ఉల్లి రైతుకు వెన్నుపోటు

కర్నూలులో ఉల్లికి ధర రాక పొలాల్లోనే వదిలేస్తున్న పరిస్థితి చూస్తున్నాం.. నా పాదయాత్రలో అతి దగ్గర నుంచి మీరు పడుతున్న కష్టాలు చూశా.

Published : 06 Sep 2023 04:46 IST

సాగుదారులను ఆదుకోని వైకాపా ప్రభుత్వం
గతం కన్నా మద్దతు ధర తగ్గింపుతో కోలుకోలేని దెబ్బ  
నష్టాలు భరించలేక పంట సాగుకు కర్షకుల స్వస్తి
వీరిని ఆదుకుంటామని హామీలిచ్చి చేతులెత్తేసిన జగన్‌

కర్నూలులో ఉల్లికి ధర రాక పొలాల్లోనే వదిలేస్తున్న పరిస్థితి చూస్తున్నాం.. నా పాదయాత్రలో అతి దగ్గర నుంచి మీరు పడుతున్న కష్టాలు చూశా. బాధలు విన్నాను కాబట్టి నేను ఉన్నాను అని హామీ ఇస్తున్నా..

ఆదోనిలో 2019 మార్చి 25న జగన్‌మోహన్‌రెడ్డి మాటలివి..

వర్షాలతో దిగుబడులు తగ్గి మద్దతు ధర దక్కక ఏటికేడు నష్టాలు పెరుగుతుండటంతో రాష్ట్రంలో ఉల్లి సాగు తగ్గిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 79 వేల ఎకరాల సాధారణ విస్తీర్ణం ఉండగా.. ఇప్పటికి 31 వేల ఎకరాల్లో సాగు చేశారు. గత ఏడాది ఆగస్టులో 4,290 టన్నుల ఉత్పత్తి కర్నూలు మార్కెట్‌కు రాగా.. ఈ సంవత్సరం ఆగస్టులో 379 టన్నులు మాత్రమే రావడం ఉత్పత్తిలో క్షీణతకు అద్దం పడుతోంది. పంట లేకపోవడంతో వ్యాపారులు మహారాష్ట్ర, పుణేే నుంచి  ఉల్లిని తెప్పిస్తున్నారు. అయినా ప్రభుత్వం పరిస్థితి తీవ్రతను గుర్తెరగడం లేదు. రైతులకు అండగా నిలిచే ఆలోచన చేయడం లేదు. మీ కష్టాలు విన్నానని, నేను ఉన్నానని ఎన్నికల ముందు చెప్పిన జగన్‌కు ఉల్లి రైతుల గోడు ఏమాత్రం పట్టడం లేదు.

పెట్టుబడులు సైతం రాక సాగుకు స్వస్తి

రాష్ట్రంలో సగటున ఏటా 1.12 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తారు. సుమారు 9.80 లక్షల టన్నుల ఉత్పత్తి లభిస్తుంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉల్లి సాగు అధికం. వైఎస్సార్‌ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 79 వేల ఎకరాల సాధారణ విస్తీర్ణం ఉండగా.. 31 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఉల్లి సాగుకు ఎకరాకు రూ.40 వేల పైనే ఖర్చవుతోంది. నాలుగేళ్లుగా పెట్టుబడులు కూడా రావడం లేదు. ఎకరాకు సగటున రూ.30 వేల వరకు నష్టపోతున్నామనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. కొంతమంది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు  పాల్పడుతున్నారు. అధిక వర్షాలు, వర్షాభావం, తెగుళ్లతో గత ఏడాది ఖరీఫ్‌లోనూ దిగుబడులు తగ్గాయి.


తెదేపా ప్రభుత్వ హయాంలో రైతులకు దన్ను

తెదేపా ప్రభుత్వ హయాంలో ఉల్లి రైతుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. ఉల్లి నిల్వ సౌకర్యాలకు రాయితీపై నిధులు ఇచ్చింది. 2018-19లో ఉల్లి రైతులకు ధరల మద్దతు పథకం కింద కిలోకు రూ.6 చొప్పున అదనపు ధర కల్పించడం ద్వారా మొత్తం రూ.6.45 కోట్లు అందించింది. 2014-15 నుంచి 2018-19 వరకు రైతుల నుంచి 3.10 లక్షల టన్నుల ఉల్లిని సేకరించింది. క్వింటాలు ఉల్లిని రూ.800 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా కిలో రూ.10 నుంచి రూ.11 చొప్పున విక్రయించేలా చేసింది.

  • వైకాపా అధికారంలోకి వచ్చాక క్వింటాలుకు రూ.770 చొప్పున మద్దతు ధరగా నిర్ణయించింది. అంటే గత ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధర కంటే తక్కువే. అదీ సరిగా సేకరించిన సందర్భమే లేదు. రైతులు రోజుల తరబడి మార్కెట్‌ యార్డుల్లో వేచి చూడాల్సి వచ్చింది. కొందరు మార్కెట్‌కు తెచ్చి నష్టపోవడం ఎందుకని పంటను పొలాల్లోనే వదిలేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లల్లో ధరల స్థిరీకరణ నిధి కింద 3,193 టన్నులు సేకరించారు.

కొరవడిన ప్రోత్సాహం

గతంలో ఉల్లి రైతులకు విత్తనాలను రాయితీపై ఇవ్వగా.. నాలుగేళ్లుగా నామమాత్రంగా కొందరికి ఇచ్చి మమ అనిపిస్తున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు రైతులకు ఉచితంగా, రాయితీపై మేలు రకం విత్తనాలు పంపిణీ చేస్తున్నాయి. గిట్టుబాటు ధరలు రాని సమయంలో మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నాయి. ధరలు తగ్గుముఖం పట్టిన సమయంలో రైతులు గోదాముల్లో నిల్వ ఉంచుకుని ధరలు పెరిగినప్పుడు రైతులు విక్రయించుకునే సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రకమైన ప్రోత్సాహం లేదు. కర్నూలు జిల్లాలో సాగయ్యే ఉల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండటం లేదు. దీంతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను అందించడంతో పాటు మద్దతు ధరను క్వింటాలుకు రూ.1,000 పైన నిర్ణయించి కొనుగోలు చేస్తేనే ఉల్లి రైతులకు ఊరట కలుగుతుంది.


కర్నూలు వ్యవసాయం, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని