Indian Army: మహిళలు, పిల్లలే పావులుగా.. ప్రమాదకర ఉగ్ర ధోరణి వెలుగులోకి!

కశ్మీర్‌లో ఆయుధాలు, సందేశాల చేరవేతకు పాక్‌ ఐఎస్‌ఐ, ఉగ్రవాద సంస్థలు.. మహిళలు, బాలబాలికలను వినియోగిస్తున్నాయని ఓ ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 11 Jun 2023 19:15 IST

శ్రీనగర్: కశ్మీర్‌ లోయ (Kashmir Valley)లో ఆయుధాలు, సందేశాల చేరవేతకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ (Pakistan ISI), ఉగ్రవాద సంస్థలు (Terror Groups).. మహిళలు, పిల్లలను వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని ఓ ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నియంత్రణ రేఖ(LOC) వెంబడి తిష్ఠవేసిన మూకలు.. శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాల్లో ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో బలగాలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని శ్రీనగర్‌కు చెందిన 15 కోర్‌ (చినార్‌ కోర్‌) జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ అమర్‌దీప్ సింగ్ ఔజ్లా తెలిపారు.

‘ప్రస్తుతం సంప్రదాయ మొబైల్‌ కమ్యూనికేషన్ ఉపయోగం తగ్గింది. దీంతో ఉగ్ర సందేశాలు, మాదకద్రవ్యాలు, ఆయుధాల చేరవేతకు మహిళలు, బాలబాలికలను వినియోగిస్తుండటం ముప్పుగా మారుతోంది. పాక్‌ ఐఎస్‌ఐ, ఉగ్రవాద సంస్థలు అవలంబిస్తోన్న ఇటువంటి కొన్ని కేసులను గుర్తించాం. వాటిని నిర్మూలించేందుకు కృషిచేస్తున్నాం’ అని లెఫ్టినెంట్ జనరల్ ఔజ్లా చెప్పారు. పొరుగు దేశం తన వైఖరిని మార్చుకోలేదని.. తాజాగా ఉత్తర కశ్మీర్‌లోని మచిల్ సెక్టార్‌లో చొరబాటే దీనికి ఉదాహరణ అని పరోక్షంగా పాక్‌ను ఉద్దేశించి మండిపడ్డారు. అయితే, కశ్మీర్‌లో శాంతి, సుస్థిరత స్థాపనలో పురోగతి సాధించినట్లు చెప్పారు.

‘నిరంతర సైనిక కార్యకలాపాలు, నిఘావర్గాల సమాచారంతో ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలతో ఉగ్రవాదులపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వారిలో చాలామంది ఇప్పటికే లోయను వీడారు. కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. స్థానికంగా ఉగ్రవాదుల సంఖ్య 33 ఏళ్ల కనిష్ఠానికి చేరుకుంది. ఈ ఏడాది దాడులు, ఎన్‌కౌంటర్లు తగ్గుముఖం పట్టాయి. కశ్మీర్‌లో ఎల్‌వోసీ వెంబడి చొరబాట్లు కొంతమేర తగ్గాయి. ప్రత్యర్థి కుట్రలను అడ్డుకునేందుకు పాలనాయంత్రాంగంతోసహా అన్ని భద్రతా ఏజెన్సీలు సంసిద్ధంగా ఉన్నాయి. స్థానికంగా ‘సహీ రాస్తా (సరైన మార్గం) వంటి ఉగ్రవ్యతిరేక కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని