టిష్యూ పేపర్‌పై ‘బాంబ్‌’ నోట్‌.. విమానంలో కలకలం

టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్‌’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్‌ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

Updated : 17 May 2024 08:45 IST

దిల్లీ: టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్‌’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్‌ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గుజరాత్‌లోని వడోదరకు వెళ్లేందుకు ఎయిరిండియా విమానం సిద్ధమైంది. అంతలోనే అందులోని వాష్‌రూంలో ‘బాంబ్‌’ అని రాసిఉన్న ఓ టిష్యూ పేపర్‌ సిబ్బంది కంటపడింది. దీంతో అప్రమత్తమైన వారు వెంటనే ప్రయాణికులు అందరినీ కిందకు దించేశారు. సీఐఎస్‌ఎఫ్‌తోపాటు దిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది విమానంలో క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు. అయితే, అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో అధికారులు, ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ‘‘ప్రయాణికులు అందరినీ సురక్షితంగా కిందకు దించేశాం. భద్రతా సంస్థలు పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాయి. ఊహించని ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు యత్నించాం. వారికి వసతి సౌకర్యం కల్పించాం. వారితోపాటు సిబ్బంది భద్రతకు కట్టుబడి ఉన్నాం’’ అని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం ప్రత్యేక విమానంలో ప్రయాణికులు వడోదరకు బయలుదేరి వెళ్లారని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు