Gen Naravane: జూన్‌ 16ను.. షీ ‘జిన్‌పింగ్‌’ ఇప్పట్లో మరచిపోడు!

జూన్‌ 16ను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సమీప భవిష్యత్తులో మరచిపోడని భారత మాజీ సైనికాధికారి జనరల్‌ నరవణె పేర్కొన్నారు.

Published : 17 Dec 2023 23:32 IST

దిల్లీ: భారత్‌-చైనా సైనికుల మధ్య గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ (Galwan clash) ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. పరిస్థితులను యుద్ధం అంచువరకు తీసుకెళ్లిన ఆ ఘటనకు సంబంధించి నాటి భారత సైనికాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె అరుదైన విషయాలు వెల్లడించారు. చైనా సైన్యాన్ని భారత సైనికులు దీటుగా తిప్పికొట్టిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. చైనా సైన్యం భారీ ప్రాణనష్టాన్ని చవిచూడటం గత రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారి అన్నారు. ఈ క్రమంలో జూన్‌ 16ను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సమీప భవిష్యత్తులో మరచిపోడని జనరల్‌ నరవణె వ్యాఖ్యానించారు. ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ (Four Stars of Destiny) పేరుతో నరవణె రాసిన పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

‘జూన్‌ 16 చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పుట్టిన రోజు. ఈ రోజును ఆయన సమీప భవిష్యత్తులో మరచిపోడు. చైనా, దాని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ భారీ స్థాయిలో ప్రాణనష్టాన్ని చవిచూడటం రెండు దశాబ్దాల్లో అదే తొలిసారి’ అని జనరల్‌ నరవణె పేర్కొన్నారు. తన జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు అని గుర్తు చేసుకున్నారు. ఇక తమ అనైతిక వ్యూహాలతో పొరుగు దేశాలపై దాడి చేయడం చైనాకు అలవాటేనని దుయ్యబట్టారు. కానీ, పొరుగు దేశానికి సవాలు విసిరితే ఏం జరుగుతుందో భారత సైన్యం ప్రపంచానికి చాటిచెప్పిందని జనరల్‌ నరవణె స్పష్టం చేశారు. ఆయన రాసిన పుస్తకంలో మార్కెట్లోకి త్వరలో రానుంది.

భారత 28వ సైనికాధిపతిగా (Chief of Army Staff) జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె.. డిసెంబర్‌ 31, 2019 నుంచి ఏప్రిల్‌ 30, 2022 వరకు సేవలందించారు. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలోకి 2020 జూన్‌లో చైనా సైన్యం చొరబడింది. దీనిని భారత దళాలు దీటుగా తిప్పికొట్టాయి. ఆ క్రమంలో కర్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులు కాగా.. చైనా వైపు భారీ ప్రాణనష్టం కలిగింది. దీనిపై చైనా అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. సుమారు 40 మందికిపైగా చైనా సైనికులు చనిపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని