Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Sep 2023 09:18 IST

1. నిర్మాణ లోపంతో రూ.14.17 కోట్లు ‘ఢాం’

కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్‌డ్యాంను అధికారులు జిలెటిన్‌ స్టిక్స్‌ పెట్టి పేల్చివేసిన సంఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వేములవాడ గ్రామీణ మండలంలోని బొల్లారం గ్రామ సమీపంలో మూలవాగుపై గత ఏడాది   రూ.14.17 కోట్లతో చెక్‌డ్యాం నిర్మించారు. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు ఈ చెక్‌డ్యాం సైడ్‌బండ్‌ భారీగా కోతకు గురైంది. ఆకృతి లోపంతో ఎత్తుగా నిర్మించడంతోనే ఇలా జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మెలూహా నుంచి ఇండియా దాకా!

అమృతోత్సవవేళ దేశం పేరును ఇకపై భారత్‌గా పిలవబోతున్నారనే సంకేతాల  నేపథ్యంలో ఈ పేర్లు వెనకున్న చరిత్ర చూడటం సందర్భోచితం! ఇండియా పేరు ఎలా వచ్చింది? అంతకుముందు ఏం పేర్లున్నాయనేది ఆసక్తికరం. భరత వర్ష, భారత అనేది పురాణాల కాలం నుంచి వినిపిస్తున్న పేర్లు. ఆర్యావర్త, జంబూద్వీప, నభివర్ష అనే పేర్లు కూడా వైదిక సంస్కృతిలో కనిపిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జీ-20 సదస్సుకు.. వచ్చేదెవరు? రానిదెవరు?

ప్రపంచ ఆర్థిక సవాళ్లపై చర్చించే జీ-20 సదస్సుకు సర్వం సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈనెల 9, 10 తేదీల్లో దిల్లీ వేదికగా జరిగే ఈ శిఖరాగ్ర సమావేశానికి అనేక కీలక దేశాల అధినేతలు హాజరుకాబోతున్నారు. 20 కీలక ఆర్థిక దేశాల ఈ కూటమిలోంచి ఎవరెవరు వస్తున్నారో.. ఎవరెందుకు రావట్లేదో చూస్తే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దిల్లీ సదస్సుకు ఈ నెల ఏడో తేదీనే వస్తున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నా బౌలింగ్‌ను ద్రవిడ్‌ అర్థం చేసుకోలేకపోయాడు: మురళీధరన్‌

 ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే గొప్ప బ్యాటర్లలో ఒకడైన రాహుల్‌ ద్రవిడ్‌ తన బౌలింగ్‌ను చదవలేకపోయాడని శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ తెలిపాడు. ‘‘నా బౌలింగ్‌ను సచిన్‌ తెందుల్కర్‌ పక్కాగా అంచనా వేసేవాడు. చాలామంది అలా చేయలేకపోయారు. బ్రయాన్‌ లారా విజయవంతమైనా.. నా బౌలింగ్‌లో షాట్లు ఆడలేకపోయాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 1.5 కి.మీ.. 30 చెరువులు

నంద్యాల మండలం  రాయమాల్పురం క్రాస్‌ రోడ్డు నుంచి మునుగాలకు వెళ్తే దారి అధ్వానంగా మారింది. 1.5 కి.మీ తారురోడ్డుపై 30కి పైగా గుంతలు పడ్డాయి. వర్షాలకు వాటిలో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. ఈ మార్గంలో పోలూరు, మునుగాల, రాయమాల్పురం గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ద్విచక్ర వాహనాలపై నంద్యాలకు రాకపోకలు సాగిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కొబ్బరి పీచుతో క్యాన్సర్‌ కట్టడి!

మనమైతే కొబ్బరి పీచును ఏం చేస్తాం? చెత్త కుప్పలో పడేస్తాం. కానీ శాస్త్రవేత్తలు అలా కాదు. వ్యర్థాలనూ ఉపయోగపడేలా మార్చేస్తారు. బనారస్‌ హిందూ యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పరిశోధకులు ఇలాంటి పనే చేశారు. కొబ్బరి పీచులోంచి వినూత్న సుగంధ రసాయనాన్ని సంగ్రహించి ఔరా అనిపించారు. విశృంఖల కణాలను అరికట్టే యాంటీఆక్సిడెంట్‌ గుణాలు గల ఇది సూక్ష్మక్రిములను, క్యాన్సర్‌ను అడ్డుకుంటుండటం విశేషం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అనువాదంపై పట్టుందా? అయితే ఇది మీ కోసమే!

కేంద్రప్రభుత్వ విభాగాల్లో 307 కొలువులు కేంద్రప్రభుత్వ విభాగాల్లో హిందీ అనువాదకుల ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. జూనియర్‌ హిందీ ట్రాన్స్‌ లేటర్‌, హిందీ ట్రాన్స్‌లేటర్‌, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే రాత పరీక్ష ప్రకటన విడుదలైంది. గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ధ్రువ పత్రాల తనిఖీ, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఏ దశలో ఏయే పోషకాలు అవసరం?

ఒక్కో వయసులో/దశలో శరీరంలో వివిధ మార్పులు చోటుచేసుకుంటాయి.. వాటిని తట్టుకోవాలంటే.. శారీరక అవసరాలకు అనుగుణంగా పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలమంటున్నారు. ఈ క్రమంలోనే మహిళలు తమ వయసును బట్టి ఆయా పోషకాల్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఉల్లి రైతుకు వెన్నుపోటు

వర్షాలతో దిగుబడులు తగ్గి మద్దతు ధర దక్కక ఏటికేడు నష్టాలు పెరుగుతుండటంతో రాష్ట్రంలో ఉల్లి సాగు తగ్గిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 79 వేల ఎకరాల సాధారణ విస్తీర్ణం ఉండగా.. ఇప్పటికి 31 వేల ఎకరాల్లో సాగు చేశారు. గత ఏడాది ఆగస్టులో 4,290 టన్నుల ఉత్పత్తి కర్నూలు మార్కెట్‌కు రాగా.. ఈ సంవత్సరం ఆగస్టులో 379 టన్నులు మాత్రమే రావడం ఉత్పత్తిలో క్షీణతకు అద్దం పడుతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సొమ్ము తితిదేది.. సోకు రాజకీయానిది!

సామాన్య భక్తులు ముడుపులు కట్టుకుని శ్రీవారికి సమర్పించుకునే కానుకలను తిరుపతి నగరపాలక సంస్థపరం చేస్తున్నారు. భక్తుల సౌకర్యాల కోసం వినియోగించాల్సిన నిధులను తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తన రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో కార్పొరేషన్‌ పరిధిలో రూ.200 కోట్లకు పైగా పనులు తితిదే బడ్జెట్‌ నుంచి చేపట్టేందుకు ఆమోదముద్ర వేయడమే ఇందుకు నిదర్శనం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని