌ వర్గీయ (ఇందౌర్‌-1), ఎంపీలు గణేష్ సింగ్ (సత్నా), రాకేష్‌ సింగ్ (జబల్‌పుర్‌), రితి పాఠక్‌ (సిద్ధి), ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌ (గదర్వారా) వంటి నేతల్ని బరిలో నిలబెట్టడం భాజపాను విజయానికి చేరువ చేశాయని చెప్పొచ్చు. దాంతోపాటు ప్రధాని మోదీ ఛరిష్మా కూడా భాజపా గెలుపునకు దోహదపడింది. 

యువత మద్దతు..

నైపుణ్యాభివృద్ధి కావాలంటే.. కమలం వికసించాలని ప్రధాని మోదీ (PM Modi) సహా భాజపా నేతలు చేసిన ప్రచారం మధ్యప్రదేశ్‌ యువ ఓటర్లను ప్రభావితం చేసింది. భాజపాలో యువతకు ప్రాధాన్యం లేదని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టిన కమల దళం.. వారిని ఆకట్టుకునేందుకు స్వయంగా ప్రధాని మోదీనే రంగంలోకి దించింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే కార్యక్రమంలో యువత భాగస్వామ్యం కావాలని.. రాబోయే 25ఏళ్ల భవిష్యత్తు ఇప్పుడు మీరు వేసే ఓటుపైనే ఆధారపడి ఉంటుందంటూ స్వయంగా ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన నినాదం యువ ఓటర్లను భాజపా వైపు మొగ్గుచూపేలా చేసింది. 

అయోధ్య దర్శనం హామీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూత్వ అంశం కూడా భాజపాకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగడం.. జనవరి 22న ఆలయం ప్రారంభం కావడం.. ఎన్నికల్లో భాజపాకు ప్రచారాస్త్రంగా మారింది. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామ మందిర దర్శనం ఉచితంగా కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా ప్రకటించింది. ఈ హామీని ఆ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. మరోవైపు రూ.450కే గ్యాస్‌ సిలిండర్‌, పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య వంటి వరాలు ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు దోహదపడ్డాయి.

‘మామ’ ప్రత్యేక పథకం.. మోదీ గ్యారంటీ

వివిధ వర్గాలను ఆకట్టుకునే పథకాల ద్వారా ‘మామ’గా శివరాజ్‌ సింగ్ చౌహాన్‌కు రాష్ట్రంలో పేరుంది. ఎన్నికల ముందు  ‘లాడ్లీ బెహన్‌ యోజన’ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని అర్హులైన మహిళల ఖాతాల్లో నెలకు రూ.1250 జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్‌ అంటూ కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించినప్పటికీ.. మహిళా సాధికారత కోసం భాజపా చేస్తున్న కృషికి ఇది నిదర్శనమంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. ఈ పథకం ద్వారా మహిళా ఓటర్లను ఆకర్షించడంలో భాజపా విజయం సాధించింది. మరోవైపు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌  ప్రవేశపెట్టిన పథకాలకు ‘జన ఆశీర్వాద యాత్ర’ పేరుతో భాజపా నాయకత్వం విస్తృత ప్రచారం కల్పించింది.

ఎన్నికల ముందు పీఎం కిసాన్‌ సాయాన్ని రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయడం, రైతులను గోధుమలు, వరికి మద్దతు ధర పెంపు, ఉచిత రేషన్‌ మరో ఐదేళ్లపాటు పొడిగించడం వంటి నిర్ణయాలు భాజపా విజయాన్ని ఖాయం చేయడంలో కీలకంగా పనిచేశాయని చెప్పొచ్చు.  

వారి ఓటు భాజపాకే

మధ్యప్రదేశ్‌లో 35 ఎస్సీ రిజర్వుడు స్థానాలున్నాయి. రాష్ట్రంలో ఒకప్పుడు బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP)కి మద్దతు పలికిన దళితులు.. 2003, 2008, 2013 మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధానంగా భాజపాకు అండగా నిలిచారు. దాంతో ఆ పార్టీ సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 2003లో కమలనాథులు వాటిలో 18 చోట్ల విజయం సాధించారు. 2008లో 22 స్థానాలు, 2013లో 31 సీట్లు వీరి ఖాతాలో పడ్డాయి. 2018లో భాజపా 18, కాంగ్రెస్‌ 17 సీట్లను దక్కించుకున్నాయి. ఈ సారి వారంతా భాజపావైపే మొగ్గు చూపడం కమలానికి కలిసొచ్చింది.

ఐదోసారి అధికారంలోకి..

మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల సరళిని పరిశీలిస్తే.. 2018 మినహా రాష్ట్ర ప్రజలు భాజపా వైపే మొగ్గు చూపారు. 2003లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 173 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చింది. అనంతరం 2008లో 143, 2013లో 165 స్థానాల్లో విజయం సాధించింది. 2018లో కాంగ్రెస్ 119, భాజపా 109 స్థానాలు గెలుచుకున్నాయి. రాష్ట్రంలో కమల్‌నాథ్‌ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. 2020లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో అధికారాన్ని కోల్పోయింది. ఆయన భాజపాకు మద్దతు తెలపడంతో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో భాజపా 163 సీట్లు గెలుచుకుని మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img