Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 May 2024 09:10 IST

1. సచివాలయ ఉద్యోగులపై కత్తి!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మెడపై ప్రభుత్వం బయోమెట్రిక్‌ హాజరు కత్తి పెట్టనుంది. హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని ఉన్నతాధికారుల నిర్ణయించి.. అందుకు తగ్గట్లు కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. కాగా ఇప్పటికే మూడు నెలలు లెక్కలు తీసే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. నెలలో ఉద్యోగుల సరాసరి హాజరు 35-40 శాతం మించి ఉండటం లేదు. దీంతో వారి జీతాల్లో కోత వేసే పనిలో ఉన్నట్లు ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. పూర్తి కథనం

2. స్టేషన్లు పరిమితమే!

విమానాశ్రయం వరకు ప్రతిపాదిత మెట్రో రైలు రెండో భాగం అలైన్‌మెంట్‌ కొలిక్కి వచ్చింది. నాగోల్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 29 కి.మీ.మార్గాన్ని మెట్రో రెండోదశలో ప్రతిపాదించారు. సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌)పై కన్సల్టెంట్లు, మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు. నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కి.మీ. మొదటి భాగం మార్గానికి అధికారులు ఇదివరకే కసరత్తు పూర్తిచేయగా.. రెండో భాగం చాంద్రాయణగుట్ట నుంచి జల్‌పల్లి మీదుగా విమానాశ్రయం వరకు 15 కి.మీ. దూరం ఉంటుంది. పూర్తి కథనం

3. శివయ్య దర్శనం.. ఆన్‌లైన్‌ అంతరాయం

మల్లన్న భక్తులను వెబ్‌సైట్‌ ముప్పుతిప్పలు పెడుతోంది. ఏడాది కిందట అందుబాటులోకి తీసుకొచ్చినా ఆధునికీకరించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక లాగిన్‌ ద్వారా నిత్యం రెండు ఆర్జిత సేవల టికెట్లు, ఐదు స్పర్శ దర్శనం టికెట్లు పొందేలా విధించిన షరతులు ఇబ్బందికరంగా మారాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు బుకింగ్‌ చేసే క్రమంలో రాని పక్షంలో వారం రోజుల్లో భక్తులకు తిరిగి నగదు చెల్లించే ప్రక్రియా సక్రమంగా సాగడం లేదు. పూర్తి కథనం

4. ఎస్పీ పేరిట ఫేస్‌బుక్‌ నకిలీ ఖాతా

అధికారులు, ప్రముఖ వ్యాపారుల పేరిట ఫేస్‌బుక్‌ నకిలీ ఖాతాలు తెరుస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. ఏకంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా రూపొందించినట్లు బుధవారం ఎస్పీ కార్యాలయ బృందం గుర్తించారు. నిజమైన ఎస్పీ ఫేస్‌బుక్‌ ఖాతాకు 4600 స్నేహితులు ఉండగా, సైబర్‌ నేరగాళ్లు తెరిచిన ఖాతాకు కేవలం 754 మంది మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. పూర్తి కథనం

5. ఓటు.. వారికి జీవన్మరణ సమస్య!

పట్టణాల్లో కొందరికి పోలింగ్‌ అంటే సెలవు దినం.. ఓటేయడానికి అరగంట కూడా లైన్లో నిల్చోలేనంత బద్ధకం.. నేనొక్కణ్నే ఓటేయకపోతే ఏమవుతుందనేంత నిర్లక్ష్యం.. పల్నాడు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వారికి మాత్రం ఓటేయడం అంటే జీవితాల్ని పణంగా పెట్టడమే. పూర్తి కథనం

6. ఏపీలో జూన్‌లోనూ పింఛనుదార్లకు తిప్పలే

వచ్చే నెలలోనూ రాష్ట్రంలో సామాజిక పింఛను లబ్ధిదారులకు అవస్థలు తప్పేలా లేవు. జూన్‌ 1న 47.74 లక్షల మంది పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో సామాజిక భద్రత పింఛన్ల నగదును జమ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ తెలిపారు. మిగతా 17.56 లక్షల మందికి ఇళ్ల దగ్గరే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా అందిస్తామని వెల్లడించారు.  పూర్తి కథనం

7. స్టాంపు లేకపోతే ఆమోదించకూడదని లేదు

పోస్టల్‌ బ్యాలట్‌ డిక్లరేషన్‌ ఫాంపై గెజిటెడ్‌ అధికారి స్టాంపు లేకపోయినా, బ్యాలట్‌ పేపర్‌పై ఫాస్‌ మెయిల్‌ లేకపోయినా, బ్యాలట్‌ కవర్‌పై ఓటరు సంతకం లేకపోయినా ఈ మూడు సందర్భాల్లో ఎక్కడా పోస్టల్‌ బ్యాలట్‌ను తిరస్కరించకూడదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు. పూర్తి కథనం

8. అమ్రాబాద్‌ అభయారణ్యంలో.. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం

అమ్రాబాద్‌ పెద్దపులుల అభయారణ్యంలో ఒకసారి వాడి పారేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ను నిషేధించాలని అటవీ శాఖ నిర్ణయించింది. జులై 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. ప్లాస్టిక్‌ నీళ్ల బాటిళ్లు అనుమతించరు. పైలట్‌ ప్రాజెక్టుగా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో అమలుచేశాక.. దశలవారీగా రాష్ట్రంలోని ఇతర అభయారణ్యాల్లో అమలుచేసే అవకాశముందని అటవీ శాఖ అధికారి ఒకరు తెలిపారు. పూర్తి కథనం

9. ఫోన్‌ ట్యాపింగ్‌ సామాన్య నేరం కాదు.. 

ఫోన్‌ ట్యాపింగ్‌ సామాన్య నేరం కాదని, అది దేశద్రోహం లాంటిదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు. ట్యాపింగ్‌ కోసం గతంలో కేసీఆర్‌ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దిల్లీలోని తన నివాసంలో బుధవారం లక్ష్మణ్‌ విలేకర్లతో మాట్లాడారు. పూర్తి కథనం

10. ‘మోదీజీ! స్నేహితుడన్నారు.. ఫోను చేసి కనుక్కోవచ్చుగా!’

భాజపాకు చెందిన ఒడిశా, దిల్లీ నేతలు చాలామంది తన ఆరోగ్యంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. నెల రోజులుగా ఎన్నికల ప్రచార నిమిత్తం రాష్ట్రమంతా తిరుగుతూ తాను బాగానే ఉన్నానని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బుధవారం స్పష్టం చేశారు. ‘‘నేను తనకు మంచి మిత్రుణ్నని ఆయన (ప్రధాని మోదీ) ఇంతకుముందు బహిరంగంగా చెప్పారు.  పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని