Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Sep 2023 13:08 IST

1. సీఐడీ కస్టడీ పిటిషన్‌పై 18 వరకు విచారణ చేపట్టొద్దు: హైకోర్టు ఆదేశం

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈనెల 19కి హైకోర్టు వాయిదా వేసింది. క్వాష్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సీఐడీ సమయం కోరగా.. హైకోర్టు అంగీకరించింది. మరోవైపు సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పై ఈనెల 18 వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వైకాపాలో వర్గవిభేదాలు.. మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో వైకాపా వర్గవిభేదాలు బయటపడ్డాయి. మండలానికి చెందిన ముఖ్యనేత దండపాణికి వ్యతిరేకంగా మరో వర్గం ఆందోళనకు దిగింది. మోరసనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన నేపథ్యంలో ఐదు గ్రామాలకు చెందిన వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకుని మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దండపాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గొంతు కోసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య

హైదరాబాద్‌ శివారు పటాన్‌చెరు పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఇస్నాపూర్‌లోని లక్డారం గేటు సమీపంలో 65వ నంబర్‌ జాతీయ రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో వ్యాపారిని గొంతు కొసి చంపారు. హతుడు నిర్మల్‌ జిల్లా భైంసా వాసి అబ్దుల్‌ నదీమ్‌ తాహే(28)గా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అప్పటి బస్సు డ్రైవర్‌.. ఇప్పుడు టీమ్‌ ఇండియా త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌

భారత క్రికెట్‌ జట్టులో ప్రస్తుతం ఎవరెవరున్నారనేది ఆటను అనుసరించే వాళ్లకు తెలుసు. అదే క్రికెట్‌ పిచ్చి ఉన్న అభిమానులకు అయితే కోచింగ్, సహాయక సిబ్బంది పేర్లు కూడా తెలుసు. కానీ నువాన్‌ సెనెవిరత్నె (Nuwan Seneviratne) ఎవరు? అంటే మాత్రం సమాధానం చెప్పడం కష్టమే. టీమ్‌ఇండియా (Team India) డైహార్డ్‌ అభిమానులకూ అతనెవరో తెలిసి ఉండదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈ ఏడాదిలో 25వ ఘటన: కోటాలో కలవరపెడుతోన్న విద్యార్థుల ఆత్మహత్యలు

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 25కి చేరింది.వివరాల్లోకి వెళ్తే..  రాంచి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని. NEETకు సిద్ధమవుతోంది. శిక్షణ కోసం హాస్టల్‌లో ఉంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అనుమానాస్పదంగా చైనా బ్యాగులు.. జీ20 వేళ 12 గంటలు హైడ్రామా..!

భారత్‌ అధ్యక్షతన వారాంతంలో జీ20 శిఖరాగ్ర సదస్సు(G20 Summit) ఘనంగా జరిగింది. ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన అధినేతల రక్షణకు కేంద్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చైనా(China) ప్రతినిధుల బృందం వెంట ఉన్న కొన్ని బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడం కలకలం సృష్టించింది. దాంతో 12 గంటల పాటు హైడ్రామా చోటుచేసుకుందని వార్తా కథనాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. విమానం గాల్లో ఉండగా.. బాత్‌రూంలో ఓ జంట నిర్వాకం

విమానాల్లో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం తరచూ వార్తల్లో చూస్తున్నాం. తాజాగా విమానం గాల్లో ఉండగా.. ఓ జంట బాత్‌రూంలో అభ్యంతరకర స్థితిలో దొరికిపోయింది. ఈ ఘటన యూకేలోని లూటన్‌ నుంచి ఇబిజాకు వెళుతున్న విమానంలో చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈజీ జెట్‌ సంస్థకు చెందిన విమానం (EasyJet Flight) ఇబిజాకు బయలుదేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జీ20 సెక్రటేరియట్‌లో ప్రధాని ఆకస్మిక పర్యటన!

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సుష్మా స్వరాజ్‌ భవన్‌లోని జీ20 సెక్రటేరియట్‌ (G20 secretariat)లో మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఆయనతో పాటు విదేశాంగమంత్రి ఎస్‌ జై శంకర్‌ ( S Jaishankar) కూడా పాల్గొన్నారు. భారత్‌ నేతృత్వంలో జీ20 సదస్సు విజయవంతంగా ముగిసింది. అందుకు జీ20 సెక్రటేరియట్‌లో ఉన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)లోని అధికారుల కృషి ఎంతో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భాజపాలో చేర్చుకోకపోవడంపై చీకోటి ప్రవీణ్‌ ఘాటు వ్యాఖ్యలు

తనను భాజపా (BJP)లో చేర్చుకోకపోవడంపై చీకోటి ప్రవీణ్‌ (Chikoti Praveen) ఘాటుగా స్పందించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. తనంటే భయం ఏంటో అర్థమైందని, ఏ శక్తులు తనని ఏమీ చేయలేవని అన్నారు. ‘కుళ్లు రాజకీయాలు చేస్తున్న వాళ్లకు సవాల్‌ విసురుతున్నా. మీలా వెన్నుపోటు రాజకీయాలు నాకు రావు. మీ రాజకీయం మీరు చేయండి.. నా రాజకీయం నేను చేస్తా’ అని చీకోటి పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. టైప్‌-సి పోర్ట్‌.. యాక్షన్‌ బటన్‌.. ఐఫోన్‌ 15 సిరీస్‌లో కొత్త మార్పులివే!

కొత్త ఉత్పత్తుల విడుదల కోసం టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఏటా నిర్వహించే కార్యక్రమం మంగళవారం రాత్రి వండర్‌లస్ట్‌ పేరిట కాలిఫోర్నియాలో అట్టహాసంగా జరిగింది. దీంట్లో ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్ల (iPhone 15 Series)తో పాటు వాచ్‌ సిరీస్‌ 9, వాచ్‌ అల్ట్రా 2లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. అంతా ఊహించినట్లుగానే ఈసారి ఫోన్లలో యాపిల్‌ కీలక మార్పులు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని