సొమ్ము తితిదేది.. సోకు రాజకీయానిది!

సామాన్య భక్తులు ముడుపులు కట్టుకుని శ్రీవారికి సమర్పించుకునే కానుకలను తిరుపతి నగరపాలక సంస్థపరం చేస్తున్నారు.

Updated : 06 Sep 2023 06:05 IST

భక్తుల ప్రయోజనాల పేరిట నిధుల దుర్వినియోగం

ఈనాడు, తిరుపతి: సామాన్య భక్తులు ముడుపులు కట్టుకుని శ్రీవారికి సమర్పించుకునే కానుకలను తిరుపతి నగరపాలక సంస్థపరం చేస్తున్నారు. భక్తుల సౌకర్యాల కోసం వినియోగించాల్సిన నిధులను తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తన రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో కార్పొరేషన్‌ పరిధిలో రూ.200 కోట్లకు పైగా పనులు తితిదే బడ్జెట్‌ నుంచి చేపట్టేందుకు ఆమోదముద్ర వేయడమే ఇందుకు నిదర్శనం.

  • తిరుపతిలో ట్రాఫిక్‌ నియంత్రణకు ఇప్పటికే శ్రీనివాససేతును నిర్మిస్తున్నారు. ఈ నెల 18న సీఎం జగన్‌ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కపిలతీర్థం దాటితే శ్రీనివాససేతు పైనుంచి నేరుగా తిరుచానూరు మార్కెట్‌ వరకు వెళ్లవచ్చు. అలాంటిది నారాయణాద్రి ఆసుపత్రి నుంచి 150 అడుగుల రహదారి నిర్మాణాన్ని నగరపాలక సంస్థ చేపట్టాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి కిలోమీటరుకు రూ.15 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇక్కడ 3 కి.మీ. రహదారి నిర్మిస్తే తితిదేపై రూ.45 కోట్ల భారం పడుతుంది. ఈ రహదారిని ప్రభుత్వం చేపట్టాలి. శ్రీనివాసంను ఆనుకుని ఇప్పటికే ఇరువైపులా మాస్టర్‌ప్లాన్‌ రహదారుల నిర్మాణం చేపట్టారు. మళ్లీ రూ.9.50 కోట్లతో 40 అడుగుల రహదారి ఎవరి కోసం నిర్మిస్తున్నారనే ప్రశ్న వస్తోంది.
  • స్విమ్స్‌, బర్డ్‌, శ్రీపద్మావతి మెడికల్‌ కళాశాల ఇతర విభాగాల్లోని డ్రైనేజీ నీటిని తరలించేందుకు పంచముఖి ఆంజనేయస్వామి ఆలయం వరకు నగరపాలక సంస్థ ద్వారా డ్రైనేజీ పైప్‌లైన్‌ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇవన్నీ తితిదే నిధులే. రానున్న ఎన్నికల్లో కార్పొరేషన్‌ పరిధిలో తాము పెద్ద ఎత్తున పనులు చేపట్టామని చూపేందుకు భక్తుల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని