Ts High Court: ఐఏఎస్‌ అధికారులకు తెలంగాణ హైకోర్టులో ఊరట

ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినా తెలంగాణలో కొనసాగుతోన్న ఐఏఎస్‌ అధికారులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

Published : 03 Jan 2024 20:05 IST

హైదరాబాద్‌: క్యాట్‌ ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. కేటాయింపులపై అభ్యంతరాలున్న అఖిలభారత సర్వీసు అధికారుల విజ్ఞప్తులను మరోసారి పరిగణనలోకి తీసుకొని తిరిగి కేటాయింపులు జరపాలని హైకోర్టు ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. అప్పటి వరకు ఆయా ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ప్రస్తుతం విధులు నిర్వహిస్తోన్న రాష్ట్రాల్లోనే కొనసాగొచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.

విభజన సమయంలో ఏపీకి కేటాయించినా.. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (CAT) ఉత్తర్వులతో 13 మంది ఐఏఎస్‌ అధికారులు తెలంగాణలోనే కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు విషయంలో క్యాట్‌ తన పరిధి దాటి వ్యవహరించిందని అదనపు సోలిసిటర్‌ జనరల్‌ నరసింహశర్మ కోర్టుకు తెలిపారు. కేటాయింపు సమయంలో కేవలం ప్రత్యూషసిన్హా కమిటీ నిర్దేశకాలను పరిగణనలోకి తీసుకున్నారని.. ర్యాంకు, స్థానికత, రిజర్వేషన్‌, పదోన్నతి వంటి విషయాలను పట్టించుకోలేదని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.

సివిల్స్ ద్వారా ఎంపికైన వారికి... పదోన్నతుల ద్వారా వచ్చిన అధికారులను ఒకే విధంగా పరిగణించి కేటాయింపులు చేశారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపున వాదనలు విన్న ధర్మాసనం క్యాట్ ఉత్తర్వులను కొట్టేసింది. అధికారుల కేటాయింపు కేవలం డీవోపీటీ పరిధిలోనే ఉంటుందని తెలిపింది. కేటాయింపులపై క్యాట్ ఉత్తర్వులు ఇవ్వకుండా డీవోపీటీని ఆదేశించి ఉండాల్సిందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం తిరిగి కేటాయింపులు జరిపే వరకు ఐఏఎస్‌ అధికారులు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే ఉండొచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని