icon icon icon
icon icon icon

Ashok Gehlot: ‘కన్హయ్య లాల్‌ హంతకులకు భాజపాతో సంబంధాలు’: గహ్లోత్‌ సంచలన ఆరోపణ

Ashok Gehlot: ఉదయ్‌పుర్‌ దర్జీ కన్హయ్య లాల్‌ (Kanhaiya Lal)ను చంపేసిన నిందితులకు భాజపాతో సంబంధాలున్నాయని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఓ కేసులో వారిని భాజపా నేతలే విడిపించారని తెలిపారు.

Updated : 13 Nov 2023 12:38 IST

జైపుర్‌: రాజస్థాన్‌ (Rajatshan)లో గతేడాది సంచలనం సృష్టించిన టైలర్‌ కన్హయ్య లాల్‌ (Kanhaiya Lal) హత్య కేసుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్హయ్యను చంపేసిన హంతకులకు భాజపా (BJP)తో సంబంధాలున్నాయని ఆరోపించారు.

గత గురువారం ప్రధాని మోదీ ఉదయ్‌పుర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కన్హయ్యలాల్‌ హత్య గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉగ్రవాదులకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తుండటం వల్లే ఆ హత్య జరిగిందని గహ్లోత్ సర్కారును దుయ్యబట్టారు. దీంతో.. జోధ్‌పుర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని వ్యాఖ్యలపై సీఎం గహ్లోత్‌ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

‘‘అది (కన్హయ్య లాల్ హత్య) దురదృష్టకర ఘటన. ఆ రోజు ఘటన గురించి తెలియగానే నేను అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఉదయ్‌పుర్‌ వెళ్లా. కానీ, భాజపా అగ్ర నాయకులు మాత్రం తమ కార్యక్రమాల్లో బిజీగా ఉండిపోయారు. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించినా మేం అభ్యంతరం చెప్పలేదు. కానీ, ఎన్‌ఐఏ ఏం చర్యలు తీసుకుందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అదే రాష్ట్రానికి చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌నకు ఈ దర్యాప్తును అప్పగించి ఉంటే.. ఈపాటికే దోషులను న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చేవారు’’ అని గహ్లోత్‌ భాజపాపై విమర్శలు చేశారు.

దిల్లీవాసుల నిర్లక్ష్యం.. ‘వర్షం ఊరట’ను తుడిచిపెట్టిన టపాసుల మోత

ఇక, ఈ హత్య జరిగిన గంటల్లోనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల గురించి గహ్లోత్‌ మాట్లాడుతూ.. ‘‘ఉదయ్‌పుర్‌ ఘటన జరగడానికి కొద్ది రోజుల ముందు నిందితులిద్దరు మరో కేసులో అరెస్టయ్యారు. భాజపా నేతలు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వారిని విడిపించుకుని తీసుకెళ్లారు. కన్హయ్య హంతకులకు భాజపాతో సంబంధాలున్నాయి’’ అని ఆరోపించారు. త్వరలో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని భాజపా గ్రహించిందని, అందుకే ఇలాంటి అర్థం లేని ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు.

హత్య కేసు ఇదీ..

గతేడాది భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఉదయ్‌పుర్‌ దర్జీ కన్హయ్య లాల్‌ సోషల్‌ మీడియాలో మద్దతు తెలిపారు. తర్వాత ఆయనకు పలు సంస్థల నుంచి బెదిరింపులు వచ్చాయి. సామాజిక మాధ్యమల్లో వ్యాఖ్యలకు సంబంధించి కన్హయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలవ్వగా.. 2022 జులై 28న అతడు దారుణ హత్యకు గురయ్యారు. తన దుకాణంలో పనిచేసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు సాధారణ వినియోగదారుల్లా నటిస్తూ వచ్చి.. అతడిని అతి దారుణంగా కత్తితో నరికి హత్య చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌తో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img