Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Dec 2023 13:03 IST

1. రేవంత్‌ ప్రమాణస్వీకారం.. కేసీఆర్‌, చంద్రబాబు సహా ముఖ్యనేతలకు ఆహ్వానాలు

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్‌రెడ్డి (Revanth Reddy) గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, తెదేపా అధినేత చంద్రబాబులను ఆహ్వానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘దేశాన్ని ఏడిపిస్తూ.. తాను ఏడుస్తూ’: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్‌.. వీడియో వైరల్‌

ఉత్తరకొరియా (North Korea) అధినేత కిమ్‌ జోంగ్ ఉన్‌ (Kim Jong Un) కర్కశత్వం గురించి ప్రపంచానికి తెలియంది కాదు. కఠినమైన ఆంక్షలతో దేశ ప్రజలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న నియంత ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు దేశ ప్రజల ముందు కంటతడి పెట్టుకున్నారు. దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తల్లులకు చెబుతూ కన్నీళ్లు కార్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తుపాను ప్రభావం.. ఏపీలో కొనసాగుతున్న వర్షాలు

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) వాయుగుండంగా బలహీనపడింది. ఇది మధ్యాహ్నానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశముంది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో 24 గంటలపాటు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దక్షిణాఫ్రికాతో సిరీస్‌.. వారిద్దరి మధ్య డైరెక్ట్‌ షూటౌట్: భారత మాజీ క్రికెటర్

ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో (IND vs AUS) టాప్‌ స్కోరర్‌ అయిన రుతురాజ్‌ గైక్వాడ్‌కు దక్షిణాఫ్రికా పర్యటనలోనూ (IND vs SA) చోటు దక్కింది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ జట్టులో స్థానం సంపాదించాలంటే దక్షిణాఫ్రికాతో సిరీస్‌ అత్యంత కీలకం. అయితే, అతడికి పోటీగా మరో యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ కూడా బరిలోకి దిగుతున్నాడు. దీంతో తుది జట్టులో ఎవరికి అవకాశం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రేవంత్‌ ప్రమాణ స్వీకార సమయంలో మార్పు

తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రమాణస్వీకార సమయంలో మార్పు జరిగింది. గురువారం ఉదయం 10.28 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని తొలుత నిర్ణయించగా.. తాజాగా ఆ సమయాన్ని కాస్త మార్చారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వరుసగా ఐదోసారి.. ఫోర్బ్స్‌ శక్తిమంతుల జాబితాలో నిర్మలా సీతారామన్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. 2023 ఏడాదికి ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమెకు వరుసగా ఐదోసారి చోటు లభించింది. భారత్‌ నుంచి మొత్తం నలుగురు మహిళలకు చోటు దక్కగా.. వారిలో నిర్మలా సీతారామన్‌ తొలి స్థానంలో నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పార్ట్‌టైం జాబ్‌ మోసాలు.. 100కి పైగా వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం

వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు (illegal investments), టాస్క్‌-ఆధారిత పార్ట్‌టైం జాబ్‌ మోసాల (part time job frauds)ను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా మోసాలకు కారణమవుతున్న వెబ్‌సైట్ల (Websites)పై కొరఢా ఝుళిపించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) సిఫార్సుల మేరకు దాదాపు 100కు పైగా వెబ్‌సైట్లను కేంద్ర ఐటీ శాఖ (IT Ministry) బ్లాక్‌ చేసింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. స్నాప్‌డ్రాగన్‌ లేటెస్ట్‌ ప్రాసెసర్‌తో వన్‌ప్లస్‌ 12.. ఇండియాలో ఎప్పుడంటే?

ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్‌ 12 (OnePlus 12) పేరిట తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తొలుత చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. క్వాల్‌కామ్‌కు చెందిన సరికొత్త చిప్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3తో వస్తున్న తొలి వన్‌ప్లస్‌ ఫోన్‌ ఇదే. 50 మెగాపిక్సెల్‌ కెమెరా, 24జీబీ ర్యామ్‌, 1టీబీ వరకు స్టోరేజ్‌ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బీఎన్‌పీఎల్‌ స్టార్టప్‌ జెస్ట్‌మనీ మూత.. 150 మంది ఉద్యోగుల తొలగింపు

గోల్డ్‌మన్‌ శాక్స్‌ మద్దతు గల ప్రముఖ ఫిన్‌టెక్‌ అంకుర సంస్థ జెస్ట్‌మనీ (ZestMoney) తమ కార్యకలాపాలను నిలిపివేసింది. వ్యాపారం పునరుద్ధరించడానికి చేసిన యత్నాలు ఫలించకపోవడంతో కంపెనీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తమ వద్ద పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. డీప్‌ ఫేక్‌ బారిన ప్రియాంక చోప్రా.. నకిలీ వీడియో వైరల్‌

డీప్ ఫేక్‌ వీడియోలను నివారించడానికి ఓవైపు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ..  మరోవైపు సినీ తారలు దీని బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రాకు (Priyanka Chopra) సంబంధించిన డీప్‌ ఫేక్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంక గతంలో మాట్లాడిన ఓ వీడియోలో ఆమె ముఖం మార్చకుండా అందులోని వాయిస్‌ను కొందరు ఆకతాయిలు మార్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని