ఎస్సైల పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లు!

ఫేస్‌బుక్‌లో ఎస్సై చిత్రాలు ప్రొఫైల్‌ పిక్స్‌గా పెట్టుకొని నయా దందాకు పాల్పడుతున్న ఘటన ప్రకాశం జిల్లా అద్దంకిలో వెలుగు చూసింది. ప్రకాశం జిల్లాలో నేరగాళ్లు ఏకంగా పోలీసు శాఖనే వాడుకుంటున్నారు.

Published : 06 Sep 2020 01:06 IST

పోలీసుల మిత్రులను బురిడీ కొట్టిస్తున్న దుండగులు

అద్దంకి: ఫేస్‌బుక్‌లో ఎస్సై చిత్రాలు ప్రొఫైల్‌ పిక్స్‌గా పెట్టుకొని నయా దందాకు పాల్పడుతున్న ఘటన ప్రకాశం జిల్లా అద్దంకిలో వెలుగు చూసింది. ప్రకాశం జిల్లాలో నేరగాళ్లు ఏకంగా పోలీసు శాఖనే వాడుకుంటున్నారు. అద్దంకి ఎస్సై మహేశ్‌ ఫొటోతో దుండగుడు ఫేస్‌బుక్‌లో కొత్త ఖాతా తెరిచాడు. అతడి ఫేస్‌బుక్‌లో ఉన్న స్నేహితులతో మెసెంజర్‌లో చాటింగ్‌  చేశాడు. అలా పరిచయం పెరిగాక తనకు అత్యవసరం ఉందని డబ్బులు అడిగేవాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై మహేశ్‌ మిగిలిన స్నేహితులను అప్రమత్తం చేశారు. అది తన ఫేస్‌బుక్‌ ఖాతా కాదని తెలియజేశారు.

మరోవైపు పోలీసులు విచారణ చేయగా నెల్లూరు జిల్లాలో మరో ఇద్దరు ఎస్సైల పేరుతో అపరిచిత వ్యక్తులు కొత్త రకం మోసం చేస్తున్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. దుండగులు ఫేస్‌బుక్‌ను హ్యాక్‌ చేయడం కాకుండా ప్రముఖ వ్యక్తుల ఖాతాలోని ప్రొఫైల్‌ పిక్‌ తీసుకొని కొత్త అకౌంట్‌ తెరుస్తున్నారని తెలిపారు. పోలీసుల ఖాతాల్లో ఉన్న మిత్రులకు ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపి వారితో చాటింగ్‌ చేస్తున్నారని, అత్యవసరం ఉందని డబ్బులు అడుగుతున్నారని చెప్పారు. తర్వాత ముఖం చాటేస్తున్నారని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని