Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Mar 2024 21:33 IST

1. ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం .. నిమిషం నిబంధన సడలింపు

 ఇంటర్‌ పరీక్షల్లో నిమిషం నిబంధన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారు. దీంతో తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిబంధనను సడలించింది. ఉదయం 9గంటల తర్వాత.. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులనూ పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది.

2. మేడిగడ్డ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: కేటీఆర్‌

మేడిగడ్డ అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను శుక్రవారం భారాస నేతల బృందం పరిశీలించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూపిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు, రూ.లక్ష కోట్లు వృథా చేశారంటూ అధికార పార్టీ దుష్ప్రచారం చేయడం సరికాదు’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాహుల్‌ తొలిసంతకం ప్రత్యేక హోదాపైనే: వైఎస్‌ షర్మిల

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తుందని, రాహుల్‌ గాంధీ తొలి సంతకం దీనిపైనే చేస్తారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. తిరుపతి ఎస్వీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వైకాపా అరాచకం.. తాగునీటి కోసం వెళితే ట్యాంకర్‌తో తొక్కించి చంపేశారు

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరంలో దారుణం చోటు చేసుకుంది. తాగునీటి కోసం వెళ్లిన గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేసిన ఘటన కలకలం రేపింది. గ్రామంలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయడంతో బాణావత్‌ సామిని అనే మహిళ అక్కడికి వెళ్లింది. తెదేపా వర్గానికి చెందిన వారికి నీరు ఇచ్చేది లేదని.. వైకాపాకు చెందిన డ్రైవర్‌ ట్యాంకర్‌ను ముందుకు పోనివ్వడంతో గాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బెంగళూరులో పేలుళ్లు .. హైదరాబాద్‌లో పోలీసుల అప్రమత్తం

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం జరిగిన పేలుళ్ల ఘటనలో తొమ్మిది మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇంకా రూ.8,470 కోట్ల విలువైన ₹2 వేల నోట్లు ప్రజల వద్దే..!

చలామణీలో ఉన్న రెండు వేల రూపాయల (Rs 2,000 notes) నోట్లలో 97.62శాతం తిరిగి బ్యాంకులకు చేరినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) శుక్రవారం వెల్లడించింది. ఈ నోటును ఉపసంహరించుకుని తొమ్మిది నెలలు దాటినప్పటికీ.. ఇంకా రూ.8,470 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు మరో షాక్‌.. రూ.5.49 కోట్లు జరిమానా

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు (Paytm payments bank) మరో షాక్‌ తగిలింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (FIU) రూ.5.49 కోట్ల జరిమానా విధించింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఈ జరిమానా విధించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కేంద్రంలోని కీలక పదవుల్లోకి 25 మంది ప్రైవేటు రంగ నిపుణులు

కేంద్ర ప్రభుత్వంలోని కీలక పదవుల్లోకి 25 మంది ప్రైవేటు రంగ నిపుణులు చేరనున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఇటీవల ఈ నియామకాలకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ముగ్గురు జాయింట్‌ సెక్రటరీలు, 22 డైరెక్టర్లు/ డిప్యూటీ సెక్రటరీలను నియమించాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అటువంటి ప్రచారాలకు దూరంగా ఉండండి.. పార్టీలకు ‘ఈసీ’ హెచ్చరిక

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న (Lok Sabha Election) వేళ రాజకీయ పార్టీలు, నేతలకు ఎన్నికల సంఘం కీలక సూచనలు జారీ చేసింది. ప్రచారంలో భాగంగా అవాస్తవమైన, ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయొద్దని స్పష్టం చేసింది. సామాజిక వర్గం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగొద్దని, వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అప్పటివరకు పాక్‌ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దు.. బైడెన్‌కు చట్ట సభ్యుల లేఖ

పాకిస్థాన్‌ ఎన్నికల్లో (Pakistan Election) అవకతవకల వ్యవహారాన్ని అమెరికా (USA) తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని.. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగేవరకు కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దని అధ్యక్షుడు జో బైడెన్‌ను పాలక డెమోక్రటిక్ చట్టసభ్యులు కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని