Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 08 Apr 2023 17:11 IST

1. కుటుంబ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాం: ప్రధాని మోదీ

సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య వందేభారత్‌ రైలును అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భాగ్యలక్ష్మి నగరాన్ని వేంకటేశ్వరస్వామి నగరంతో కలిపామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య వందేభారత్‌ రైలును ప్రారంభించిన అనంతరం పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ప్రియమైన సోదర, సోదరీమణులారా.. అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేంద్రం ఏం అభివృద్ధి చేస్తోందని అడ్డుకుంటున్నాం?: మంత్రి తలసాని

సికింద్రాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో భారాస ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, గంగుల కమలాకర్‌ స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. ‘‘తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ మాట్లాడారు. అసలు తెలంగాణలో కేంద్రం ఏం అభివృద్ధి పనులను చేస్తుంది? మేమేం అడ్డుకుంటున్నామో చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కేవలం ఉద్యోగులకే రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నారా?: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని.. సమయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వం నాలుగు స్తంభాలాట ఆడుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం ఉద్యోగులకే రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కర్ణాటక ఎన్నికల్లో.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి కీలక బాధ్యతలు?

భాజపాలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌ రెడ్డి ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్‌ షాను కలిసిన ఆయన తాజా రాజకీయాలపై కొద్దిసేపు చర్చించారు. నడ్డా నివాసంలోనే పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను కూడా కలిశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం: శరద్‌ పవార్‌

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌పవార్‌  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌  వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. అందువల్ల కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అయితే వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో భాజపాను ఓడించాలంటే మాత్రం ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కెప్టెన్‌గా మైదానంలో ధోనీ అలా ఉండటానికి కారణమిదే: శిఖర్ ధావన్‌

ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్‌గా పేరుగాంచిన ఎంఎస్ ధోనీ మైదానంలో చాలా నిశ్శబ్దంగా ఉంటాడని అందరికీ తెలుసు. అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం ప్రకటించిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. బ్యాటింగ్‌లోనూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ‘కెప్టెన్‌ కూల్‌’ నాయకత్వ పటిమపై తాజాగా పంజాబ్ కింగ్స్‌ సారథి శిఖర్ ధావన్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కర్ణాటక ఎన్నికల వేళ.. బోనీ కపూర్‌ కారులో వెండి వస్తువులు సీజ్‌

కర్ణాటకలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసీ రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు పెంచింది. కాగా.. ఈ తనిఖీల్లో భాగంగా బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన కారులో వెండి వస్తువులను అధికారులు సీజ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రష్యా దండయాత్ర వేళ.. భారత్‌కు ఉక్రెయిన్ మంత్రి

ఉక్రెయిన్‌ (Ukraine) విదేశాంగ డిప్యూటీ మంత్రి ఎమైన్‌ జాపరోవా (Emine Dzhaparova) భారత్‌ పర్యటనకు రానున్నారు. ఆదివారం (ఏప్రిల్‌ 9) నుంచి నాలుగు రోజుల పాటు ఆమె దేశంలో పర్యటించనున్నారు. గతేడాది ఉక్రెయిన్‌పై రష్యా (Russia) దండయాత్రను ప్రారంభించిన తర్వాత నుంచి ఉక్రెయిన్‌ ప్రతినిధులు న్యూదిల్లీకి అధికారిక పర్యటనకు రావడం ఇదే తొలిసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పుతిన్‌కు చేదు అనుభవం.. ప్రసంగం తర్వాత చప్పట్లు లేవ్‌.. వీడియో వైరల్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఇబ్బందికర అనుభవం ఎదురైంది. ఓ అధికారిక కార్యక్రమంలో ఆయన ప్రసంగం తర్వాత అక్కడున్న ఏ ఒక్కరూ చప్పట్లు కొట్టలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇటీవల రష్యాకు నూతనంగా నియమితులైన 17 దేశాల రాయబారులు గత బుధవారం పుతిన్‌ను అధికారికంగా కలిశారు. గ్రాండ్‌ క్రెమ్లిన్‌ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విదేశీ రాయబారులనుద్దేశించి పుతిన్‌ కొద్దిసేపు ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఇస్రో ఉచిత సర్టిఫికెట్‌ కోర్స్‌.. రెండ్రోజుల్లో ప్రారంభం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ (IIRS), దేహ్రాదూన్‌ కొత్త సర్టిఫికెట్‌ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. సింథటిక్‌ అపార్చుర్‌ రాడార్‌ (SAR) డేటా ప్రాసెసింగ్‌పై అందిస్తున్న ఈ కోర్సులో విద్యార్థులతో పాటు పరిశోధకులు, ప్రభుత్వ సైంటిఫిక్‌ సిబ్బంది చేరొచ్చు. ఆసక్తిగల వారు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని