Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Jul 2023 13:06 IST

1. సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని.. డీఐజీ ఆత్మహత్య

సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని తమిళనాడు(Tamil Nadu)కు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. డీఐజీ ర్యాంకుకు చెందిన ఆయన శుక్రవారం తన నివాసంలోనే ప్రాణాలు తీసుకున్నారు. ప్రాథమిక వివరాల ప్రకారం.. సి. విజయ్‌ కుమార్‌.. కోయంబత్తూర్‌ సర్కిల్‌ (Coimbatore Circle)లో డీఐజీ హోదాలో పనిచేస్తున్నారు. ఆ నగరానికి చెందిన రెడ్‌ఫీల్డ్స్‌లోని క్వార్టర్స్‌లో తన కుటుంబంతో కలిసి ఆయన నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘థ్రెడ్స్‌’పై దావా వేస్తాం.. మెటాను హెచ్చరించిన ట్విటర్‌

గత కొన్ని రోజులుగా అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ (Twitter)కు ఇప్పుడు ‘థ్రెడ్స్‌ (Threads)’ రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది. మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా (ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ మాతృసంస్థ) తీసుకొచ్చిన ఈ కొత్త యాప్‌నకు విశేష ఆదరణ లభించింది. ప్రారంభించిన ఒక్క రోజులోనే దాదాపు 5 కోట్లకు పైగా యూజర్లను సొంతం చేసుకొంది. అయితే, 24 గంటలు గడవకుముందే ఈ యాప్‌ న్యాయపరమైన సమస్యలో చిక్కుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కలుషితాహారం తిని.. 70 మంది విద్యార్థినులకు అస్వస్థత

తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో కలుషిత ఆహారం కలకలం రేపింది. రాత్రి తీసుకున్న భోజనం వికటించి 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ కేజీబీవీలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు మొత్తం 210 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నిన్న రాత్రి వీరికి వంకాయ, సాంబారుతో కూడిన ఆహారాన్ని వడ్డించారు. రాత్రి భోజనం అయ్యాక 11 గంటల ప్రాంతంలో విద్యార్థినులకు కడుపునొప్పి ప్రారంభం కావడంతో ఒక్కొక్కరుగా సిబ్బంది దగ్గరకి వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వన్డే వరల్డ్ కప్‌ టాప్-10.. భారత్‌ మ్యాచ్‌ల అప్‌డేటెడ్‌ షెడ్యూల్‌

వన్డే ప్రపంచ కప్ 2023 (ODI World Cup 2023) టైటిల్‌ కోసం బరిలోకి దిగే పది జట్లు తేలిపోయాయి. భారత్‌తోపాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ టాప్‌-8లో ఉన్నాయి. ఇక అర్హత మ్యాచ్‌లో బలమైన జట్లను దాటుకొని నెదర్లాండ్స్‌ టాప్‌-10లోకి చేరింది. అంతకుముందు శ్రీలంక అందరికంటే ముందు క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లతోనే అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో పది జట్లు సిద్ధమైపోయాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 4 బోగీలు దగ్ధం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హావ్‌డా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. తొలుత S4,S5 బోగీల్లో దట్టమైన పొగలు వస్తున్నట్లు సిబ్బంది గుర్తించి లోకోపైలట్‌కు సమాచారం అందించారు. దీంతో రైలును పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య నిలిపివేశారు. భయాందోళనలతో ప్రయాణికులంతా కిందికి దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మంటలు క్రమంగా  6 బోగీలకు వ్యాపించాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ

‘మోదీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసు (Defamation Case)లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి ఎదురుదెబ్బ తగిలింది. తనకు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు (Gujarat HC) కొట్టేసింది. ఈ కేసులో సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. ‘రాహుల్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 కేసులను ఎదుర్కొంటున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పోస్టల్ లో 12 వేల పోస్టులు.. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు తొలి జాబితా వచ్చేసింది

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్‌లో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్(GDS)ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం  దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల తొలి జాబితాను(మణిపుర్ మినహా) తపాలా శాఖ విడుదల చేసింది. మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 118 పోస్టులు వుండగా, తెలంగాణలో 96 చొప్పున ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. USA: రహస్యంగా దాచిన రసాయన ఆయుధాల ధ్వంసం..!

అమెరికా(USA) ఒకప్పుడు అత్యంత రహస్యంగా నిల్వ చేసిన రసాయన ఆయుధాల(chemical weapons ) చివరి విడత నిల్వల ధ్వంసం మొదలైంది. కొలరాడోలో ఆ దేశ సైన్యానికి చెందిన రసాయన డిపోల్లో వీటిని ధ్వంసం చేసే ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా చేపట్టింది. దీనికోసం రోబోలను కూడా తెప్పించారు. ఈ డిపోలో అత్యంత ప్రమాదకరమైన ‘మస్టర్డ్‌ ఏజెంట్స్‌’తో చేసిన శతఘ్ని తూటాలున్నాయి. వీటిని రోబోలు జాగ్రత్తగా విడదీసి, కడిగి, దాదపు 1,500 ఫారెన్‌హీట్‌ ఉష్ణానికి గురి చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇదేం పని పెద్దారెడ్డి..: జేసీ ప్రభాకర్‌ రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రైతులకు రావాల్సిన పరిహారాన్ని స్వాహా చేస్తున్నారని మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆరోపించారు. బత్తాయి మొక్కలు నాటిన ఏడాదికే పంట నష్టం పరిహారం కింద ₹13.89లక్షలు పెద్దారెడ్డి రాయించుకున్నారని చెప్పారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన జాబితాలో కేతిరెడ్డి పేరుందంటూ ఆధారాలు మీడియాకు చూపించారు. ఎమ్మెల్యేకు భయపడి అధికారులు పరిహారం ఇస్తున్నారన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. శాంసంగ్‌ ఫ్లిప్‌, ఫోల్డబుల్‌ ఫోన్ల లాంచ్‌ డేట్‌ ఇదే.. ప్రీ బుకింగ్స్‌ షురూ

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ (Samsung) రెండు కొత్త ఫోల్డబుల్‌ మొబైల్స్ ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించింది. గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5 (Galaxy Z Fold 5), గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5 (Galaxy Z Flip 5) పేరుతో వీటిని తీసుకురానుంది. దీంతో తన ఫోల్డబుల్‌ మొబైల్‌ శ్రేణిలో మరో రెండు కొత్త మోడల్స్‌ వచ్చి చేరనున్నాయి. ఈ మొబైల్స్‌ జులై 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నాయి. వీటిని ముందుగానే కొనుగోలు చేయాలనుకొనే వారికి ప్రీ బుకింగ్స్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని