Opposition Meeting: విపక్షాల కీలక భేటీకి మాయావతి, కేజ్రీవాల్‌ ఝలక్‌

విపక్షాలను ఏకతాటి మీదకు తెచ్చేందుకు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతిపక్షాల భేటీకి మాయావతి, కేజ్రీవాల్‌ ఝలక్‌ ఇచ్చారు. సమావేశానికి హాజరుకాబోనని మాయావతి ప్రకటించగా.. కేంద్ర ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తేనే భేటీలో పాల్గొంటానని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

Published : 22 Jun 2023 16:53 IST

దిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపా (BJP) నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేసేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్న తరుణంలో.. యూపీ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి తాను హాజరుకావడం లేదంటూ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఇది ‘కేవలం చేతులు కలిపే సమావేశమే తప్ప.. మనసులు కలిపేది’ కాదని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘ ఈ దేశాన్ని ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, వెనకబాటుతనం, నిరక్షరాస్యత, జాతి విద్వేషాలు పీడిస్తున్నాయి. ప్రస్తుతం అణగారిన వర్గాల పరిస్థితిని బట్టి.. కాంగ్రెస్‌, భాజపా వంటి పార్టీలు డా.బీఆర్‌ అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగాన్ని అమలు చేయలేవని స్పష్టమవుతోంది. ఇలాంటి సమావేశాలు నిర్వహించకముందే.. ఆయా పార్టీలు ప్రజలకు తమపై ఉన్న విశ్వాసాన్ని నిరూపించుకుంటే బాగుండేది.’’ అని మాయావతి అభిప్రాయపడ్డారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయన్న మాయావతి.. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఈ రాష్ట్రం చాలా కీలకమన్నారు. అధ్యయనాలు కూడా అదే చెబుతున్నా.. విపక్షాలను ఐక్యం చేసేటప్పుడు ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాన్ని విస్మరించడం విడ్డూరమన్నారు. ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటి మీదకు తీసుకొస్తామంటున్న నేతలు నిజంగా తమ లక్ష్యం గురించి ఆందోళన చెందడం లేదని దీనిని బట్టి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. మరోవైపు బీఎస్‌పీని ఆహ్వానించలేదని బిహార్‌ నాయకులు చెబుతున్నారు. అందుకే ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఎస్‌పీతో పాటు బిజు జనతాదళ్‌, భారాస పార్టీలకు ఆహ్వానం అందనట్లు సమాచారం. 

కాంగ్రెస్‌కు కేజ్రీవాల్‌ అల్టిమేటం

శుక్రవారం ప్రతిపక్షాల సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్‌ కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేశారు.  దిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్‌ వ్యతిరేకించాలని, లేదంటే ప్రతిపక్షాల భేటీకి  హాజరుకాబోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా భవిష్యత్‌లో ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించిన అన్ని సమావేశాలకు దూరంగా ఉంటామని చెప్పారు. ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్‌ తన పూర్తి వైఖరిని వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘ ఆర్డినెన్స్‌ విషయంలో కాంగ్రెస్‌ కచ్చితంగా మద్దతివ్వాల్సిందే. లేదంటే విపక్షాల సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేస్తాం. భవిష్యత్‌ సమావేశాలకూ దూరంగా ఉంటాం’’ అని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

దేశ రాజధాని పరిధి దిల్లీలో గ్రూప్‌ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సంబంధిత ఉద్యోగుల విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ రాజధాని సివిల్‌ సర్వీస్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి దిల్లీ ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్‌లో కేంద్రం స్పష్టం చేసింది.

బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అగ్రనేత నీతీశ్‌కుమార్‌ ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌ సహా వివిధ విపక్షాలు ఆయన నివాసంలో శుక్రవారం సమావేశం కానున్నాయి. దీనిలో ప్రధాని అభ్యర్థి గురించి ఎలాంటి చర్చ ఉండదని ఇప్పటికే పార్టీలు స్పష్టం చేశాయి. అన్ని వనరులూ ఉన్న భాజపాను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహం, పార్టీల మధ్య అవగాహనకు సూత్రం రూపకల్పన, ఇచ్చిపుచ్చుకునే తీరులో మెలగడం వంటి అంశాలపైనే చర్చలు సాగించాలని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని