Manipur: మణిపుర్ కల్లోలం.. ఇంటి నుంచి వెళ్లిన 30 మంది ఇప్పటికీ రాలేదు..!

మణిపుర్‌(Manipur)లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఘర్షణల మూలంగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 02 Aug 2023 12:08 IST

ఇంఫాల్‌: కల్లోలిత మణిపుర్‌(Manipur)లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నప్పటి నుంచి.. దాదాపు 30 మంది అదృశ్యమైనట్లు తెలుస్తోంది. మూడు నెలల కాలంలో వీరంతా అదృశ్యమయ్యారు. వారిలో టీనేజర్ల నుంచి నడి వయసు వరకు ఉన్నారని మీడియా కథనాలు వెల్లడించాయి.(Manipur violence)

47 ఏళ్ల సమరేంద్ర సింగ్‌ పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త. ఉద్రిక్తతలు మొదలైన కొద్దిరోజులకే అదృశ్యమయ్యాడు. ఇంతవరకూ అతడి జాడలేదని సింగ్ భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగ్ స్నేహితుడి జాడ కూడా లేదని తెలుస్తోంది. కాంగ్‌పోక్పీ ప్రాంతం వైపు వారు వెళ్లారని గుర్తించారు. తర్వాత నుంచి వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి.

మణిపుర్‌లో శాంతిభద్రతలు కుప్పకూలాయి

జులై ఆరున ఆంక్షలు సడలించడంతో 17 ఏళ్ల హిజామ్ లువాంగ్బీ నీట్ కోచింగ్‌ నిమిత్తం ఇంటి నుంచి వెళ్లింది. పరిస్థితులు సద్దుమణిగాయని భావించిన ఆమె.. తర్వాత  తన స్నేహితుడితో బైక్‌పై లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లింది. ఇక అప్పటి నుంచి వారి జాడలేకుండా పోయింది. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. వారు ఇంఫాల్‌కు సమీపంలోని నంబోల్‌ వైపు వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాలను బట్టి పోలీసులు వెల్లడించారు. వారిద్దరి ఫోన్లు రెండు వేర్వేరు జిల్లాల్లో స్విచ్ఛాఫ్ అయ్యాయని తెలిపారు.

ఇలా మూడు నెలల వ్యవధిలో అదృశ్యమైన వారి వెనక ఒక్కో కారణం ఉంది. ఫిర్యాదులు అందిన వెంటనే తాము చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. కానీ కనిపించకుండా పోయిన వారి జాడ మాత్రం దొరకడం లేదు. అదృశ్యమైన వారి సంఖ్య 30 మందిగా ఉన్నప్పటికీ.. ఇది మరింత పెరగొచ్చని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక  ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో వివిధ కారణాలతో 6వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని