AP High Court: ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు.. అనుమతిపై హైకోర్టు స్టే

సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్‌జీటీ) పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే రూల్‌పై ఏపీ హైకోర్టు స్టే విధించింది.

Updated : 21 Feb 2024 12:25 IST

అమరావతి: సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్‌జీటీ) పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఆ అభ్యర్థులను అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టులకు అనుమతించడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తొలుత మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు.. నేటికి వాయిదా వేసింది.  బీఈడీ అభ్యర్థులను అనుమతించే రూల్‌పై బుధవారం స్టే విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.

మంగళవారం జరిగిన విచారణలో ఉన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని ప్రాథమికంగా తప్పుపట్టింది. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకొనేది లేదని తేల్చిచెప్పింది. ఒకానొక దశలో డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది. హాల్‌ టికెట్లు జారీచేయవద్దని వ్యాఖ్యానించింది. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) శ్రీరామ్‌ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వొద్దని అభ్యర్థించారు. హాల్‌ టికెట్లను ఈనెల 22 నుంచి జారీచేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కోర్టుకు వివరాలు సమర్పించేందుకు విచారణను 21కి వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టి తాజా ఆదేశాలు ఇచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని