Manipur Video: దేశాన్ని రక్షించినా.. భార్యను కాపాడుకోలేకపోయా..! కార్గిల్‌ వీరుడి దీనగాథ

యావత్‌ దేశాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేసిన మణిపుర్‌ (Manipur video) అమానవీయ ఘటనలో ఓ బాధితురాలి భర్త మాజీ సైనికుడు. 

Published : 21 Jul 2023 15:48 IST

ఇంఫాల్‌: మణిపుర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను (Manipur video) చేసి ఊరేగించిన ఘటన యావత్‌ దేశాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. ఆయుధాలు చేతపట్టిన ఓ అల్లరి మూక.. గ్రామంపై దాడి చేసి, ఇళ్లకు నిప్పు పెట్టి, యథేచ్చగా అత్యాచారాలు, హత్యలు చేసిన ఆ ఘటనలో ఓ కీలక విషయం వెల్లడైంది. దేశం సిగ్గుపడేలా చేసిన ఈ ఘటనలో బాధితురాలు ఓ మాజీ సైనికుడి (Indian Army) భార్య అని తెలిసింది. దీనిపై స్పందించిన ఆ బాధిత మహిళ భర్త, మాజీ సైనికుడు మాట్లాడుతూ.. కార్గిల్‌ యుద్ధం (Kargil war) సమయంలో దేశాన్ని రక్షించుకున్నప్పటికీ.. ఈ అమానవీయ ఘటన నుంచి మాత్రం తన భార్యను కాపాడుకోలేక పోయానని వాపోయారు.

‘కార్గిల్‌ యుద్ధంలో దేశం కోసం పోరాడాను. దీంతోపాటు ఇండియన్‌ పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌లో భాగంగా శ్రీలంకలోనూ పనిచేశాను. ఇలా దేశం కోసం పోరాడిన నేను.. నా ఇంటిని, భార్యను, గ్రామస్థులను మాత్రం కాపాడుకోలేకపోయాను. ఈ విషయం నన్నెంతో బాధిస్తోంది. కుంగుబాటుకు గురిచేస్తోంది’ అని ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ మాజీ సైనికుడు విలపించారు. ‘మే 4న తమ గ్రామంపై దాడి చేసిన ఆ మూక.. అనేక ఇళ్లకు నిప్పు పెట్టింది. అనంతరం ఇద్దరు మహిళలను ప్రజల ముందే వివస్త్రను చేసి ఊరేగించారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ దుండగులకు కఠిన శిక్ష విధించాలి’ అని ఆ కార్గిల్‌ వీరుడు డిమాండ్‌ చేశారు. ఇండియన్‌ ఆర్మీలో పనిచేసిన ఆయన.. అస్సాం రెజిమెంట్‌లో సుబేదార్‌గా సేవలందించినట్లు సమాచారం.

నగ్నంగా ఊరేగించి.. అత్యాచారకాండ

ఇక ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్‌లో పోలీసులు నమోదు చేసిన వివరాల ప్రకారం.. ‘దాదాపు 900-1000 మంది వ్యక్తులు ఏకే రైఫిళ్లు, ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్సాస్ తదితర అత్యాధునిక ఆయుధాలను పట్టుకొని ఆ గ్రామంలోకి ప్రవేశించారు. గ్రామంలోని అన్ని ఇళ్లను లూటీ చేసి ధ్వంసం చేశారు. నగదును చోరీ చేయడంతోపాటు ఫర్నిచర్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లిపోయారు. అనంతరం ఇళ్లకు నిప్పంటించారు. ఆ గ్రామానికి చెందిన ఐదుగురిని పోలీసులు రక్షించగా.. వారి నుంచి వాళ్లను లాక్కున్నారు. ఆ సమయంలో ఓ అమ్మాయిపై లైంగిక దాడికి యత్నించగా.. ఆమె సోదరుడు రక్షించేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడిని అక్కడిక్కడే ఆ దుర్మార్గులు హత్య చేశారు’ అని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని