జీ-20 సదస్సుకు.. వచ్చేదెవరు? రానిదెవరు?

ప్రపంచ ఆర్థిక సవాళ్లపై చర్చించే జీ-20 సదస్సుకు సర్వం సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈనెల 9, 10 తేదీల్లో దిల్లీ వేదికగా జరిగే ఈ శిఖరాగ్ర సమావేశానికి అనేక కీలక దేశాల అధినేతలు హాజరుకాబోతున్నారు.

Updated : 06 Sep 2023 09:58 IST

దిల్లీ: ప్రపంచ ఆర్థిక సవాళ్లపై చర్చించే జీ-20 సదస్సుకు సర్వం సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈనెల 9, 10 తేదీల్లో దిల్లీ వేదికగా జరిగే ఈ శిఖరాగ్ర సమావేశానికి అనేక కీలక దేశాల అధినేతలు హాజరుకాబోతున్నారు. 20 కీలక ఆర్థిక దేశాల ఈ కూటమిలోంచి ఎవరెవరు వస్తున్నారో.. ఎవరెందుకు రావట్లేదో చూస్తే..

7న వస్తున్న బైడెన్‌..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దిల్లీ సదస్సుకు ఈ నెల ఏడో తేదీనే వస్తున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. తాజాగా.. ఆయన భార్య జిల్‌ బైడెన్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన భారత్‌కు రావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే జీ 20 సదస్సుకు బైడెన్‌ వస్తున్నట్లు శ్వేతసౌధం మంగళవారం ధ్రువీకరించింది.

సునాక్‌ తొలిసారి..

బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్‌ తొలిసారి దిల్లీ రానున్నారు.

ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ సై

పసిఫిక్‌ మండలంలో చైనాను కట్టడి చేయాలని భావిస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ జీ-20పై ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు. భారత్‌తో పాటు ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌ల్లోనూ ఆయన పర్యటించనున్నారు.

ఆసియాన్‌ నుంచి ఇటే.. కెనడా ప్రధాని

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఇండోనేసియాలో జరిగే ఆసియాన్‌ సదస్సు నుంచి నేరుగా దిల్లీ వస్తున్నారు.

తగ్గేదేలేదు: జర్మనీ

చైనా, రష్యాలు రాకున్నా.. జీ-20కి ప్రాధాన్యం తగ్గేదేలేదని జర్మనీ స్పష్టం చేసింది. దిల్లీ సదస్సుకు స్వయంగా హాజరవుతున్నట్లు జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ప్రకటించారు.

రష్యా లక్ష్యంగా.. జపాన్‌

ఉక్రెయిన్‌పై దాడికి ప్రతిగా రష్యాపై పాశ్చాత్యదేశాల విమర్శలకు జపాన్‌ ఈ సదస్సులో ముందుంటుందని అనుకుంటున్నారు. ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిద ఇప్పటికే దిల్లీ వస్తున్నట్లు సమాచారమిచ్చారు.

ఉత్తరం బాధతో.. దక్షిణ కొరియా

ఉత్తరకొరియా క్షిపణి కవ్వింపులతో ఇబ్బందులు పడుతున్న దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌యోల్‌ సదస్సుకు వస్తున్నారు. ఉత్తర కొరియా అణు సన్నాహాలపై ఆయన ప్రపంచ నేతలతో చర్చించే అవకాశం ఉంది.

ఫ్రాన్స్‌ ద్వైపాక్షికం..

జీ-20 సదస్సుకు వస్తున్న మరో కీలక నేత ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు.

చైనా అధ్యక్షుడి బదులుగా ప్రధాని

భారత్‌తో సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ దిల్లీ సదస్సుకు ముఖం చాటేశారు. ఆయన స్థానంలో చైనా ప్రధాని లీ చియాంగ్‌ సారథ్యంలోని బృందం జీ-20 సదస్సుకు వస్తోంది. ఇంకా బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగన్‌, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌, నైజీరియా అధ్యక్షుడు బొలా తినుబు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసాలు దిల్లీ సదస్సుకు హాజరవుతారని సమాచారం.


రానివారు వీరు..

పుతిన్‌: ఉక్రెయిన్‌ యుద్ధంతో తలమునకలవుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ జీ-20 సదస్సుకు హాజరు కావటం లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ వస్తున్నారు.

ఐరోపా యూనియన్‌: జీ-20 కూటమిలో భాగమైన ఐరోపా యూనియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లియోన్‌ వచ్చేదీ లేనిదీ ఇంకా స్పష్టంగా చెప్పలేదు. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెజ్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఒబ్రడోర్‌ కూడా సదస్సుకు రాకపోవచ్చు. ఇటలీ ప్రధాని, ఇండోనేసియా అధ్యక్షుడి రాకపైనా స్పష్టత లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు