Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 20 Apr 2024 16:59 IST

1. కాంగ్రెస్‌ యువరాజు ఏప్రిల్ 26 తర్వాత ఎక్కడికి వెళ్తారో..?: మోదీ

ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న ప్రధాని మోదీ (Modi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఆ యువరాజు వయనాడ్‌లో కూడా ఓడిపోతారని, తర్వాత మరో సురక్షిత స్థానం చూసుకోవాల్సి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ ర్యాలీలో మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొదటి దశలో ఎన్డీయేకు ఏకపక్షంగా ఓట్లు పడినట్లు తెలుస్తోందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ‘ఇండియా’ కూటమి వస్తే.. మోదీ అవినీతి పాఠశాలకు లాక్‌: రాహుల్‌ గాంధీ

 ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు. భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదిక వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. పాకిస్థాన్‌కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!

అంతర్జాతీయ వేదికపై అమెరికా (USA)- చైనా (China)ల ఆధిపత్య పోరు కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌ (Pakistan) క్షిపణి కార్యక్రమాలకు పరికరాలు సరఫరా చేస్తున్నాయంటూ.. మూడు చైనా సంస్థలతోపాటు బెలారస్‌కు చెందిన ఓ కంపెనీపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. ఈ సంస్థలు ఇస్లామాబాద్‌తో సామూహిక విధ్వంసకర ఆయుధాలతో చేపట్టే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూమిల్లర్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు: నారా బ్రాహ్మణి

రాష్ట్ర ప్రజల కోసం తెదేపా అధినేత చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా యర్రబాలెం సంధ్య స్పైసెస్‌ కంపెనీని సందర్శించి కూలీలతో మాట్లాడారు. మహిళా సాధికారిత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు, లోకేశ్‌ నిరంతరం పరితపిస్తారన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. మోదీ, కేసీఆర్‌ మెదక్‌ ప్రాంతాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు: రేవంత్‌రెడ్డి

ఏడుపాయల దుర్గమ్మ, మెదక్‌ చర్చి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.5లక్షల ఇళ్లు నిర్మించాలని ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ప్రారంభించాం. కాంగ్రెస్‌ను ఓడించి.. ఇచ్చే ఇళ్లను రద్దు చేయాలని దిల్లీలో ఉండే మోదీ, గజ్వేల్‌లో ఉండే కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారు.’’ అని రేవంత్‌ విమర్శించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఈ పోలింగ్‌ ‘బ్యూటీ’ ఇంటర్నెట్‌ సెన్సేషన్‌.. ఎవరీ ఈశా అరోడా..?

సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) సమరం మొదలైంది. దేశవ్యాప్తంగా తొలివిడత ఓటింగ్‌ శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో తళుక్కున మెరిసిన ఓ పోలింగ్‌ ఏజెంట్‌ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆమె వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)కు చెందిన ఈశా అరోడా (Isha Arora). యూపీలోని సహరణ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని గంగోహ్‌ ప్రాంతంలో ఈశా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఐదేళ్లకు ఒకసారి దేశం కోసం ఐదు నిమిషాలు: ఓటు హక్కుపై జస్టిస్ డీవై చంద్రచూడ్

సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ప్రజలను కోరారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం ‘మై ఓట్ మై వాయిస్’ మిషన్‌లో భాగంగా ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో జస్టిస్ చంద్రచూడ్‌ మాట్లాడుతూ  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం అనేక హక్కులను కల్పించిందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్‌..!

అగ్రరాజ్యం అమెరికా (USA)లో చదువుకుంటున్న భారతీయ, భారత సంతతి విద్యార్థులు (Indian Origin Students) వరుసగా ప్రాణాలు కోల్పోతుండటం కలకలం రేపుతోంది. మసాచుసెట్స్‌ యూనివర్సిటీకి చెందిన భారత విద్యార్థి గత నెల ప్రారంభంలో శవమై కనిపించాడు. ఆ ఆత్మహత్యకు ‘బ్లూవేల్ ఛాలెంజ్’(Blue Whale Challenge) అనే గేమ్ కారణమని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్‌

హైదరాబాద్‌ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించాల్సిన ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ప్రకటించారు. శుక్రవారం గరుడ ప్రసాదం పంపిణీలో ఇబ్బందులు తలెత్తిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు తమ ఇళ్లలోనే దేవుడిని ప్రార్థించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఫలితాలు రాకుండా ఎలా చెప్తారు?.. మోదీ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ

సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీని, ఇండియా కూటమిని తిరస్కరించారంటూ ప్రధాని మోదీ (PM modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్పందించారు. ఫలితాలు రాకుండా ఫలానా పార్టీని ఓటర్లు తిరస్కరించారంటూ ఎలా చెప్తారని ప్రశ్నించారు. కేరళలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె దీనిపై మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని