మమతకూ ప్రమాద ఘంటికే!

కరోనా తీసుకువచ్చిన తంటాలు ఇప్పుడు ముఖ్యమంత్రుల పీఠాలకూ పరోక్షంగా ఎసరు పెడుతున్నాయి. అసెంబ్లీలో సభ్యులుగా లేనివారు సీఎంగా ఎన్నికైతే గరిష్ఠంగా ఆరు నెలల్లోగా సభకు ఎన్నిక కావాలనేది రాజ్యాంగ నిబంధన. ఉత్తరాఖండ్‌లో అలాంటి అవకాశం లేక తీరథ్‌ సింగ్‌ రావత్‌ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన వైదొలగడానికి ఇదో ప్రధాన కారణం. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విషయంలోనూ ఇలాంటి ప్రమాద ఘంటికలే మోగుతున్నాయి. రావత్‌ మాదిరిగానే మమత కూడా శాసనసభ్యురాలు కాదు. నందిగ్రామ్‌లో పోటీ చేసి ఓడిపోయిన ఆమె మే 4న సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

Updated : 04 Jul 2021 11:16 IST

ఉత్తరాఖండ్‌లో వచ్చిన సమస్యే బెంగాల్‌లోనూ తప్పదా?

ఉపఎన్నిక నిర్వహించకపోతే ఇబ్బందే

ఈనాడు, దిల్లీ: కరోనా తీసుకువచ్చిన తంటాలు ఇప్పుడు ముఖ్యమంత్రుల పీఠాలకూ పరోక్షంగా ఎసరు పెడుతున్నాయి. అసెంబ్లీలో సభ్యులుగా లేనివారు సీఎంగా ఎన్నికైతే గరిష్ఠంగా ఆరు నెలల్లోగా సభకు ఎన్నిక కావాలనేది రాజ్యాంగ నిబంధన. ఉత్తరాఖండ్‌లో అలాంటి అవకాశం లేక తీరథ్‌ సింగ్‌ రావత్‌ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన వైదొలగడానికి ఇదో ప్రధాన కారణం. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విషయంలోనూ ఇలాంటి ప్రమాద ఘంటికలే మోగుతున్నాయి. రావత్‌ మాదిరిగానే మమత కూడా శాసనసభ్యురాలు కాదు. నందిగ్రామ్‌లో పోటీ చేసి ఓడిపోయిన ఆమె మే 4న సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగం ప్రకారం నవంబరు 4లోగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. కరోనా మూడో ఉద్ధృతి రావచ్చనే ఆందోళన నేపథ్యంలో బెంగాల్‌లో ఖాళీగా ఉన్న భవానీపుర్‌ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం ముందుకు రాకపోతే తీరథ్‌ మాదిరి పరిస్థితే ఆమెకు ఎదురు కావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. సెప్టెంబరు 10లోపు తీరథ్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. కరోనా కేసుల కారణంగా మరికొన్ని నెలలపాటు ఉప ఎన్నికలు జరిపే అవకాశం లేనందున కూడా తాను రాజీనామా చేస్తున్నట్లు తీరథ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల్లోనూ ఎన్నికలను నిర్వహిస్తుండడం ఈసీ నేరపూరిత నిర్లక్ష్యమని ఇప్పటికే మద్రాస్‌ హైకోర్టు గట్టిగా తలంటింది. అందువల్ల బెంగాల్‌లో సమీప భవిష్యత్తులో ఉప ఎన్నిక జరుగుతుందా అనేది అనుమానమే. గతంలో కొందరు మంత్రులు సభలో సభ్యులు కాకుండానే పదవి చేపట్టి, ఆరు నెలలకు కొద్ది రోజుల ముందు రాజీనామా చేసి, మరోసారి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ఏడాది వరకు నెట్టుకురాగలిగారు. అలాంటిది చెల్లదని సుప్రీంకోర్టు 1995లో నిషేధం విధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని