పెగాసస్‌పై దర్యాప్తు నివేదిక గడువును పొడిగించిన సుప్రీం

పెను వివాదం సృష్టించిన పెగాసస్‌ స్పైవేర్‌పై దర్యాప్తు జరుపుతున్న కమిటీ నివేదిక సమర్పించే గడువును సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం పొడిగించింది. స్పైవేర్‌ ప్రభావానికి గురైన 29 మొబైల్‌ ఫోన్లను పరిశీలిస్తున్నామని, తమకు మరింత సమయం కావాలంటూ దర్యాప్తు కమిటీ

Published : 21 May 2022 05:23 IST

 స్పైవేర్‌ ప్రభావానికి గురైన 29 ఫోన్ల పరిశీలన కొనసాగుతోందన్న కమిటీ

 4 వారాల్లో ఆ ప్రక్రియ ముగిసే అవకాశం

 సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం వెల్లడి

దిల్లీ: పెను వివాదం సృష్టించిన పెగాసస్‌ స్పైవేర్‌పై దర్యాప్తు జరుపుతున్న కమిటీ నివేదిక సమర్పించే గడువును సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం పొడిగించింది. స్పైవేర్‌ ప్రభావానికి గురైన 29 మొబైల్‌ ఫోన్లను పరిశీలిస్తున్నామని, తమకు మరింత సమయం కావాలంటూ దర్యాప్తు కమిటీ మధ్యంతర నివేదికను అందజేయగా... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం అందుకు అంగీకరించింది. సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక, పర్యవేక్షక కమిటీ 29 మొబైల్‌ ఫోన్లను పరిశీలిస్తోందని, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు సహా పలువురి వాంగ్మూలాలను నమోదు చేసిందని ధర్మాసనం తెలిపింది. కొన్ని ప్రభుత్వ సంస్థలు, పాత్రికేయులు సహా మరికొందరు వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లు కమిటీ పేర్కొందని వెల్లడించింది. ఫోన్లను పరీక్షించేందుకు ప్రామాణిక నిర్వహణ నిబంధనలను ఖరారు చేయాల్సి ఉందని, సాంకేతిక కమిటీ బహుశా నాలుగు వారాల్లో దర్యాప్తు ప్రక్రియను ముగించి పర్యవేక్షక జడ్జీకి నివేదిస్తుందని పేర్కొంది. ఆ తర్వాత పర్యవేక్షక జడ్జీ... నివేదికను రూపొందించి ధర్మాసనానికి సమర్పించాల్సి ఉంటుందని, జులైలో ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ధర్మాసనంలో జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లి సభ్యులుగా ఉన్నారు.

మధ్యంతర నివేదిక వెల్లడికి నిరాకరణ

 సుప్రీంకోర్టు నియమిత సాంకేతిక, పర్యవేక్షక కమిటీ అందజేసిన మధ్యంతర నివేదికను పిటిషనర్లకు అందుబాటులో ఉంచాలన్న సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ విజ్ఞప్తిపై ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రస్తుత దశలో మధ్యంతర నివేదికను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు. దేశంలోని కొందరు రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల ఫోన్లలోకి ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ను ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చొప్పించి నిఘా పెట్టాయనే ఆరోపణలపై సుప్రీంకోర్టు గతేడాది అక్టోబరు 27న దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని