PM Modi: మన దేశం బలంగా ఉంటేనే.. ప్రపంచం మాట వింటుంది : ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ భారత్‌ గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పారు. మన దేశం తలచుకుంటే.. ఎలాంటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరించగలదన్నారు.

Updated : 09 Apr 2024 15:15 IST

లఖ్‌నవూ: ఎంతటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరించగల శక్తి తనకుందంటూ భారత్‌ ప్రపంచానికి నిరూపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని పీలీభీత్‌లో భాజపా మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రసంగించిన ఆయన.. భారత్‌ గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పారు. 

‘‘ప్రస్తుతం ప్రపంచమంతా అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. సమస్య ఎంత క్లిష్టమైనా సరే.. భారత్‌ తలచుకుంటే కచ్చితంగా పరిష్కరించగలదు. ప్రతీఒక్కరి ఓటు బలంతోనే అది సాధ్యమవుతుంది. భారత్‌ స్ఫూర్తి, శక్తితో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు మనమంతా కృషి చేస్తున్నాం. అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని భారత్‌ ప్రపంచానికి నిరూపిస్తోంది. దేశం బలంగా ఉన్నప్పుడే ప్రపంచం దాని మాట వింటుంది’’ అని మోదీ పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ హయాంలో ఆ పార్టీ ప్రపంచ దేశాల నుంచి ఎన్నోసార్లు సాయం కోరిందని విమర్శించారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రపంచానికే ఔషధ సాయం చేసే స్థాయికి భారత్‌ ఎదిగిందని సగర్వంగా చాటి చెప్పారు. ‘‘మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా అవతరించినప్పుడు మీరు గర్వించారా లేదా? చంద్రయాన్‌ ద్వారా చంద్రునిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు గర్వించారా లేదా? జీ20 శిఖరాగ్ర సదస్సుకు సమర్ధవంతంగా బాధ్యత వహించిన భారత్‌ తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి’’ అని వ్యాఖ్యానించారు. 

యూపీ మాజీ సీఎంపై మోదీ ప్రశంసలు.. 

భాజపా సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌పై ప్రధాని ప్రశంసలు కురిపించారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో సీఎంగా ఉన్న ఆయన రామమందిర నిర్మాణం కోసం  తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. దేశంలోని ప్రతీ కుటుంబం అయోధ్య మందిరాన్ని నిర్మించేందుకు సహకరించిందని.. కానీ, ఇండియా కూటమి మాత్రం వ్యతిరేకిస్తూనే ఉందని విమర్శించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని