Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 23 Feb 2024 09:00 IST

1. ధరణిలో తప్పులు.. అన్నదాతకు తిప్పలు

సాంకేతిక కారణాలు, రెవెన్యూ అధికారుల తప్పులతో రైతులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్న ధరణి పోర్టల్‌ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలోని ఫార్మాసిటీకి సమీపంలో కుర్మిద్ద గ్రామానికి చెందిన రైతులు ధరణి పోర్టల్‌ కారణంగా వారి పొలాలపై హక్కులు కోల్పోయారు. ఈ పోర్టర్‌ రాకముందు రైతుల పట్టా భూములుండగా ఇప్పుడు అటవీశాఖ భూములుగా మారిపోయాయి. పూర్తి కథనం

2. బొత్సపై సరైన అభ్యర్థినని పార్టీ భావించింది

మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసేందుకు తనను సరైన అభ్యర్థిగా పార్టీ భావించిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉత్తరాంధ్రలోని 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన శంఖారావం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో గురువారం విశాఖలో గంటా విలేకరుల సమావేశం నిర్వహించారు. పూర్తి కథనం

3. సీఎం సారూ.. అభివృద్ధి బాధ్యత మీదే..!

మేడారం జాతరకొచ్చే భక్తుల కోసం ప్రభుత్వం వసతుల కల్పనకు కృషి చేస్తున్నా.. పూర్తిస్థాయిలో సేవలు అందక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం మేడారం రానున్నారు.  జాతర అభివృద్ధి, ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారని, వరాలు కురిపిస్తారని భక్తులు ఆశిస్తున్నారు. పూర్తి కథనం

4. పట్టణ వాసులపై పన్నుల బాదుడు..

పట్టణాల్లో ఒకప్పుడు ఇళ్ల అద్దెలు సామాన్యులకు అందుబాటులో ఉండేవి. ఉన్నత వర్గాల వారి నుంచి చిరు వ్యాపారులు, చిరుద్యోగులు వారి స్థాయిని బట్టి అద్దె ఇళ్లలో ఉండేవారు. గత నాలుగున్నర ఏళ్లలో వైకాపా సర్కారు అస్తి పన్నులతోపాటు వివిధ రకాల పన్నులు పెంచేయడంతో ఇంటి యజమానులు అద్దెలను సైతం భారీగా పెంచేశారు. పూర్తి కథనం

5. నమ్మి ఓటేస్తే.. నిలువునా ముంచాడు

ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఒకటో తారీఖు అంటే జీతం వస్తోందని.. అన్ని అవసరాలను సర్దుబాటు చేయవచ్చనే భావన ఉండేది. ఇప్పడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో 50 వేల మంది ఉద్యోగులు, పింఛనర్లు 30 వేల మంది ఉన్నారు. వారు కొన్నేళ్లుగా మొదటి వారంలో జీతాలు, పింఛన్లు అందుకున్నదీ లేదు. పూర్తి కథనం

6. ‘గొర్రెల’ గోల్‌మాల్‌లో ఇంటి దొంగలు

రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో ఇంటి దొంగల గుట్టు రట్టయింది. గొర్రెల పంపిణీ పేరిట రూ.2.01 కోట్ల ప్రభుత్వ నిధుల్ని పక్కదారి పట్టించిన వ్యవహారంలో నలుగురు ప్రభుత్వ అధికారులను అవినీతి నిరోధకశాఖ గురువారం అరెస్ట్‌ చేసింది. కామారెడ్డి ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకుడు డా.రవి, మేడ్చల్‌ జిల్లా పశువైద్యశాఖ సహాయ సంచాలకుడు డా.ఎం.ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జలశాఖ అధికారి పసుల రఘుపతిరెడ్డి, వయోజన విద్యాశాఖ ఉపసంచాలకుడు సంగు గణేశ్‌ను అనిశా అధికారులు ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. పూర్తి కథనం

7. ఊదరగొట్టుడు గొప్పలు.. ఉత్తుత్తి హామీలు

ప్రచార యావ తప్ప.. వైకాపా ప్రభుత్వానికి అభివృద్ధి పట్టకుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామంటూ ఆ పార్టీ అధినేత సభల్లో ఊదరగొడతారు. హామీలను వంద శాతం అమలు చేశామంటూ ప్రగల్భాలు పలుకుతారు. కానీ ఇవీ మేము చేసినవంటూ ఇతిమిత్థంగా చెప్పలేరు. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నారంటే అక్కడి వాసులు ఎంతగానో సంతోషిస్తారు. పూర్తి కథనం

8. భారత్‌లోకి కొత్త కవాసకి నింజా 500

ఇండియా కవాసకి మోటార్స్‌, దేశీయ విపణిలోకి 2024 నింజా 500ను తీసుకొచ్చింది. ఈ వాహనాన్ని పూర్తిగా తయారైన స్థితి (సీబీయూ)లో దిగుమతి చేసుకుంటున్నారు. ఈ బైక్‌ పరిచయ ధర రూ.5.24 లక్షలు(ఎక్స్‌ షోరూం). 451 సీసీ పారెలల్‌-ట్విన్‌, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ బైక్‌కు స్లిప్‌ అండ్‌ అసిస్ట్‌ క్లచ్‌, 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉన్నాయి. పూర్తి కథనం

9. గ్యాస్‌, కరెంటు పథకాల అమలుకు ముహూర్తం.. 27 లేదా 29..!

కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారైంది. గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు ఉచిత విద్యుత్‌, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ఈ నెల 27 లేదా 29వ తేదీ నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 200 యూనిట్ల విద్యుత్‌ పథకం అర్హులకు మార్చి తొలి వారం నుంచి ‘జీరో’ బిల్లులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. పూర్తి కథనం

10. కరెంటు కోతల పేరిట కుట్ర

రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే అందుకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిని అవసరమైతే సస్పెండ్‌ చేస్తామన్నారు. విద్యుత్తు సరఫరాపై ఆయన గురువారం సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని