Coronavirus: విమానాలపై ఆంక్షలు, లాక్‌డౌన్లు అవసరం లేదు..!

కరోనా ఉద్ధృతి పరంగా ప్రస్తుతం భారత పరిస్థితి మెరుగ్గానే ఉందని నిపుణులు వెల్లడించారు. దాంతో లాక్‌డౌన్లు విధించే పరిస్థితి ఉండదని అంచనా వేశారు.

Updated : 24 Dec 2022 14:58 IST

దిల్లీ: భారత్‌లో ప్రస్తుతమున్న కొవిడ్(Covid-19) పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు అవసరం లేదని, లాక్‌డౌన్లు విధించాల్సిన పరిస్థితి లేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు హైబ్రిడ్ ఇమ్యూనిటీ(hybrid immunity)ని కలిగి ఉండటం వల్ల తీవ్ర కొవిడ్ లక్షణాలు, ఆసుపత్రిలో చేరికలకు అవకాశం ఉండకపోవచ్చని అంచనా వేశారు. 

‘మొత్తంగా చూసుకుంటే.. కొవిడ్ కేసుల్లో పెరుగుదల లేదు. ప్రస్తుతం మన పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఈ సమయంలో అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు, లాక్‌డౌన్లు విధించాల్సిన అవసరం లేదు’ అని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడంలో విమానాలను నిషేధించడం అంత ప్రభావవతంగా లేదని గత అనుభవాలు చూపిస్తున్నాయన్నారు. ‘ఇంకో విషయం ఏంటంటే.. చైనాలో విజృంభిస్తోన్న BF.7ను ఇప్పటికే భారత్‌లో గుర్తించారు. ఇంకోపక్క భారత ప్రజలు హైబ్రిడ్ ఇమ్యూనిటీ(వ్యాక్సినేషన్‌ + వైరస్‌ సోకడంతో వచ్చిన నిరోధకత)ని సొంతం చేసుకోవడంతో తీవ్ర వ్యాధి లక్షణాలు, ఆసుపత్రిలో చేరికలు ఉండకపోవచ్చు’ అని వెల్లడించారు. అయితే కొవిడ్ కేసులు తక్కువగా ఉండటం వల్ల ఉదాసీనత కనిపిస్తోంది కాబట్టి ఈ సమయంలో కొవిడ్ నియమావళిని బలోపేతం చేయాల్సి ఉందని చెప్పారు. చైనా అమలు చేసిన జీరో కొవిడ్ వ్యూహం వల్ల అక్కడి ప్రజలు సహజ నిరోధకతను పొందలేకపోయారని నిపుణులు వెల్లడించారు. అలాగే చైనా టీకాల తక్కువ ప్రభావశీలత కూడా ప్రస్తుత తీవ్రతకు కారణమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని