MS Dhoni: కెప్టెన్‌గా మైదానంలో ధోనీ అలా ఉండటానికి కారణమిదే: శిఖర్ ధావన్

ఎంఎస్ ధోనీ జాతీయ జట్టు కెప్టెన్సీకి (MS Dhoni) గుడ్‌బై చెప్పినా.. అతడి ముద్ర మాత్రం మరువలేనిది. టీమ్‌ఇండియాకు వన్డే, టీ20 వరల్డ్‌ కప్‌లను అందించిన సారథిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. 

Published : 08 Apr 2023 12:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్‌గా పేరుగాంచిన ఎంఎస్ ధోనీ (MS Dhoni) మైదానంలో చాలా నిశ్శబ్దంగా ఉంటాడని అందరికీ తెలుసు. అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం ప్రకటించిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. బ్యాటింగ్‌లోనూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ‘కెప్టెన్‌ కూల్‌’ నాయకత్వ పటిమపై తాజాగా పంజాబ్ కింగ్స్‌ సారథి శిఖర్ ధావన్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. దూకుడుగా ఉంటే మైదానంలోని వాతావరణం మారిపోయే అవకాశం ఉందని ధోనీకి బాగా తెలుసని.. అందుకే కామ్‌గా తన పనేంటో చేసేస్తాడని ధావన్ తెలిపాడు. 

‘‘ధోనీ భాయ్‌ మైదానంలో చాలా రిలాక్స్‌డ్‌ వాతావరణం ఉండేలా చూస్తాడు. ఏది అవసరమో దానిని మాత్రమే చెప్తాడు. నిశ్శబ్దంగా ఫలితం రాబట్టేస్తాడు. సరదాగా ఉంటూ.. ఎలాంటి గర్వం లేకుండా ప్రవర్తిస్తాడు. ఒక్కోసారి కాస్త దూకుడుగా ఉంటాడు. మైదానంలో ఆటగాళ్ల మధ్య ఉండే వాతావరణం డిస్టర్బ్‌ అవుతుందని అతడికి తెలుసు. అందుకే తనకు తాను నిగ్రహించుకుని నిర్ణయాలు తీసుకుంటాడు. స్వీయ నియంత్రణ కలిగిన ఆటగాడు. అతడి పరిణితి ఉన్నతస్థాయిలో ఉంటుంది’’ అని ధావన్‌ చెప్పాడు.

ఇక ఐపీఎల్‌ విషయానికొస్తే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆడిన రెండు మ్యాచుల్లో ఒక విజయం, మరొక ఓటమితో కొనసాగుతోంది. ఇవాళ ముంబయితో రాత్రి 7.30గంటలకు చెన్నై తలపడేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు పంజాబ్‌ మాత్రం ఆడిన రెండింట్లోనూ గెలిచి ఊపుమీదుంది. తన కెప్టెన్సీలో పంజాబ్‌ను ధావన్‌ అద్భుతంగా నడిపిస్తున్నాడు. రెండు మ్యాచుల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లతో జట్టుకు అండగా నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని