icon icon icon
icon icon icon

Royal Families: రాచరికమే అర్హత!

రాజ్యమున్నవారే రాజులు.. అట్టివారే కురు రాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు అని భీష్ముడంటే... ఓహో ‘రాచరికమా అర్హతను నిర్ణయించునది’ అని సుయోధనుడు వేసిన ప్రశ్న దానవీరశూర కర్ణ చిత్రం చూసిన వారందరికీ గుర్తుంటుంది.

Updated : 04 Apr 2024 16:05 IST

లోక్‌సభ బరిలో 10 మంది రాజవంశీయులు
టికెట్లిచ్చిన భాజపా
ఇప్పటికే రాజకీయాల్లో రాణిస్తున్న కొందరు

ఈనాడు, దిల్లీ: రాజ్యమున్నవారే రాజులు.. అట్టివారే కురు రాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు అని భీష్ముడంటే... ఓహో ‘రాచరికమా అర్హతను నిర్ణయించునది’ అని సుయోధనుడు వేసిన ప్రశ్న దానవీరశూర కర్ణ చిత్రం చూసిన వారందరికీ గుర్తుంటుంది. ద్వాపర యుగం నాటి సందర్భాన్ని గుర్తు చేసే ఆ ప్రశ్న ప్రస్తుత ప్రజాస్వామ్యంలోనూ ప్రాధాన్యాన్ని కోల్పోకుండా అలాగే నిలుస్తోంది. ప్రజలే ప్రభువులుగా భావించే ప్రజాస్వామ్యంలోనూ నాటి రాజవంశాల వారసులు టికెట్ల కోసం పోటీపడి చేజిక్కించుకుంటున్నారు. ఈసారి భాజపా నుంచి అత్యధికంగా 10 మంది రాజవంశీయులు పోటీ చేస్తున్నారు. మిగిలిన పార్టీల నుంచీ కొంత మంది బరిలో నిలుస్తున్నారు. భాజపా టికెట్లిచ్చిన 10 మందిలో ఆరుగురు మహిళలున్నారు. పోటీ చేస్తున్న 10 మందిలో యధువీర్‌, మహిమా కుమారి, అమృతా రాయ్‌, కృతీసింగ్‌ దేబ్‌బర్మ, మాళవిక కేసరీదేవ్‌ తొలిసారి ఎన్నికల గోదాలోకి దిగుతున్నారు. ఉదయన్‌ రాజే భోసలేకు టికెట్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తనకే టికెట్‌ ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చిందంటూ ఇప్పటికే ఆయన ప్రచారం ప్రారంభించారు.


మైసూరు: యధువీర్‌ కృష్ణదత్త చామరాజ వడయార్‌: భాజపా తొలిసారి మైసూరు నుంచి యధువీర్‌ను రంగంలోకి దింపుతోంది. వడయార్‌ కుటుంబం 1339లో సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. స్వాతంత్య్రానంతరం మైసూరు రాజు జయచామ రాజేంద్ర వడయార్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్‌ 1974లో రాజు అయ్యారు. ఆయన 1984, 1989, 1996, 1999లో కాంగ్రెస్‌ తరఫున మైసూరు ఎంపీగా గెలుపొందారు. 2013లో చనిపోయారు. ఆ తర్వాత రెండేళ్లకు యధువీర్‌ మైసూరు రాజుగా పట్టాభిషిక్తులయ్యారు. ఆయన మైసూరు 27వ రాజు. మసాచుసెట్స్‌ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యం, ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. 2016లో దుంగార్‌పుర్‌ యువరాణి త్రిషికను వివాహమాడారు. వీరికి రూ.80వేల కోట్ల విలువైన ఆస్తులున్నట్లు అంచనా.


పటియాలా: ప్రణీత్‌ కౌర్‌: పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, పటియాలా మహారాజు సర్‌ యాదవీంద్ర సింగ్‌ కుమారుడైన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సతీమణి ప్రణీత్‌ కౌర్‌. ఈమె మామ పటియాలా సంస్థానం చివరి రాజు. తండ్రి సర్దార్‌ జ్ఞాన్‌సింగ్‌ కహ్లోన్‌ సివిల్‌ సర్వెంట్‌. 1960లోనే పంజాబ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ప్రణీత్‌ కౌర్‌ పటియాలా లోక్‌సభ స్థానం నుంచి 1999, 2004, 2009, 2019లలో కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా విజయం సాధించారు. మధ్యలో ఎమ్మెల్యేగా సేవలందించారు. భర్త అమరీందర్‌ సింగ్‌ ఇటీవల భాజపాలో చేరిన నేపథ్యంలో ఆమె కాంగ్రెస్‌ సభ్యత్వానికి రాజీనామా చేసి భాజపాలో చేరారు.


రాజ్‌ సమంద్‌: మహిమా కుమారి విశ్వరాజ్‌ సింగ్‌ మేవాడ్‌: ఈమె మేవాడ్‌ రాజు మహారాణా ప్రతాప్‌ వారసుడు విశ్వరాజ్‌సింగ్‌ సతీమణి. భర్త ప్రస్తుతం మేవాడ్‌ నాథడ్వారా నుంచి భాజపా తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో భర్త విజయం కోసం శ్రమించారు. రాజ్‌పూత్‌లు అధికంగా ఉన్న రాజ్‌ సమంద్‌ స్థానం నుంచి 17వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన జైపుర్‌ రాజ కుటుంబానికి చెందిన దియా కుమారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో భాజపా నాయకత్వం ఆ స్థానంలో ఇప్పుడు మేవాడ్‌ రాజ వంశానికి చెందిన మహిమా కుమారిని రంగంలోకి దింపింది.


గ్వాలియర్‌: జ్యోతిరాదిత్య సింధియా: గ్వాలియర్‌ సంస్థానాన్ని చివరిగా పాలించిన జివాజీరావు సింధియా, విజయ రాజె సింధియాల మనవడే జ్యోతిరాదిత్య. తండ్రి మాధవరావ్‌ సింధియా ఇదివరకు రాజీవ్‌ గాంధీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. తల్లి కిరణ్‌ రాజ్యలక్ష్మీదేవి నేపాల్‌ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. తండ్రి మాధవరావ్‌ సింధియా హఠాన్మరణంతో 2002లో 31 ఏళ్ల వయస్సులో తొలిసారి ఎంపీ అయిన ఆయన 2019 వరకూ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు. గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2020లో కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి భాజపాలో చేరారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికై పౌర విమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. యూపీయే ప్రభుత్వ హయాంలో విద్యుత్తు, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు.


కలహండి: మాళవిక కేసరీ దేవ్‌:  ఈమె కలహండి రాజ కుటుంబ సభ్యురాలు. మాజీ ఎంపీ అర్కా కేసరీ దేవ్‌ సతీమణి. భర్త 2014లో ఇదే స్థానం నుంచి బిజూ జనతాదళ్‌ సభ్యుడిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు 1998, 1999, 2004లలో మాళవిక మామ బిక్రమ్‌ కేసరీ దేవ్‌ ఇదే కలహండి స్థానం నుంచి వరుసగా 3 సార్లు భాజపా ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో బిజూ జనతాదళ్‌ అర్కా కేసరీ దేవ్‌కు టికెట్‌ నిరాకరించడంతో భార్యా భర్తలిద్దరూ ఆ పార్టీని వీడి భాజపాలో చేరారు.


బొలంగీర్‌: సంగీత కుమారి సింగ్‌దేవ్‌: పట్నాగఢ్‌ రాజ కుటుంబానికి చెందిన కేవీ సింగ్‌దేవ్‌ సతీమణి సంగీత. భర్త ఇదివరకు ఒడిశా ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ఆమె ఇదే స్థానం నుంచి 1998, 1999, 2004, 2019లలో భాజపా తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. 2009, 2014లలో బిజూ జనతాదళ్‌ అభ్యర్థి అయిన కలికేశ్‌ నారాయణ్‌ సింగ్‌ చేతిలో ఓడిపోయారు.


సతారా: ఉదయన్‌ రాజే భోసలే: మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ వంశానికి చెందిన 17వ వారసుడు భోసలే. 1998-1999లో ఎమ్మెల్యేగా, శివసేన-భాజపా ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పని చేశారు. 2009, 2014, 2019లలో సతారా నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019 సెప్టెంబరులో ఎన్సీపీకి రాజీనామా చేసి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపాలో చేరారు. అదే సతారా నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసి ఓడిపోయారు. దీంతో 2020లో పార్టీ నాయకత్వం ఆయనను రాజ్యసభకు పంపింది. ఇప్పుడు మళ్లీ అదే నియోజకవర్గం నుంచి లోక్‌సభ బరిలోకి దింపుతోంది.


త్రిపుర ఈస్ట్‌: కృతీసింగ్‌ దేబ్‌బర్మ: త్రిపురలోని మాణిక్య రాజ కుటుంబ సభ్యురాలు కృతీసింగ్‌. కిరీట్‌ బిక్రమ్‌ కిశోర్‌ మాణిక్య దేబ్‌బర్మ కుమార్తె. ఛత్తీస్‌గఢ్‌ రాజ కుటుంబానికి చెందిన యోగేశ్వర్‌ రాజ్‌ సింగ్‌ను వివాహమాడారు. ఈమె సోదరుడు ప్రద్యోత్‌ దేబ్‌బర్మ ఆ రాష్ట్రంలోని టిప్రా మోతా పార్టీ వ్యవస్థాపకుడు. త్రిపుర ఈస్ట్‌ స్థానంలో ప్రస్తుతం భాజపా తరఫున ఉన్న రేబతి త్రిపురను తొలగించి భాజపా నాయకత్వం కృతీ సింగ్‌ను బరిలోకి దింపింది.


కృష్ణా నగర్‌: అమృతా రాయ్‌: మార్చి 20వ తేదీన భాజపాలో చేరి లోక్‌సభకు పోటీ చేస్తున్న ఈమె కృష్ణా నగర్‌ సంస్థానం రాజమాత. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని కృష్ణాచంద్ర రాయ్‌ పరిపాలించారు. ఆయనకు బెంగాల్‌లో గొప్ప రాజుగా పేరుంది. 18 ఏళ్లకే రాజ్య బాధ్యతలు చేపట్టిన ఆయన పాలనా సంస్కరణల ద్వారా ప్రజల్లో చెరగని ముద్ర వేశారు.


ఝాలావాడ్‌ బారా: దుశ్యంత్‌సింగ్‌: రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, గ్వాలియర్‌ చివరి రాజు జివాజీరావు సింధియా కుమార్తె వసుంధరా రాజె కుమారుడే దుశ్యంత్‌ సింగ్‌. 2004 నుంచి వరుసగా ఝాలావాడ్‌ బారా స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికవుతూ వస్తున్నారు. ధోల్‌పుర్‌ మహారాజుగా గుర్తింపు పొందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img