CM Revanth Reddy: రాజేంద్రనగర్‌లో హైకోర్టు భవనం.. జనవరిలో శంకుస్థాపన: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రస్తుత హైకోర్టు శిథిలావస్థకు చేరుకున్నందున రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 14 Dec 2023 21:02 IST

హైదరాబాద్‌: ప్రస్తుత హైకోర్టు శిథిలావస్థకు చేరుకున్నందున రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సీఎం రేవంత్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శేషాద్రి, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్‌ అధికారి నవీన్‌ మిత్తల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని న్యాయస్థానాల స్థితిగతులు, వసతులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రధానంగా ఇప్పుడున్న హైకోర్టు శిథిలావస్థకు చేరుకుందని హైకోర్టు సీజే.. సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం.. ఎక్కడ వంద ఎకరాలకంటే ఎక్కువ ప్రభుత్వ స్థలం ఉందో అధికారులను అడిగి వివరాలు తీసుకున్నారు. రాజేంద్రనగర్‌ ప్రాంతంలో ఉందని అధికారులు తెలియజేయడంతో.. అక్కడ భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జనవరిలో శంకుస్థాపన చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చొరవ చూపాలని హైకోర్టు సీజే.. సీఎం దృష్టికి తెచ్చారు. ఇందుకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణాలు అవసరమవుతాయో.. ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పుడున్న హైకోర్టు భవనం హెరిటేజ్‌ బిల్డింగ్‌ అయినందున.. దానిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఉందని సీఎం గుర్తు చేశారు. ఆ భవనాన్ని రెనొవేషన్‌ చేసి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టు భవనాలకు వినియోగించుకునేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని