Sharad Pawar: ‘నేను అలసిపోను.. రిటైర్ కాను’: అజిత్‌కు కౌంటర్‌ ఇచ్చిన ఎన్‌సీపీ అధినేత

‘నేను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని చెప్పడానికి వారు ఎవరు..?’ అంటూ తన అన్న కుమారుడు అజిత్ పవార్‌పై  శరద్‌ పవార్‌(Sharad Pawar) ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు విశ్రాంతి తీసుకునే ఉద్దేశం లేదని చెప్పారు. 

Published : 08 Jul 2023 17:13 IST

ముంబయి: రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలంటూ మహారాష్ట్ర(Maharashtra) ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) ఇచ్చిన సూచనపై శరద్ పవార్(Sharad Pawar) వ్యంగ్యంగా స్పందించారు.   పార్టీ కార్యకర్తల ప్రేమాభిమానాలు ఉన్నంతవరకు తాను రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు.

‘మొరార్జీ దేశాయ్‌ ఏ వయస్సులో ప్రధాని అయ్యారో తెలుసా..? నేను ప్రధాని లేక మంత్రిని కావాలనుకోవడం లేదు. కానీ దేశ ప్రజలకు నా సేవలు అందించాలని అనుకుంటున్నాను. నేనింకా వృద్ధుడిని కాలేదు’ అని అజిత్‌(Ajit Pawar)కు కౌంటర్ ఇచ్చారు. అలాగే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ గతంలో పలికిన మాటలను ప్రస్తావిస్తూ.. ‘నేను అలసిపోను. పదవీ విరమణ చేయను. నిత్యం జ్వలిస్తూనే ఉంటాను’ అని అన్నారు. ‘నేను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని చెప్పడానికి వారు ఎవరు..? నాకు ఇప్పటికీ పనిచేసే శక్తి ఉంది’ అని వెల్లడించారు.

ఇదీ చదవండి: కిడ్నాప్‌ చేసి.. బలవంతంగా పాదాలు నాకించి: మధ్యప్రదేశ్‌లో మరో దారుణం 

ఎన్‌సీపీ(NCP) పార్టీ పగ్గాలు శరద్ పవార్‌(Sharad Pawar) తర్వాత అజిత్‌కే దక్కుతాయని అంతా భావించారు. కానీ సీనియర్ పవార్ మాత్రం తన కుమార్తె సుప్రియా సూలేకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. దీని తర్వాతే అజిత్ తన వర్గంతో కలిసి భాజపా ప చేరారు. తాను శరద్‌ పవార్‌ కుమారుడిని కాకపోవడం వల్లే తనను పక్కనపెట్టారంటూ అజిత్ వ్యాఖ్యలు చేశారు. ‘నేను దీనిపై ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. నాకు కుటుంబ విషయాలు కుటుంబం బయట మాట్లాడటం ఇష్టం ఉండదు’ అని ఎన్‌సీపీ అధినేత ఆ మాటలపై స్పందించారు.

అజిత్‌ పవార్‌కు ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా వివిధ పదవులు దక్కాయని, తన కుమార్తె సుప్రియా సూలేకు ఆ పదవులను ఎప్పుడూ కట్టబెట్టలేదని చెప్పారు. ఆమెకు వాటిని పొందే అవకాశం ఉన్నా సరే దూరంగానే ఉన్నారని గుర్తుచేశారు. కేంద్రంలో మంత్రి పదవికి అవకాశం వచ్చినప్పుడు కూడా అది వేరే వారికే ఇచ్చామని తెలిపారు. ఇక తిరుగుబాటు చేసిన నేతలందరిపైనా అనర్హత వేటు వేస్తామని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని