Pak Elections: అప్పటివరకు పాక్‌ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దు.. బైడెన్‌కు చట్ట సభ్యుల లేఖ

పాకిస్థాన్‌ ఎన్నికల్లో రిగ్గింగ్‌ ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగే వరకు కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దని అధ్యక్షుడు జో బైడెన్‌ను పాలక డెమోక్రటిక్ చట్టసభ్యులు కోరారు.

Published : 01 Mar 2024 19:02 IST

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ ఎన్నికల్లో (Pakistan Election) అవకతవకల వ్యవహారాన్ని అమెరికా (USA) తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని.. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగేవరకు కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దని అధ్యక్షుడు జో బైడెన్‌ను పాలక డెమోక్రటిక్ చట్టసభ్యులు కోరారు. ఫిబ్రవరి 8 నాటి పాక్‌ సార్వత్రిక ఎన్నికల్లో భారీఎత్తున రిగ్గింగ్‌ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులు గురువారం పార్లమెంటులోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ పరిణామాల మధ్య అగ్రరాజ్య చట్టసభ్యుల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.

‘‘పోలింగ్‌కు ముందు, తరువాత రిగ్గింగ్‌ జరిగిందనే దానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సమగ్రమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన దర్యాప్తు జరిగేవరకు వేచి చూడండి. అంతవరకు ఆ ప్రభుత్వాన్ని గుర్తించొద్దు. లేనిపక్షంలో ఆ దేశాధికారుల ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని సమర్థించినట్లవుతుంది. అది అక్కడి ప్రజల ప్రజాస్వామ్య స్ఫూర్తిని తక్కువ చేసినట్లే’’ అని బైడెన్‌తోపాటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌కు రాసిన సంయుక్త లేఖలో చట్టసభ సభ్యులు పేర్కొన్నారు.

ఏమాత్రం బాధ్యత లేదు: పుతిన్‌ ‘అణు’ వ్యాఖ్యలపై అమెరికా ఫైర్‌

‘‘ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్‌ఖాన్‌కు జైలు శిక్షలు విధించారు. ఆ పార్టీ అభ్యర్థులకు స్వతంత్రులుగా పోటీ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. పీటీఐ శ్రేణులు.. పోలీసు దాడులు, అరెస్టులు, వేధింపులు ఎదుర్కొన్నారు. ఎన్నికల తుది ఫలితాల విడుదలలో జాప్యం అనుమానాలకు కారణమైంది. ఫలితాలు తారుమారైనట్లు ఆరోపణలు ఉన్నాయి’’ అని చట్టసభ్యులు తెలిపారు. ఓ వార్తా సంస్థ వివరాల ప్రకారం.. మొత్తం 33 మంది కీలక డెమోక్రాట్‌లు ఈ లేఖపై సంతకాలు చేశారు. ప్రోగ్రెసివ్ కాకస్ ఛైర్‌పర్సన్, భారత సంతతికి చెందిన ప్రమీలా జయపాల్ కూడా వారిలో ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని