India Or Bharat: మెలూహా నుంచి ఇండియా దాకా!

అమృతోత్సవవేళ దేశం పేరును ఇకపై భారత్‌గా పిలవబోతున్నారనే సంకేతాల  నేపథ్యంలో ఈ పేర్లు వెనకున్న చరిత్ర చూడటం సందర్భోచితం! ఇండియా పేరు ఎలా వచ్చింది? అంతకుముందు ఏం పేర్లున్నాయనేది ఆసక్తికరం.

Updated : 06 Sep 2023 09:38 IST

భారతావని నామ్నీకరణాలు

అమృతోత్సవవేళ దేశం పేరును ఇకపై భారత్‌గా పిలవబోతున్నారనే సంకేతాల  నేపథ్యంలో ఈ పేర్లు వెనకున్న చరిత్ర చూడటం సందర్భోచితం! ఇండియా పేరు ఎలా వచ్చింది? అంతకుముందు ఏం పేర్లున్నాయనేది ఆసక్తికరం. భరత వర్ష, భారత అనేది పురాణాల కాలం నుంచి వినిపిస్తున్న పేర్లు. ఆర్యావర్త, జంబూద్వీప, నభివర్ష అనే పేర్లు కూడా వైదిక సంస్కృతిలో కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం మూడువేల సంవత్సరాలనాటి మెసపటోమియా నాగరికత కాలంలో లభించిన రాతల్లో సింధు నాగరికత విలసిల్లిన ప్రస్తుత భారత ఉపఖండాన్ని మెలూహాగా పేర్కొన్నట్లు చరిత్రకారులు చెబుతారు. రాజకీయ చరిత్రలో దీనికి పెద్ద ప్రాధాన్యం లభించలేదు. భరతవర్ష, భారత్‌ మాత్రం తరతరాలుగా కొనసాగుతూ వచ్చాయి.

(షర్టు మీద ‘ఇండియా’ అని ఉండేది. నేను ఈ దేశం వాణ్ని కాదనుకుంటారేమోనని కత్తిరించేశా సార్‌..!)

పర్షియన్లతో హిందుస్థాన్‌

పర్షియన్ల రాకతో హిందూ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రీస్తుపూర్వం ఏడో శతాబ్దిలో సింధు లోయను స్వాధీనం చేసుకున్న పర్షియన్లు- సంస్కృతంలోని సింధు (నది)ను హిందుగా పలికారు. క్రీస్తుశకం ఆరంభంలో దీనికి పర్షియన్‌ పదం ‘స్థాన్‌’ తోడై హిందుస్థాన్‌గా మారింది. పర్షియన్ల హింద్‌ కాస్తా గ్రీకుల నోళ్లలో ఇండస్‌గా మారింది. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దిలో అలెగ్జాండర్‌ భారత్‌పై దండెత్తి ఇండస్‌ (సింధూనది) తర్వాతి ప్రాంతాన్ని ఇండియాగా పలికాడు. తర్వాత వచ్చిన మొఘల్‌ చక్రవర్తులు భారత్‌ పేరును హిందుస్థాన్‌గానే ప్రాచుర్యంలో ఉంచారు. ఆసియాలోని అనేక దేశాల్లో ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్‌ పేరుతోనే పిలిచేవారు. 18వ శతాబ్దం చివరి దాకా ఇదే పేరుండేది.

 బ్రిటిష్‌ వారితో ఇండియా

భారత ఉపఖండం బ్రిటిష్‌ వారి చేతుల్లోకి వెళ్లిన తర్వాత హిందుస్థాన్‌ పేరు మాయమై ఇండియా పేరు స్థిరపడింది. స్థానిక పేర్లు, సంప్రదాయాలు, చదువులను తమవాటితో నింపేయాలని చూసిన ఆంగ్లేయులు ఇండియా పేరును పటాల్లో, అధికారిక పేర్లలో ఖాయం చేశారు. సర్వే ఆఫ్‌ ఇండియాలాంటి సంస్థలనూ ఇండియా పేరుతో స్థాపించారు. బ్రిటిష్‌ వలస పాలన పోయి, స్వాతంత్య్రం వచ్చాక దేశం పేరుపై వాదోపవాదాలు మొదలయ్యాయి. రాజ్యాంగ రచన సమయంలో దీనిపై తీవ్ర చర్చోపచర్చ జరిగింది. ఇండియా అనే ఉంచాలని కొంతమంది డిమాండ్‌ చేయగా, విదేశీయులు పెట్టిన పేరు బదులు మనకున్న పురాతన భారత్‌ అని పిలుచుకుందామని మరికొందరు వాదించారు. హిందుస్థాన్‌ అని పెడదామని సూచించిన వారూ ఉన్నారు. చివరకు ఎవరినీ నొప్పించక తానొవ్వక ఇండియా, భారత్‌ పేర్లను ఉంచేశారు. అలా సద్దుమణిగినా అడపాదడపా దేశం పేరును భారత్‌గా మార్చాలంటూ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. 2012లో కాంగ్రెస్‌ సభ్యుడు శాంతారాం నాయక్‌ పార్లమెంటులో దేశం పేరును భారత్‌ అని మార్చాలంటూ ఓ బిల్లు ప్రవేశపెట్టారు. మనం భారత్‌ మాతాకీ జై అంటామే తప్ప, ఇండియాకీ జై అనం కదా అంటూ వాదించారు. 2014లో యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఎంపీగా ఇలాంటి డిమాండ్‌తోనే ఓ బిల్లు ప్రవేశపెట్టారు. దేశం పేరు భారత్‌గా మార్చాలని సుప్రీంకోర్టులో అనేకమంది పిటిషన్లు వేశారు. ఈ విషయంలో తాము చేసేదేమీ లేదని, కేంద్రం వద్ద దరఖాస్తు చేసుకోవాలని కోర్టు ఇటీవలే స్పష్టంచేసింది. ఇప్పుడు ఇండియా పేరుతో ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడ్డ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ ఆహ్వాన పత్రికలో తీసుకువచ్చిన ప్రస్తావన సరికొత్త చర్చకు తెరతీసింది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని