Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Apr 2024 17:07 IST

1. రాహుల్‌ గాంధీకి స్వల్ప అస్వస్థత.. ఇండియా కూటమి ర్యాలీకి దూరం

నేడు రాంచీలో విపక్ష ఇండియా కూటమి (INDIA bloc) మెగా ర్యాలీ నిర్వహించనుంది. దీనికి కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) హాజరు కావడం లేదు. ఆయన స్వల్ప అనారోగ్యానికి గురికాడమే దీనికి కారణమని పార్టీ ఆదివారం వెల్లడించింది. ‘‘రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఈరోజు సతనా, రాంచీలోని ఎన్నికల ప్రచారానికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. కానీ, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు’’అని జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాగేసుకుంటున్నారు: వైఎస్‌ షర్మిల

న్యాయ రాజధాని అంటే ఇదేనా అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. ‘‘కర్నూలును స్మార్ట్‌ సిటీ చేస్తామన్నారు.. కనీసం మంచినీళ్లు లేవు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ నగర వాసులకు నీళ్లు వచ్చేవి. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది’’ అని షర్మిల అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. అనపర్తి భాజపా అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి?

తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటుపై కూటమిలో గత కొంత కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రామకృష్ణారెడ్డి భాజపా అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేయనున్నారని వెల్లడించారు. తెలుగుదేశం వీడుతున్నందుకు ఎంతో బాధ ఉన్నా.. పొత్తులో కూటమి అభ్యర్థిగానే రామకృష్ణారెడ్డి ఉంటారని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన చంద్రబాబు

ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) బీ ఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఆదివారం ఉదయం అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. కావలిలో బరితెగింపు.. వార్డు సచివాలయంలోనే మద్యం నిల్వ

క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాలు అక్రమాలకు నిలయంగా మారాయి.  ఇన్నాళ్లు అధికార వైకాపాకు జాగీరుగా ఉన్న ఈ సచివాలయ వ్యవస్థ నేడు ఎన్నికల నియమావళిని సైతం కాలదన్ని మద్యం నిల్వ చేసే స్థావరాలుగా మారుతున్నాయి. ఆదివారం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఈ వ్యవహారంపై దుమారం రేగింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్‌ కుర్రాడి సక్సెస్‌ స్టోరీ!

 ‘బాగా చదువుకోకపోతే గాడిదలు కాయాల్సి వస్తుంది’ అంటూ పెద్దవాళ్లు మందలిస్తుంటారు. అలాంటివారు గుజరాత్‌కు చెందిన ధీరేణ్‌ సోలంకీ స్టోరీ వింటే మాత్రం అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే గాడిదల పెంపకంతో అతడు నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నాడు. దేశవ్యాప్తంగానూ గాడిదల పెంపకానికి క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. జీతం తక్కువైనా ఐఏఎస్‌ కావాలని ఎందుకనుకుంటారో...ఓ సీఏ పోస్టు వైరల్‌

ఐఏఎస్‌ అధికారి కావడమనేది మన దేశంలో యువతకు ఓ కల. దానికోసం ఎందరో అభ్యర్థులు సంవత్సరాల తరబడి కష్టపడతారు. ప్రజలు ఆ ఉద్యోగానికి ఇచ్చే గౌరవమర్యాదలు ప్రత్యేకమైనవి. అయితే ప్రస్తుతం ఓ చార్టెడ్‌ అకౌంటెంట్‌(సీఏ) సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. జీతం తక్కువని తెలిసినా  యువత ఐఏఎస్ అవ్వాలని ఎందుకనుకొంటారో అర్థం కాదు అని చిరాగ్‌ చౌహాన్‌ అనే సీఏ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. వచ్చే ఐదేళ్లలో పేదలకు 3 కోట్ల ఇళ్లు : కిషన్‌రెడ్డి

వచ్చే ఐదేళ్లలో దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాల వారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో 3 కోట్ల ఇళ్లను మోదీ ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో సంకల్ప పత్రాన్ని ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఇంకా అవినీతి, బంధుప్రీతిని వదిలిపెట్టలేదని విమర్శించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. యూజీసీ నెట్‌ (జూన్‌) నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే యూజీసీ నెట్ పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే పెన్ను, పేపర్‌ (ఓఎంఆర్‌ షీట్‌) ఆధారిత పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలైనట్లు యూజీసీ (UGC) వెల్లడించింది. ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా జూన్‌ 16న NTA ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. రాజకీయాల్లోనే ఉంటా.. గుజరాత్‌ ‘పఠాన్‌’ బెంగాల్‌లో పోటీ!

తాను రాజకీయాల్లో కొనసాగేందుకే ఇక్కడకు వచ్చానని, స్థానిక ప్రజల కోసమే పని చేస్తానని మాజీ క్రికెటర్‌, టీఎంసీ నేత యూసఫ్‌ పఠాన్‌ (Yusuf Pathan) పేర్కొన్నారు. గుజరాత్‌కు చెందిన ఆయన.. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌కు ప్రత్యర్థిగా బరిలో ఉన్నారు. అన్నిరకాల క్రికెట్‌ ఫార్మాట్‌ల నుంచి 2021లోనే రిటైరైన పఠాన్‌.. ప్రస్తుతం బహరంపుర్‌ లోక్‌సభ స్థానం (Lok Sabha Elections) నుంచి పోటీలో ఉన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని