Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jun 2024 21:04 IST

1. రామ్మోహన్‌ నాయుడికి పౌరవిమానయానం.. మంత్రులకు కేటాయించిన శాఖలివే..!

మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే.. కేంద్రమంత్రులకు శాఖలు కేటాయించింది. తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్‌ నాయుడికి పౌరవిమానయాన, పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ (సహాయ), భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ), జి.కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు.. బండి సంజయ్‌ కుమార్‌ హోంశాఖ (సహాయ) మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మోదీ క్యాబినెట్‌ తొలి భేటీ.. 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌

ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. సోమవారం సాయంత్రం తన మంత్రివర్గంతో సమావేశమయ్యారు. 7, లోక్‌ కల్యాణ్ మార్గ్‌లోని మోదీ నివాసంలో ఈ భేటీ కొనసాగుతోంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మంత్రి అవాస్‌ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. క్యాబినెట్‌ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు.. చంద్రబాబు నివాసానికి ఆశావహుల క్యూ!

మంత్రివర్గ కూర్పుపై తెదేపా అధినేత చంద్రబాబు తన నివాసంలో సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. దీంతో మంత్రివర్గంలో చోటు కోసం పలువురు ఆశావహులు ఆయన నివాసానికి క్యూ కట్టారు. తమ అధినేతను కలిసి ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, కూటమి ఎమ్మెల్యేలంతా మంగళవారం చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘ఒక్కో టీచర్‌ బదిలీకి ₹3 నుంచి 6 లక్షలు వసూలు’.. బొత్సపై ఏసీబీకి వర్ల ఫిర్యాదు

వైకాపా నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై తెదేపా నేత వర్ల రామయ్య అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో టీచర్ల బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారని, విచారణ జరపాలని అధికారులను కోరారు. బదిలీ కోసం ఒక్కో టీచర్‌ నుంచి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేశారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన కేశినేని నాని

సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్‌ పంచన చేరి ఓటమిపాలైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తన రాజకీయ ప్రయాణాన్ని ముగించినట్లు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. జాగ్రత్తగా ఆలోచించాకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి జగన్‌ సర్కార్‌ బాధితులకు ఆహ్వానం

తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు వైకాపా ప్రభుత్వం చేతిలో నానా రకాలుగా వేధింపులకు గురైన బాధితులను సైతం కొత్త ప్రభుత్వం ఆహ్వానించింది. ఆహ్వానం అందినవారిలో అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం సహా మొత్తం 104 కుటుంబాలు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘ఈ-పోస్ట్‌’తో మీ ప్రియతమ నేతకు విషెస్‌ చెప్పొచ్చు!

సార్వత్రిక ఎన్నికల విజేతల్ని అభినందించేందుకు ఈ-పోస్ట్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపేలా ఏపీ తపాలా శాఖ అవకాశం కల్పిస్తోంది. కేవలం రూ.10తో ఈ-పోస్ట్ ద్వారా శుభాకాంక్షల్ని ఏ పోస్టాఫీసు నుంచైనా పంపించవచ్చని విశాఖ పోస్టల్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. ప్రజలు తమ ప్రియతమ నేతకు శుభాభినందనలతో సందేశం పంపేందుకు ఈ సేవల్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రియాసీ బస్సుపై దాడి ఘటన.. పాక్‌ ఉగ్రసంస్థ హస్తం!

జమ్మూకశ్మీర్ రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై తామే దాడి చేశామని పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు సాగించే ఉగ్ర సంస్థ ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’  ప్రకటించింది. అలాంటి దాడులను తరచూ చేస్తూనే ఉంటామని హెచ్చరించింది. మరోవైపు రియాసీలో భారీగా రంగంలోకి దిగిన సైన్యం.. ముష్కరుల కోసం తీవ్రంగా గాలిస్తోంది. అడవుల్లో నక్కి ఉండే అవకాశం ఉండటంతో డ్రోన్లతో అణువణువూ జల్లెడ పడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఐటీఆర్‌ ఫైలింగ్‌.. ఈ తప్పులు చేయొద్దు..!

పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు (ITR) చేసే సమయం ఆసన్నమైంది. సరైన అవగాహన లేకపోయినా లేదా నిపుణుల సహాయం లేకుండా ఐటీఆర్‌ సమర్పించడం కొంత కష్టమైన విషయమే. ఐటీఆర్‌లో చేసే తప్పులను సరిదిద్దుకునే వెసులుబాటు ఉంటుంది. రివైజ్డ్‌ రిటర్నుల దాఖలు చేయడం ద్వారా వాటిని సవరించుకోవచ్చు. కానీ, అందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. ఎన్నికలకు ముందే.. రిషి సునాక్‌ రాజీనామా చేయనున్నారా?

మరికొన్ని వారాల్లో బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ప్రధాని పదవికి రిషి సునాక్‌ రాజీనామా చేయనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. వీటిని సునాక్‌ తోసిపుచ్చారు. తన ప్రచారాన్ని ఆపే ప్రసక్తే లేదని.. చివరిరోజు వరకు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. జులై 4న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని