S Jaishankar: మా మైండ్ గేమ్ పనిచేస్తోంది: విమర్శలకు జై శంకర్‌ కౌంటర్‌

ఇటీవలి తన రష్యా పర్యటనపై వస్తోన్న విమర్శలు, భారత్‌ విషయంలో పాకిస్థాన్‌, కెనడా అనుసరిస్తోన్న విధానాల గురించి కేంద్రమంత్రి ఎస్‌ జై శంకర్‌(S Jaishankar) స్పందించారు. 

Published : 02 Jan 2024 14:39 IST

దిల్లీ: ఇతర దేశాలతో వ్యవహరించేప్పుడు భారత్‌ ఆలోచనాత్మకంగా ఉండాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌(S Jaishankar) వ్యాఖ్యానించారు. అలాగే రష్యాతో సంబంధాలు స్థిరంగా ఉన్నాయని, అవి భారత్‌కు ఎంతో కీలకమని మరోసారి స్పష్టం చేశారు. తన రష్యా(Russia) పర్యటనపై పాశ్చాత్య మీడియా నుంచి వస్తోన్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు.

డిసెంబర్‌లో జై శంకర్(S Jaishankar) రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల పర్యటనలో భాగంగా అధ్యక్షుడు పుతిన్‌(Putin)తో భేటీ అయ్యారు. దీనిపై పాశ్చాత్య మీడియా విమర్శలు చేస్తోంది. ‘ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతే.. మా మైండ్‌ గేమ్‌ పనిచేస్తున్నట్టే లెక్క. వారు ఏమైనా ఊహించుకోవచ్చు కానీ.. మా విధానం మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. రష్యాతో బంధం మాకు ఎప్పటికీ ముఖ్యమే’ అని మంత్రి బదులిచ్చారు. 2022 ప్రారంభం నుంచి రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధం విషయంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకొని భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. సార్వభౌమత్వం, దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చింది. చర్చల ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించింది. ఇక ఈ పర్యటనలో ప్రధాని మోదీ సందేశాన్ని పుతిన్‌కు మంత్రి అందజేశారు. అదే సమయంలో రష్యాలో పర్యటించాలని మోదీ(Modi)కి పుతిన్‌ ఆహ్వానం పంపారు. 

‘ట్రక్కు డ్రైవర్ల నిరసన.. పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తిన వాహనదారులు’

పాక్‌, కెనడాలపై విమర్శలు..

భారత్‌ను అస్థిరపరిచేందుకు పాక్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని దుయ్యబట్టారు. దశాబ్దాలుగా పాక్‌ ప్రవర్తన అలాగే ఉందన్నారు. కానీ తమ విధానాల ద్వారా ఆ జిత్తుల్ని చిత్తు చేశామన్నారు. అలాగే కెనడాతో దౌత్యపరమైన విభేదాల గురించి స్పందించారు. ఆ దేశ రాజకీయాలు.. ఖలిస్థానీ శక్తులకు చోటు కల్పించాయని విమర్శించారు. రెండు దేశాల సంబంధాలను దెబ్బతీసే కార్యకలాపాలను అనుమతించాయని మండిపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని