అనుమానాస్పదంగా చైనా బ్యాగులు.. జీ20 వేళ 12 గంటలు హైడ్రామా..!

G20 Summit: జీ20 వేళ.. ఏ చిన్నపాటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో ఓ ఘటన కలకలం సృష్టించింది.

Published : 13 Sep 2023 11:24 IST

దిల్లీ: భారత్‌ అధ్యక్షతన వారాంతంలో జీ20 శిఖరాగ్ర సదస్సు(G20 Summit) ఘనంగా జరిగింది. ప్రపంచ దేశాల నుంచి విచ్చేసిన అధినేతల రక్షణకు కేంద్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చైనా(China) ప్రతినిధుల బృందం వెంట ఉన్న కొన్ని బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడం కలకలం సృష్టించింది. దాంతో 12 గంటల పాటు హైడ్రామా చోటుచేసుకుందని వార్తా కథనాలు వెల్లడించాయి. గత గురువారం నాటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

జీ20 సదస్సు(G20 Summit) కోసం విచ్చేసిన చైనా ప్రతినిధుల బృందం దిల్లీలోని ప్రముఖ హోటల్‌లో బస చేసింది. వారు హోటల్‌లోకి వెళ్లేముందు రెండు బ్యాగులు అసాధారణ కొలతలతో కనిపించాయి. అయితే ప్రొటోకాల్ ప్రకారం భద్రతా సిబ్బంది వారిని లోపలికి పంపించారు. తర్వాత హోటల్ సిబ్బంది ఒకరు ఆ బ్యాగుల్లో అనుమానాస్పద పరికరాలను గుర్తించారు. వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. 

70 ఏళ్ల తర్వాత గ్రామానికి నీళ్లు.. ప్రారంభోత్సవానికి పిలవలేదని కట్‌!

దాంతో ఆ బ్యాగులను స్కానర్ కింద ఉంచాలని సదరు ప్రతినిధులను అధికారులు అభ్యర్థించారు. అందుకు వారు నిరాకరించడంతో సమస్య మొదలైందని సమాచారం. రెండు వర్గాలు ఎవరి వాదన వారు వినిపించడంతో ఆ సమస్య కొలిక్కి రావడానికి 12 గంటల సమయం పట్టింది. సుదీర్ఘ చర్చల తర్వాత చైనా అధికారులు ఆ బ్యాగుల్ని వారి ఎంబసీకి పంపడానికి అంగీకరించడంతో ఆ వివాదం అక్కడితో సద్దుమణిగింది. అయితే.. ఆ బ్యాగుల్లో ఏమున్నాయో తెలియరాలేదు.

సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీలో జరిగిన జీ20 దేశాధినేతల సదస్సుకు చైనా(China) అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో చైనా ప్రీమియర్‌ లీ కియాంగ్‌ సదస్సుకు హాజరయ్యారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో జీ20 దేశాలు చేతులు కలుపుతున్నాయనే సంకేతాన్ని దిల్లీ డిక్లరేషన్‌ ఇస్తోందంటూ ఈ సదస్సును ఉద్దేశించి డ్రాగన్‌ స్పందించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని