icon icon icon
icon icon icon

పొన్నవోలుకు హడావుడిగా మేలు చేశారంటే మీకోసం పనిచేసినట్లేగా?: వైఎస్‌ షర్మిల

వైకాపా (YSRCP) పాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని.. ఇప్పుడు కొత్త దాన్ని ప్రజలు ఎలా నమ్మాలని సీఎం జగన్‌(YS Jagan)ను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు.

Updated : 28 Apr 2024 12:41 IST

విశాఖపట్నం: వైకాపా (YSRCP) పాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని.. ఇప్పుడు కొత్త దాన్ని ప్రజలు ఎలా నమ్మాలని సీఎం జగన్‌(YS Jagan)ను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. మద్యనిషేధం చేయకపోగా.. ప్రభుత్వమే విక్రయిస్తోందన్నారు. మెగా డీఎస్సీకి బదులు దగా డీఎస్సీ ఇచ్చారని ఆక్షేపించారు. ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని నిలదీశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. జగన్‌పై ఆయన స్వామిభక్తిని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. 

పాత హామీలే నెర్చవేర్చనపుడు కొత్త మ్యానిఫెస్టోకు విలువేంటి?

‘‘ఐదు సంక్రాంతులు వెళ్లాయి.. ఒక్క జాబ్‌ క్యాలెండర్ ఇచ్చారా? యువతకు ఎందుకు ఉద్యోగావకాశాలు కల్పించలేదు?ప్రభుత్వశాఖల్లోని ఖాళీలను ఇంతవరకు ఎందుకు భర్తీ చేయలేకపోయారు? మీ కార్యకర్తలకు మాత్రం వాలంటీర్‌ పోస్టులు ఇచ్చారు. వాటిని ప్రభుత్వ ఉద్యోగాలుగా చెబుతారా? ఎన్నికల ముందు హడావుడిగా డీఎస్సీ ఇస్తారా? జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులను పూర్తిచేస్తామని గత మ్యానిఫెస్టోలో వైకాపా హామీ ఇచ్చింది. ఒక్క ప్రాజెక్టునూ ఎందుకు పూర్తిచేయలేకపోయారు. రైతులకు ధరల స్థిరీకరణ నిధి పేరిట రూ.3వేల కోట్లు కేటాయిస్తామన్నారు.. ఒక్క ఏడాదైనా కేటాయించారా? మీ హామీలను మీరే నిలబెట్టుకోలేనపుడు ప్రజలు ఎలా నమ్ముతారు.. వైకాపాను ఎందుకు నమ్మాలి? పాత మ్యానిఫెస్టోలోని హామీలనే నెరవేర్చనపుడు.. కొత్తదానికి విలువేముంటుంది?

జగన్‌ ఆదేశాల మేరకే పొన్నవోలు పిటిషన్లు

ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు. మహిళ అనే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలినైన నన్ను ఏకవచనంతో సంబోధిస్తున్నారు. నిజానికి అక్రమాస్తుల కేసు ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌ఆర్‌ పేరును సీబీఐ చేర్చలేదు. దాని నుంచి బయటపడాలంటే వైఎస్‌ఆర్‌ పేరును ఛార్జిషీట్‌లో చేర్చాలనేది జగన్‌ ఉద్దేశం. ఆయన ఆదేశాల మేరకే 3 కోర్టుల్లో పొన్నవోలు పిటిషన్లు వేశారు. వైఎస్‌ఆర్‌ అంటే గౌరవమంటూనే ఆయన పేరును చేర్చాలని తిరుగుతారా? 2019 మే 30న జగన్‌ సీఏంగా పదవి చేపట్టిన 6 రోజుల్లోనే జూన్‌ 6న పొన్నవోలుకు ఏఏజీ పోస్టు కట్టబెట్టారు. ఏ సంబంధమూ లేకపోతే ఆయనకు ఏఏజీగా ఎందుకు అవకాశం ఇచ్చారు?తండ్రి పేరును ఛార్జిషీట్‌లో చేర్చేలా చేసిన వ్యక్తికి పదవి ఎందుకు కట్టబెట్టారు?హడావుడిగా ఆ మేలు చేశారంటే మీకోసం పనిచేసినట్లేగా?’’ అని జగన్‌ను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img

నియోజకవర్గ సమాచారం