Rain Alert: తెలంగాణకు వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ

మరో 3గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు భారీ ఈదురుగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం సాయంత్రం తెలిపింది. 

Updated : 06 May 2023 17:21 IST

హైదరాబాద్‌: మరో 3గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు భారీ ఈదురు గాలులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం సాయంత్రం తెలిపింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్‌, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. వర్షాల కంటే ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

ఇవాళ ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పియర్‌ స్థాయి వరకు కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 8న ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడన ప్రదేశం ఏర్పడే అవకాశముందని, ఇది మరుసటి రోజున వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ఈ వాయుగుండం ఉత్తర దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపునకు కదులుతూ తీవ్రమై తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ సంచాలకులు ప్రకటించారు.

హైదరాబాద్‌లో మొదలైన వర్షం..

నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, నిజాంపేట, ప్రగతినగర్‌, కూకట్‌పల్లి, దుండిగల్‌, మల్లంపేట్‌, గండి మైసమ్మ, సూరారం, గాగిల్లాపూర్‌, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, మియాపూర్‌, చందానగర్‌, మదీనాగూడ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. దీంతో వాహనచోదకులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. నాగర్‌ కర్నూలు జిల్లా కేంద్రంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని