Devil: డెవిల్‌లో కల్యాణ్‌ రామ్‌ విశ్వరూపాన్ని చూస్తారు!

‘‘కొత్తదనం నిండిన కథాంశంతో పాటు అన్ని రకాల వాణిజ్యాంశాలతో కూడిన సినిమా ‘డెవిల్‌’. చాలా బాగుంటుంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు కల్యాణ్‌ రామ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

Updated : 13 Dec 2023 09:24 IST

‘‘కొత్తదనం నిండిన కథాంశంతో పాటు అన్ని రకాల వాణిజ్యాంశాలతో కూడిన సినిమా ‘డెవిల్‌’. చాలా బాగుంటుంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు కల్యాణ్‌ రామ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంయుక్తా మేనన్‌ కథానాయిక. మాళవిక నాయర్‌ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో మంగళవారం చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ఓ హత్య కేసు పరిశోధనతో కథను ప్రారంభించి.. ఆ తర్వాత చరిత్ర, బ్రిటిష్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు.. ఇలా అనేక కీలక అంశాల్ని చూపిస్తూ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ ప్రచార చిత్రంలో బ్రిటిష్‌ గూఢచారిగా కల్యాణ్‌ రామ్‌ కనిపించిన తీరు.. చేసిన యాక్షన్‌ హంగామా ఆకట్టుకున్నాయి. ‘‘విశ్వాసంగా ఉండటానికి, విధేయతతో బతికేయడానికి కుక్కని అనుకున్నావా.. లయన్‌’’ అంటూ ట్రైలర్‌లో కల్యాణ్‌ రామ్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

ఈ ట్రైలర్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘‘చాలా మంచి కథ, కథనాలతో.. చక్కటి విజువల్స్‌తో రూపొందిన చిత్రమిది. ఇది 1940ల నేపథ్యంలో సాగే సినిమా. దీన్ని ఎక్కడపడితే అక్కడ చేయలేం. కచ్చితంగా సెట్స్‌లోనే చేయాలి. దానికి కావాల్సిన ప్రపంచాన్ని గాంధీ అద్భుతంగా తీర్చిదిద్దారు. అలాగే నిర్మాత అభిషేక్‌ నామా ఖర్చుకు వెనకాడకుండా ఎంతో ఉన్నతంగా దీన్ని నిర్మించారు’’ అన్నారు. ‘‘ఓ కొత్త కథాంశంతో రూపొందిన చిత్రమిది. దీంట్లో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది’’ అంది నటి సంయుక్తా మేనన్‌. చిత్ర దర్శక నిర్మాత అభిషేక్‌ నామా మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌ ఉన్న సినిమాని నమ్మి.. రెండేళ్ల పాటు మరే చిత్రం చేయకుండా దీని కోసమే నిబద్ధతతో పని చేశారు కల్యాణ్‌రామ్‌. దీంట్లో ఆయన విశ్వరూపాన్ని చూస్తారు. ఆయన నటన, యాక్షన్‌ మరో స్థాయిలో ఉంటాయి. ఈ ఏడాది ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్‌తో మొదలైంది. అది ఈనెల 29న వస్తున్న మా ‘డెవిల్‌’ అనే బ్లాక్‌బస్టర్‌తో ముగియనుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మాళవిక నాయర్‌, హర్ష వర్ధన్‌ రామేశ్వర్‌, శ్రీకాంత్‌ విస్సా, శ్రీహర్ష, తమ్మిరాజు, సౌందర్‌ రాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

‘దేవర’ గ్లింప్స్‌ సిద్ధమవుతోంది..

ఎన్టీఆర్‌ - కొరటాల శివ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’ నుంచి త్వరలో గ్లింప్స్‌ విడుదల చేయనున్నట్లు కల్యాణ్‌ రామ్‌ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని చూపించనున్నామని, విజువల్‌ ఎఫెక్ట్స్‌కు చాలా సమయం పడుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ‘బింబిసార 2’పైనా కల్యాణ్‌ రామ్‌ స్పష్టత ఇచ్చారు. ఈ సినిమా చిత్రీకరణను వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలల్లో ప్రారంభిస్తామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని