Manipur: మణిపుర్‌ ఘర్షణలు రాజకీయ సమస్య.. ఆ ఆయుధాలు ఇంకా వారి చేతుల్లోనే: ఆర్మీ ఉన్నతాధికారి

భద్రతా బలగాల నుంచి అపహరించిన ఆయుధాలు తిరిగి స్వాధీనం చేసుకునే వరకు మణిపుర్‌లో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయని ఈస్ట్రన్‌ కమాండ్‌ చీఫ్‌ అన్నారు. 

Published : 22 Nov 2023 12:17 IST

గువాహటి: మణిపుర్‌ (Manipur)లో జరుగుతున్న ఘర్షణలు రాజకీయ సమస్యని, భద్రతా బలగాల నుంచి అపహరించిన వేల ఆయుధాలను స్వాధీనం చేసుకునే వరకు రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతుంటాయని తూర్పు ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాణా ప్రతాప్‌ కలిత (Lt Gen Rana Pratap Kalita) అన్నారు. మయన్మార్‌ నుంచి శరణార్థులుగా వచ్చే వారికి మణిపుర్‌, మిజోరాంలో భారత్‌ ఆశ్రయం ఇస్తోందని తెలిపారు. అయితే ఉగ్రవాదులు, మాదక ద్రవ్యాల సరఫరా ముఠాలకు భారత్‌లో ఆశ్రయం పొందేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం సరిహద్దుల్లో పటిష్ఠమైన నిఘా ఉంచినట్లు తెలిపారు. 

‘‘హింసను అరికట్టి, రాజకీయపరమైన సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేలా.. ఇరు పక్షాలను ప్రోత్సహించేందుకు మేం యత్నిస్తున్నాం. ఈ సమస్యకు కచ్చితంగా రాజకీయ పరిష్కారం అవసరం. ప్రస్తుత హింస కారణంగా సర్వం కోల్పోయి.. బాధితులుగా మిగిలిన వారికి రక్షణ కల్పించి, వారికి అవసరమైన సాయం అదించడంపైనే దృష్టి సారించాం. హింసను ఆరికట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. అందులో చాలా వరకు విజయం సాధించాం. అయితే, మెయిటీ-కుకీ వర్గాల మధ్య ఉన్న వైరం కారణంగా అక్కడక్కడా హింస చెలరేగుతోంది. భద్రతా బలగాల నుంచి అపహరించిన నాలుగువేల ఆయుధాల్లో 1,500 మాత్రమే స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన వాటిని స్వాధీనం చేసుకునే వరకు హింస చెలరేగుతూనే ఉంటుంది’’ అని రాణా ప్రతాప్ తెలిపారు. 

మయన్మార్‌తో సరిహద్దులు ఉండటం వల్ల అక్కడి సైన్యానికి, తిరుగుబాటుదారులకు మధ్య జరుగుతన్న ఘర్షణల కారణంగా సామాన్య ప్రజలతోపాటు, సైనిక, పోలీసు సిబ్బంది భారత్‌లోకి శరణార్థులగా ప్రవేశిస్తున్నారని రాణా ప్రతాప్‌ తెలిపారు. వీరిలో సైనిక, పోలీసు సిబ్బందిని మయన్మార్‌లోకి వాపస్‌ పంపిస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల సరిహద్దుల్లో నివసించే ప్రజలు ఒకే తెగకు చెందిన వారు కావడంతో భారత్‌, మయన్మార్‌ వాసులను గుర్తించడం భద్రతా బలగాలకు కొంత కష్టంగా మారిందని అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు మయన్మార్‌ విదేశాంగ శాఖతోపాటు మణిపుర్‌, మిజోరాం ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో మాదక ద్రవ్యాల సరఫరా ముఠాలు, ఉగ్రమూకలు భారత్‌లోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని