Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 12 Feb 2024 16:59 IST

1. హరీశ్‌ చెప్పేవన్నీ అబద్ధాలే: సీఎం రేవంత్‌

దక్షిణాది తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ జరుగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ చర్చలో పాల్గొనకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. సభలో భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హరీశ్‌రావు, కోమటిరెడ్డి మధ్య మాటలయుద్ధం

కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చిన తర్వాత హరీశ్‌రావుకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అవకాశమిచ్చారు. ప్రభుత్వం సత్య దూరమైన ప్రజంటేషన్‌ ఇచ్చిందని హరీశ్‌ ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జగన్‌ వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర: పురందేశ్వరి

వైకాపా పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. సీఎం జగన్‌ వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర ఉందని.. వచ్చే ఎన్నికల్లోనూ దొంగ ఓట్లతో లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీ డీఎస్సీ దరఖాస్తులు షురూ.. పూర్తి వివరాలివే..!

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల తేదీలు సమీపిస్తున్న వేళ 6,100 పోస్టుల భర్తీకి ఇటీవల హడావుడిగా షెడ్యూల్‌ను ప్రకటించిన ప్రభుత్వం.. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బల పరీక్షలో నీతీశ్‌ విజయం.. విపక్షం వాకౌట్‌

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో మొత్తం 129 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఓటేశారు. విపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీ మార్క్‌ 122. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నియామక ప్రక్రియను పారదర్శకంగా మార్చాం: ప్రధాని మోదీ

నియామకాల ప్రక్రియను తమ ప్రభుత్వం పారదర్శకంగా మార్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఆయన ‘రోజ్‌గార్‌ మేళా’ కింద ఉద్యోగాలు పొందిన లక్షమందికిపైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం నియామక ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. డిప్యూటీ సీఎంల నియామకం.. రాజ్యాంగ ఉల్లంఘన కాదు: సుప్రీం

 రాష్ట్రాల్లో ఉపముఖ్యమంత్రులను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ విధానాన్ని అవలంబించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదని స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎంల నియామకాన్ని సవాల్‌ చేస్తూ పబ్లిక్‌ పొలిటికల్‌ పార్టీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. శ్రీలంక, మారిషస్‌కూ యూపీఐ సేవల విస్తరణ

అంతర్జాతీయ ప్రయాణికుల సౌలభ్యం కోసం యూపీఐ సేవలను ప్రభుత్వం క్రమంగా విదేశాల్లోనూ ప్రారంభిస్తోంది. ఇటీవలే ఫ్రాన్స్‌లో మొదలైన వీటిని తాజాగా శ్రీలంక, మారిషస్‌కూ విస్తరించింది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన వర్చువల్‌ సమావేశంలో ఆ దేశాధినేతలతో కలిసి ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రకుల్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్‌.. వెడ్డింగ్‌ కార్డు వైరల్‌

తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపుతెచ్చుకున్న నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. త్వరలోనే ఆమె పెళ్లి పీటలెక్కబోతున్నారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ఆమె వివాహం చేసుకోనున్నారు. ఫిబ్రవరి 21న వీరి వివాహం జరగనుంది. గోవా వేదికగా జరిగే ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బుల్డోజర్‌తో కూల్చడం ఫ్యాషన్‌గా మారింది : మధ్యప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యలు

క్రిమినల్‌ కేసులు నమోదైనవారి ఇళ్లు, ఆస్తులను బుల్డోజర్‌తో  పడగొట్టించడంపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు కఠిన వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి విధివిధానాలు లేకుండా చర్యలు తీసుకోవడం పురపాలక అధికారులకు ఫ్యాషన్‌గా మారిందని వ్యాఖ్యానించింది. ఓ కేసుకు సంబంధించి నిందితుడి భార్య హైకోర్టును ఆశ్రయించగా.. ఈమేరకు వ్యాఖ్యలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని