PawanKalyan: జగన్‌ను పంపించేద్దాం

‘వివేకా హత్య వెనక ఉన్నవారే నన్ను తొలగించటానికీ సుపారీ ఇచ్చారని కచ్చితంగా తెలిసింది. ఎదుటివాళ్లు హింసిస్తుంటే మనం అహింసో పరమో ధర్మః అనలేం. వైకాపా ప్రభుత్వ అరాచకాల్ని చూస్తున్న ప్రజల్లో మార్పు ఎప్పుడో మొదలైంది.

Updated : 21 Jun 2023 07:24 IST

జరిగిన నష్టం చాలు... ఏపీని కాపాడుకుందాం
జగన్‌ ప్రభుత్వంపై ప్రజలంతా తిరగబడాల్సిందే
గెలవాల్సింది రాష్ట్రం... పార్టీలు కాదు
ఆంధ్రకు బలమైన పౌరసమాజం అవసరం
మనోడు కాదు.. సరైనోడు పాలకుడు కావాలి
ఏం జరిగినా పొత్తులు ఖాయం
అన్ని పార్టీలూ స్పందించాలి
నా అంతానికి సుపారీ
వైకాపాకు 18 శాతం ఓట్లు తగ్గుతాయి
ప్రజల్లో మార్పు మొదలైంది
మార్గదర్శిపై దాడి జగన్‌ క్రూరత్వానికి పరాకాష్ఠ
ఈనాడుతో ప్రత్యేక ముఖాముఖిలో పవన్‌ కల్యాణ్‌
కనపర్తి శ్రీనివాస్‌, బి.ఎస్‌.కె.దుర్గాప్రసాద్‌, జె.కళ్యాణ్‌బాబు (ఈనాడు ప్రతినిధులు)

‘వివేకా హత్య వెనక ఉన్నవారే నన్ను తొలగించటానికీ సుపారీ ఇచ్చారని కచ్చితంగా తెలిసింది. ఎదుటివాళ్లు హింసిస్తుంటే మనం అహింసో పరమో ధర్మః అనలేం. వైకాపా ప్రభుత్వ అరాచకాల్ని చూస్తున్న ప్రజల్లో మార్పు ఎప్పుడో మొదలైంది. ఓటింగ్‌కి దూరంగా ఉండేవారంతా ఈసారి పోలింగ్‌ కేంద్రాల బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. నా పర్యటనల్లో ఈ మార్పు స్పష్టంగా అనుభవంలోకి వస్తోంది. వైకాపా వ్యతిరేక ఓట్లు చీలవు. పార్టీల మధ్య కొన్ని సర్దుబాట్లు, రాజీలు, త్యాగాలు తప్పవు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయి. అధికార పార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాయి. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓట్లు 18 శాతం తగ్గుతాయి’... అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధీమాగా చెప్పారు. వారాహి యాత్రలో ఉన్న ఆయన ‘ఈనాడు’ ప్రతినిధులతో కాకినాడలో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు.


  • 2019 ఎన్నికల్లో జగన్‌ అధికారంలోకి రావడమే మంచిదైంది. ఒక దుర్మార్గుడు, అవినీతిపరుడు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరికీ అనుభవంలోకి వచ్చింది. పాము తొలుత పక్కనున్నవన్నీ తినేసి, తర్వాత తన గుడ్లనే తినేస్తుంది. జగన్‌ కూడా అలాంటి వాడే! ఆ విషయం ప్రజలు గుర్తించారు. అందుకే మరోసారి అలాంటి వ్యక్తిని గెలిపించకూడదని కృతనిశ్చయంతో ఉన్నారు.

  • వైకాపా ప్రభుత్వ అరాచకాలకు, బెదిరింపులకు తలొగ్గి పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడం సరికాదు. ఎన్నాళ్లు మౌనంగా ఉంటారు? అందరూ ఏకతాటిపైకి రావాలి. ఇక్కడే ఉండాలి. ప్రతిఘటించాలి. నా సినిమాలకు మాత్రమే టికెట్‌ ధరలు తగ్గిస్తే భరించానే తప్ప పారిపోలేదు. పద్నాలుగేళ్ల పిల్లాడిని పెట్రోల్‌ పోసి చంపితే.. దుప్పటికప్పి మృతదేహాన్ని తీసుకెళదామా? ఎదురు తిరుగుదామా? అన్నది తేల్చుకోవాలి.

  • ఇసుక, గనులు వంటి సహజవనరులన్నీ దోచుకుంటున్న వ్యక్తికి క్లాస్‌వార్‌ గురించి మాట్లాడే అర్హత లేదు. ఆయనేమైనా చారుమజుందారా? తరిమెల నాగిరెడ్డా? పుచ్చలపల్లి సుందరయ్యా? ఎవరితను..? వందలాది ముఖ్యమైన పదవులన్నీ తన సామాజికవర్గానికి కట్టబెట్టిన జగన్‌ ‘క్లాస్‌వార్‌’ గురించి మాట్లాడటమా? ఓ వైకాపా ఎమ్మెల్సీ తన దగ్గర డ్రైవర్‌గా పనిచేసే దళిత యువకుడిని చంపి... మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేస్తే... ఆ ఎమ్మెల్సీపై ఈగ వాలనివ్వని ఈ ముఖ్యమంత్రి దళితులకు మేనమామా?  

పవన్‌ కల్యాణ్‌


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ పరిస్థితులు ఉన్నాయి. జగన్‌లాంటి దారుణమైన పాలకుడిని ఓడించేందుకు ఎవరితోనైనా కలిసి పని చేయాల్సిందే. ఏది ఏమయినా, ఎటు నుంచి ఎటు తిరిగి ఏం జరిగినా అంతిమ లక్ష్యం రాష్ట్రంలో వైకాపా పాలన లేకుండా చేయడమే. ఇప్పటికే రాష్ట్రానికి జరిగిన నష్టం చాలు, రాష్ట్రంలో ఇక వైకాపా పాలన ఉండకూడదు. ఇందుకు ప్రతిపక్ష పార్టీలు కలవబోతున్నాయి. ఒక ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అయినా వైకాపాకు వ్యతిరేకంగా కలుస్తాం. ఇది జరుగుతుంది. ప్రజలు మార్పునకు, వైకాపా ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు రావాల్సి ఉంది. ఇక్కడ కక్కుర్తిపడకూడదు. ఇగోలకు వెళ్లకూడదు. వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇప్పటికే మూడుసార్లు చెప్పా. దీనిపై భాజపా, తెదేపాతో సహా అందరూ స్పందించాలి. స్నేహహస్తం అందించాను. వారు అందుకోవాలి. ముందు రాష్ట్రం స్థిరంగా ఉండాలి. ఈ దోపిడీ ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలి. గతంలో అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు దేశంలో సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నవారూ కలిశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ సమయంలో రాష్ట్రం గెలవాలి, పార్టీలు కాదు. విద్యావంతులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు... అంతా స్వార్థం వదిలి ఇలాంటి సమయంలో రాష్ట్రం కోసం ఎంతో కొంత చేయాలి.

2019 నుంచే నాపై గురి..

వివేకానందరెడ్డి హత్య వెనక ఉన్నవారే నన్ను తొలగించటానికీ సుపారీ ఇచ్చారని కచ్చితంగా తెలిసింది. బలమైన సమూహానికి నాయకుడిగా ఉన్నాను కాబట్టి ఆ ఆలోచన వారికి ఉంది. 2019 ఎన్నికల్లో వైకాపా విజయం సాధించకపోతే నన్ను చంపేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నారని అప్పట్లో ఇంటెలిజెన్సు వాళ్లూ చెప్పారు. తాజాగా మొన్నటి విశాఖ పర్యటనలో ఇలాంటి ప్రయత్నం జరుగుతోందని సమాచారం అందింది. విశాఖలో పాలకులు పెద్ద గొడవ సృష్టించబోతున్నారని నాకు ముందే సమాచారం వచ్చింది. సరిగ్గా అలాగే జరిగింది. రెండు మూడు ప్రాంతాల్లో గొడవలు సృష్టించేందుకు వాళ్లు మనుషులను పెట్టారని చెప్పారు. గొడవలు చేయడానికి కిరోసిన్‌ వంటివి సిద్ధం చేసుకున్నారని, ఆ హడావుడిలోనే నా ప్రాణాలు తీయాలని ప్రణాళిక రచించుకున్నారని తెలిసింది. వీళ్లంతా క్రిమినల్‌ గ్యాంగులు, వారితో సంబంధాలు ఉన్న వారే కదా.. వివేకానందరెడ్డిని చంపారని తెలిసినా వాళ్లని వెనకేసుకు వస్తోంటే నాకు అందిన సమాచారం ఎలా కాదనగలం?

వైకాపాకు ప్రజాగ్రహం తప్పదు

జగన్‌ ప్రభుత్వంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. హామీ ఇచ్చిన 2.50 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేవారినైనా ప్రోత్సహించాల్సింది. అదీ చేయడం లేదు. బెంగళూరులో 2,000, మాదాపూర్‌లో 1,500 ఐటీ కంపెనీలు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో పట్టుమని పదీ లేవు. ఉన్నవీ వెళ్లిపోయాయి. వర్క్‌ ఫ్రం హోం చేసేందుకు విద్యుత్తూ ఉండదు. యువత తీవ్ర నిరాశతో ఉంది. ఆటో డ్రైవర్లకు ఇచ్చేది రూ.10 వేలే. కానీ వాళ్లకి పన్నులు, జరిమానాలు, రోడ్లు పాడవడంతో నిరంతరం పెరిగిపోయిన నిర్వహణ ఖర్చుల భారమే అధికంగా ఉంది. మత్స్యకారులకు భరోసా నిధులు అందరికీ అందడం లేదు. అర్హుల్లో సగం మందికే ఆ పథకాలు అందిస్తున్నారు. బీమా సౌకర్యం ఉండటం లేదు. గృహిణులు ఈ ప్రభుత్వంపై చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఎమ్మెల్యేల గూండాగిరీ, వారు మాట్లాడే విధానమూ నచ్చడం లేదు. విద్యుత్తు బిల్లులూ దారుణంగా వస్తున్నాయని గృహిణులు కోపంతో ఉన్నారు. యువతరం కూడా జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అనేక వర్గాలకు ఎన్నో కార్పొరేషన్లు పేరుకు ఏర్పాటు చేసినా పాత పథకాలు 18 రద్దు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వంపై ప్రజాగ్రహం తీవ్రంగా ఉండబోతోంది.

ప్రతిఘటించాల్సిందే

అన్నిసార్లూ ‘అహింసో..’ అనుకుని కూర్చోకూడదు.  నీ ప్రత్యర్థి వేటకత్తులతో కొడవళ్లతో నరుకుతుంటే అహింసో పరమో ధర్మః అనలేం కదా! కొట్టడానికి వస్తే చూస్తూ ఊరుకుంటామా? తిరగబడాల్సిందే...అలాంటి సందర్భంలో అహింస అనేది ఒక భ్రమ. 14 ఏళ్ల బాలుడిని పెట్రోలు పోసి తగలబెడుతోంటే చూస్తూ ఊరుకుంటే ఎలా? ఆ తర్వాత చనిపోయినవాడిపై దుప్పటికప్పితే సరిపోతుందా? డ్రైవర్‌ను చంపేసి వైకాపా నాయకుడు ఇంటికి మృతదేహాన్ని పార్సిల్‌ చేస్తే దాన్ని ఏమంటారు. నీ పార్టీ ఎమ్మెల్సీ ఓ దళిత యువకుడిని చంపేసి ఇంటికి డోర్‌ డెలివరీ చేస్తే నువ్వు దళితులకు మేనమామ ఎలా అవుతావు? క్లాస్‌వార్‌ అంటూ ఎలా మాట్లాడతావు? వైకాపా వాళ్లు ప్రజాబలంతో కాకుండా అరాచకంతో ఎదుగుదామనుకుంటున్నారు. మనం గట్టిగా పోరాడాల్సిందే. కాకినాడ ఎమ్మెల్యే గూండాగిరీ చేస్తాడని తెలియదా? దీన్ని ఎదుర్కోవడానికి మొదట నాలాంటి వాడు బయటకు వస్తాడు. ఆ తర్వాత మిగిలిన వారూ వస్తారు. అదే క్షేత్రధర్మం. తిరగబడటమే ఆ ధర్మం. ప్రజలు మెత్తబడిపోవడం వల్లే అరాచకం పెరిగిపోయింది. మాపై దాడులు చేస్తే చూస్తూ కూర్చోము. మా గురించి మాట్లాడితే భయపడం. ప్రతి ఒక్కరూ ఎదురుతిరగాలి. పోరాడటానికి ఎవరూ లేరనుకోవద్దు. నేను ఉన్నా. పోరాడుతున్నా. నా మీద రాళ్లు వేస్తామంటారు, బూతులు తిడతారు, సుపారీ ఇచ్చి చంపేస్తామంటారు. నిలబడే ఉన్నా, పోరాడుతూనే ఉంటా. ఎవరైనా చనిపోవాలని ఎందుకు అనుకుంటారు. స్వీయరక్షణే ముఖ్యం కదా! నేనేమీ పోలీసులపై దాడులు చేయలేదే? ప్రతిఘటన ఆపలేదే? ఒక గూండా ఎమ్మెల్యే మనుషులు వచ్చి నీ మీద దాడి చేస్తోంటే ఎదురుతిరగకపోతే తప్పు. పాలకులు సహజ వనరులు దోచుకోవటంతో ఆగట్లేదు. ప్రజల వ్యక్తిగత ఆస్తులను కూడా దోచేసుకుంటున్నారు. వారాహి యాత్రలో ఇలాంటి విషయాలు నా దృష్టికి వస్తున్నాయి. చాలా ప్రశాంతమైన ప్రాంతాల్లోనూ ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌లో జరిగిన వ్యక్తిగత ఆస్తుల దోపిడీ ఇప్పుడు ఏపీలో ప్రశాంత ప్రాంతాలకూ వచ్చేసింది. సర్వేల పేరుతో వచ్చి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో చూసుకుంటున్నారు. ఎవరు బలహీనులో గమనిస్తున్నారు. ఆ తర్వాత వచ్చి ఆక్రమించుకుంటున్నారు. వివాదాలు సృష్టిస్తున్నారు. ఆనక సెటిల్‌మెంట్‌ అంటున్నారు.


మార్గదర్శిపై జగన్‌ శాడిజం

ప్రభుత్వం తలుచుకుంటే ఒక వ్యక్తిని వెంటాడటం తేలిక. మార్గదర్శి విషయంలోను, రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు విషయంలోనూ జగన్‌ వ్యవహరిస్తున్న తీరు శాడిజానికి పరాకాష్ఠ. ఆరోగ్యం బాగా లేదని చెప్పినా ఆయనను వేధించడం బాధ కలిగించే అంశం. మన ఇంట్లో ఆడపడుచుల్ని ఎవరైనా ఏమైనా అంటే చంపేస్తాం, వేరేవారి ఇళ్లల్లోని ఆడపడుచుల్ని ఏ నెపంతోనైనా వేధించొచ్చు అన్నది జగన్‌ ప్రభుత్వ క్రూర విధానం. మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తీరు గర్హనీయం. అంతమంది పోలీసుల్ని పెట్టి భయభ్రాంతుల్ని చేయడానికి వాళ్లేమైనా నేరస్థులా? పాలకులకు రుచించని వార్తలు రాస్తే భయభ్రాంతుల్ని చేస్తామంటే ఎలా? ఈ రోజున ఏ పత్రికలో, ఏ ప్రసార మాధ్యమంలో చూసినా... మెజార్టీ పాత్రికేయులు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందినవారే. తెలుగు చిత్రపరిశ్రమకూ రామోజీరావు మూలస్తంభం. ఆయనకు గౌరవం ఇవ్వాలి కదా? అన్ని సాధించిన వ్యక్తిని అలా వేధించడం క్రూరత్వానికి పరాకాష్ఠ. పత్రిక అన్నాక మెచ్చుకునే వార్తలుంటాయి. తప్పు చేస్తే నిందించే వార్తలూ ఉంటాయి. ఎత్తిచూపిన తప్పులను సరిదిద్దుకోవాలిగానీ, రాసిన పత్రికపై ప్రభుత్వమే కక్షగట్టడమేంటి? సర్కారు చర్యను రామోజీరావుపై వ్యక్తిగత దాడిగానే చూడాలి. ఆయన అనారోగ్యంతో మంచంపై ఉన్న ఫొటోల్ని పత్రికలకు విడుదల చేయడం జగన్‌ శాడిజానికి నిదర్శనం.


దోపిడీదారా ‘క్లాస్‌వార్‌’పై మాట్లాడేది..!

ధనికులు, పేదల మధ్య యుద్ధం (క్లాస్‌వార్‌) గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు. నిజంగా క్లాస్‌వార్‌ చేసేవాడు మొదట కులాన్ని వదిలేసుకోవాలి. పుచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు నాయకులంతా అదే చేశారు. కొండపల్లి సీతారామయ్య రెడ్డి సామాజికవర్గానికి చెందినవారని ఎందరికి తెలుసు? తరిమెల నాగిరెడ్డి భూస్వాములతోనే పోరాడారు. సొంత బావమరిది సంజీవరెడ్డితో పోరాటం చేశారు. క్లాస్‌వార్‌ చేసేవాడు మాటల్లో కాకుండా... చేతల్లో చూపించాలి. చారుమజుందార్‌ వంటి వాళ్లు క్లాస్‌వార్‌ గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ, జగన్‌ వంటి దోపిడీదారులు కాదు. జగన్‌ చేస్తోంది కుల పోరాటం (క్యాస్ట్‌ వార్‌). అతను క్లాస్‌వార్‌ గురించి మాట్లాడే ముందు ఒకే కులానికి కట్టబెట్టిన మెజారిటీ పోస్టుల నుంచి వారిని తప్పించాలి. గతంలో క్లాస్‌వార్‌ చేసిన ఎవరికీ జగన్‌లా రూ.వేల కోట్లు లేవు. గాడ్‌ఫాదర్‌ నవల్లో మొదటి పేజీలో.... ‘బిహైండ్‌ ఎవ్రీ గ్రేట్‌ ఫార్చ్యూన్‌ దేర్‌ ఈజ్‌ ఎ క్రైమ్‌’ అని ఉంటుంది. అది జగన్‌కు, ఆయన పార్టీలోని ఇతర దోపిడీదారులకు కచ్చితంగా సరిపోతుంది. జయలక్ష్మి కోఆపరేటివ్‌ బ్యాంకు వాళ్లు... పదవీ విరమణ చేసిన వారిని నమ్మించి, ఎక్కువ వడ్డీ ఆశ చూపించి, రూ.250 కోట్లకు ఐపీ పెట్టారు. జైలుకి వెళ్లారు. ప్రస్తుత పాలకుల తీరూ అలాగే ఉంది. ప్రకృతి వనరుల మీద వాళ్ల పెత్తనమేంటి? వైకాపాలోని ధనికులు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మరింత ధనవంతులవుతున్నారు. రాష్ట్రంలో పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు. వాళ్లు నక్సలైట్లలా ఆయుధాలు పట్టుకుని పోరాడలేరు. రోజువారీ యుద్ధాలు చేయలేరు. పౌర సమాజం బలహీనపడిపోయింది. రాష్ట్రానికి రాజకీయ పార్టీలతో పాటు, బలమైన పౌర సమాజం కావాలి. జనసేన అధికారంలోకి వచ్చినా, మావాళ్లు తప్పు చేసినా నిలదీసేంత బలమైన పౌర సమాజం ఉండాలి.


దోచుకునే బ్యాచ్‌ అనే..

వ్యక్తుల ఆలోచనా విధానమే వారు నడిపే రాజకీయ పార్టీలపైనా పడుతుంది. వాళ్లు చేసే పనుల్లోనూ ప్రతిబింబిస్తుంది. రాజకీయ ప్రక్రియలో అసలు అవినీతే ఉండదని నేను చెప్పను. 1970ల్లో మాదిరిగా ప్రస్తుత రాజకీయాల్లో అందరూ రామ్‌మనోహర్‌ లోహియాలు, జయప్రకాశ్‌ నారాయణ్‌లు ఉండరనీ తెలుసు. కానీ రాజకీయల్లో ఉన్నవారికి ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత గౌరవం ఉండాలి. భయం ఉండాలి. ప్రజలంటే భయంగానీ, ప్రజాస్వామ్య విలువలంటే ఏమాత్రం గౌరవంగానీ లేనివాళ్లు వైకాపా నాయకులు. వాళ్ల గూండాగిరీని ప్రత్యక్షంగా చూశాను. వాళ్లు అత్యాశతో ఉన్నారనిపించింది. ఎన్ని అక్రమాలు చేసైనా అధికారంలో ఉండాలన్నదే వాళ్ల లక్ష్యం. అందుకే 2014 నుంచి ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. 2019లో వైకాపా వాళ్లు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టి అధికారంలోకి వచ్చారు. దానికి రెండు వందల రెట్లు సంపాదిస్తామని, రాష్ట్రాన్ని బాధ్యతారహితంగా దోచుకుంటామని అంటున్నారు. దానిపైనే నా వ్యతిరేకత. రాష్ట్ర విభజనతో తెలంగాణ నుంచి మనల్ని తోసేశారు. మిగిలిన వనరుల్ని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని బాధ్యతగా కాపాడుకోగల వ్యక్తుల సమూహం మన రాష్ట్రానికి కావాలి. తెలంగాణలో అలాంటి సమూహం బలంగా ఉంది. ఏపీలో లేదు. రాష్ట్రం పట్ల నాకున్న తపనతో పార్టీ పెట్టాను. అప్పట్లో సమయం తక్కువ ఉండి నరేంద్ర మోదీ సారథ్యంలోని భాజపాకి మద్దతిచ్చాను. వైకాపా నాయకులు హద్దూపద్దూలేని ద్వేషంతో ఉంటారని, రాష్ట్రాన్ని దోచుకుంటారన్న ఉద్దేశంతోనే 2014లో ఆ నిర్ణయం తీసుకున్నాను. అప్పట్లో వైకాపాని కొంత నిలువరించగలిగాం. 2019లో అధికారంలోకి వచ్చాక... అంతకుముందు దోచుకోలేకపోయిన దానికి రెట్టింపు ఇప్పుడు దోచేస్తున్నారు.


మనోడైతే సరిపోదు... సరైనోడు కావాలి

అవినీతి తప్పులేదన్న స్థాయికి ప్రజలు వెళ్లిపోతే సమాజం కుళ్లిపోయినట్టే! పాలకుడు మనోడైతే సరిపోదు. సరైనోడు అయి ఉండాలి. మన కులం వాడని భుజానికెత్తుకుంటే... పాముకి పాలు పోసినట్టే. పాము ముందు పక్క వాటిని తినేస్తుంది. ఆ తర్వాత సొంత గుడ్లనూ తినేస్తుంది. మొత్తం ఒక కులమంతా కలసి మనవాడని జగన్‌ను గెలిపించింది. ఇప్పుడేమైంది? దళితులకు మేనమామనని చెబుతూ... వారి పథకాలు 18 తీసేశాడు. తలలు నిమిరి, ముద్దులుపెట్టి... మేనమామ, అక్కచెల్లెళ్లు, బావ అంటే సరిపోదు. చెప్పినవన్నీ ఆచరణలోకి రానప్పుడు ఏం ఉపయోగం? మన కులం వాడని నెత్తిన ఎక్కించుకుంటే... సొంత బాబాయిని చంపినా దిక్కులేదు. అయినా అతన్నే వెనకేసుకు వస్తుంటే ఇక కులం ఎక్కడుంది? కుటుంబం ఎక్కడుంది? దీన్ని అందరూ గ్రహించాలి. మన కులం వాడంటూ వాళ్లు ఓట్లు వేశారు. దాన్ని అవకాశంగా తీసుకుని మరికొందరు సపోర్టు చేశారు. భయపడో, అవకాశవాదంతోనో, ఇష్టపడో ఏదైతేనేం ఆ పార్టీకి 151 సీట్లు ఇచ్చారు. పాము అధికారంలోకి రాగానే పక్కవాళ్లందర్నీ తినేసి, ఆ తర్వాత సొంత గుడ్లనూ తినేసింది!       


 మార్పు మొదలైంది

ఇంతకాలం ఈ వర్గాలన్నీ వారి సమస్యలు వినేవారు లేకే రాజకీయ ప్రక్రియకు దూరమయ్యారు. నేను నిర్వహిస్తున్న సమావేశాలకు గృహిణులు పెద్ద సంఖ్యలో వస్తున్నారంటేనే మార్పు మొదలైందన్న బలమైన నమ్మకం కలుగుతోంది. ఒక వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన పెద్దాయన నాకు చాలా పుస్తకాలు తెచ్చిచ్చారు. ఇదివరకు నా ప్రవర్తన చాలా దూకుడుగా ఉండేదని, అది ఆయనకు నచ్చేది కాదని చెప్పారు. నేను ఉత్పత్తి కులాల గురించి మాట్లాడటం, సాధికారత కల్పిస్తానని చెప్పడం బాగా నచ్చిందని, స్వయంగా కలసి పుస్తకాలు ఇవ్వాలనుకున్నానని చెప్పారు. వివిధ వర్గాలతో కలసినప్పుడు వారి సమస్యలు నాతో పంచుకుంటున్నారు. రూ.10 లక్షల పెట్టుబడితో చిన్న పరిశ్రమ పెట్టాలనుకున్న వ్యక్తి... భూమి కొనడం నుంచి, అనుమతులు పొందడం వరకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడో చెప్పారు. నువ్వు ఇప్పటికిప్పుడు ఆ సమస్య పరిష్కరిస్తావని కాదుగానీ, నువ్వు వింటావని, నీకు అర్థమవుతుందని చెబుతున్నానని అన్నారు. జయలక్ష్మి కోఆపరేటివ్‌ బ్యాంక్‌ బాధితులు కలిశారు. ‘ప్రభుత్వ ఖజానా నుంచి తమకు నష్టపరిహారం ఇవ్వాలని అడగడం లేదుగానీ, నీకు చెబితే పరిష్కార మార్గాలు వెతగ్గలవ’ని వచ్చామన్నారు. రేపు జనసేన ప్రభుత్వంలోకి వస్తే మా సమస్యకు పరిష్కారం చూపుతావని వచ్చామని చెప్పారు. నంబర్‌ప్లేట్‌లేని బైక్‌పై వచ్చి ఆకతాయిలు చేస్తున్న ఆగడాలు, డంపింగ్‌యార్డు సమస్యతో బాధపడుతున్నవారు....ఇలా చాలా మంది తమ సమస్యలు చెప్పారు.


యథేచ్ఛగా లూటీ.. విచ్చలవిడిగా అప్పులు!

పనిచేసి, సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందిపోయి... వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీగా అప్పుల్లో ముంచేసి, ఆ డబ్బుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతోంది. వైకాపా ప్రభుత్వం సంపద సృష్టించే విధానాన్ని చంపేసింది. దోచుకున్న సంపదంతా ముగ్గురు నలుగురి దగ్గరే ఉంది. పారిశ్రామికవేత్తల్ని భయపెట్టి తరిమేశారు. ఇసుక సహా ప్రకృతి వనరులన్నీ లూటీ చేసేస్తున్నారు. ఇదివరకు రూ.14 వేలకు వచ్చే లారీ ఇసుక వైకాపా అధికారంలోకి వచ్చాక... రూ.40 వేల నుంచి రూ.60 వేలకు వెళ్లిందని క్రెడాయ్‌ ప్రతినిధులు వాపోయారు. ధరలు పెంచేయడమే కాకుండా, ఇసుక యార్డుల్లో నిల్వచేసి, డిమాండ్‌ ఎక్కువగా ఉన్న సమయంలో బ్లాక్‌ చేస్తున్నారు. ధరలు పెంచేస్తున్నారు. జేసీబీలు, ప్రొక్లెయిన్‌లు పెట్టి నదీ గర్భాన్ని తోడేస్తున్నారు. విదేశాల్లో డ్రగ్స్‌ ముఠాల గురించి వినేవాళ్లం. అలాంటి ముఠాలు మన దగ్గర తయారయ్యాయి. అవినీతికి రాజద్వారాలు తెరిచేశారు. రూ.వేల కోట్లలో జరిగే రాజకీయ అవినీతిని ఆపకుండా, ఏసీబీని ప్రభుత్వ ఉద్యోగులపై మాత్రమే ప్రయోగిస్తే ఏం ప్రయోజనం? రూ.200 తీసుకునే ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కి... రూ.200 కోట్లు దోచుకునే రాజకీయ నాయకుడికి మధ్య తేడా ఉంది కదా? రూ.వేల కోట్ల దోపిడీ చేసేవాళ్లే ఏసీబీని నియంత్రించడం విషాదం.


ఎవరూ వెళ్లిపోకూడదు..

ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకమైన వారు ఎవ్వరూ వ్యాపారం చేయకూడదు అనే పరిస్థితి ఉంది. పారిశ్రామికవేత్తలయినా, ఎవరైనా రాష్ట్రం వదిలి వెళ్లిపోకూడదు- అందరూ ఏకమై పోరాడాలి. ప్రతిఘటించాలి. ఎంపీ అయిన పారిశ్రామికవేత్త కూడా ప్రతిఘటించవలసింది. అలాంటి వ్యక్తుల సమూహం ఉంటే తప్ప ఏపీ బాగుపడదు. మనం వదిలివెళ్లిపోతే పోరాడ లేరనే సంకేతాలు వెళ్తాయి. ముందు మన హక్కును మనం కాపాడుకోవాలి కదా! నేనూ సినిమాలు చేస్తున్నాను. వాళ్లకి రూ.వెయ్యి కోట్లు పోతే నాకు రూ.30 కోట్లో, రూ.40 కోట్లో పోతుంది. అదే తోపుడుబండి తోసుకునే వ్యక్తి అయితే రోజుకు రూ.500 పోతుంది. అందుకే అందరమూ నిలబడాలి. అమరరాజా బ్యాటరీస్‌ వారో, మరో బిల్డరో ఇక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ ఇక్కడున్న సామాన్యుడు ఎక్కడికీ వెళ్లలేడు. కాబట్టి నష్టపోతాడు. అందుకే పారిశ్రామికవేత్తలంతా ఏకతాటిపైకి రావాలి. వెళ్లిపోవడం సరికాదు. పోరాడాలి. ఎవరైనా రిస్కు తీసుకోవాలి. అది చేయకుండా ఏదీ సాధ్యం కాదు. భీమ్లానాయక్‌, వకీల్‌సాబ్‌ సినిమాల సమయంలో టిక్కెట్ల ధరలు తగ్గించారు. ఆ సినిమాలు రెండూ పెద్ద హిట్‌. టిక్కెట్‌ ధర రూ.10 పెడితే ఎప్పటికి పెట్టుబడి వస్తుంది? ఆంధ్రప్రదేశ్‌ వరకు నిర్మాతలకు నష్టం వచ్చింది. ఆ భారం నేనే స్వయంగా రూ.30 కోట్లు భరించాను. నా నిర్మాతలు నష్టపోవడం అంటే నేను కూడా నష్టపోయినట్లే!


ద్రోహాన్ని వివరించటానికే వారాహి యాత్ర

వైకాపా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, దోపిడీపై ప్రజల్లో అవగాహన కల్పించడం వారాహి యాత్ర ముఖ్యోద్దేశం. కులం మత్తులో పడిపోయో, మావాళ్లు అనుకునో అసమర్థుల్ని, దోపిడీదారుల్ని అందలం ఎక్కిస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ ఆధునిక, డిజిటల్‌ యుగంలో ప్రజల్లో భావోద్వేగాలు ఎక్కువకాలం ఉండటం లేదు. ప్రభుత్వం అరాచకానికి పాల్పడితే ఈ రోజు కోపం వస్తోంది. మర్నాటికి అది చల్లబడిపోతోంది. వైకాపా అధికారంలోకి రావడం వల్ల ఒకవిధంగా మంచే జరిగిందని ఒక్కోసారి నాకనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్లు ఎలాంటి ద్రోహం చేస్తారో ప్రతి ఒక్కరికీ అనుభవపూర్వకంగా తెలిసింది. కర్కోటకులు, దుర్మార్గులు, దోపిడీదారులు ఎలా ఉంటారో ప్రజలకు అర్థం అవుతోంది. తోడేలు గొర్రె తోలు కప్పుకొని తిరుగుతుంటే మనం నమ్ముతాం. దాని చర్యల ద్వారానే అసలు రూపం తెలుస్తుంది. ఒకరికి అధికారం ఇచ్చి చూస్తేనే వ్యక్తిత్వం బయటపడుతుంది. అలాగే వైకాపాకి ప్రజలు అధికారం ఇచ్చారు. దాని ప్రతిఫలం ఏంటో ఇప్పుడు చూస్తున్నారు. గతంలో దాతలు విరాళాలు ఇచ్చి ఏర్పాటు చేసిన ఎయిడెడ్‌ కాలేజీల స్థలాల్ని ఈ ప్రభుత్వం లాగేసుకుంది. ఈ నాలుగేళ్లలో వైకాపా ఏం చేసిందనడానికి ఇవన్నీ నిదర్శనాలే.


  • నేను రూ.5 కోట్లు సంపాదించాలంటే... ఎంతో కష్టపడి ఒక సినిమా చేసి 600 మందికి ఉపాధి కల్పిస్తా. ప్రభుత్వానికి పన్నులు కడతా! వైకాపా నాయకులు ఏమీ చేయకుండానే ఇంట్లో కూర్చుని, అందర్నీ భయపెట్టి ఒక కాంట్రాక్ట్‌ ఇప్పిస్తే రూ.30 కోట్లు వచ్చేస్తాయి.

  • రాష్ట్రంలో అరాచకాన్ని ఎదుర్కోవడానికి మొదట నాలాంటి వాడు బయటకు వస్తాడు. ఆ తర్వాత మిగిలిన వారూ వస్తారు. అదే క్షేత్రధర్మం. తిరగబడటమే ఆ ధర్మం. ప్రజలు మెత్తబడిపోవడం వల్లే అరాచకం పెరిగిపోయింది.

  • పౌర సమాజం బలహీనపడిపోయింది. రాష్ట్రానికి రాజకీయ పార్టీలతో పాటు, బలమైన పౌర సమాజం కావాలి. భవిష్యత్తులో జనసేన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, మావాళ్లు తప్పు చేసినా నిలదీసేంత బలమైన పౌరసమాజం ఉండాలి.

  • జయలక్ష్మి బ్యాంకులాగే రాష్ట్ర ప్రజలు తమ మొత్తం కష్టార్జితాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమనే బ్యాంకులో పెట్టారు. జగన్‌ రూపంలో పాలకులు దాన్ని సొంత డబ్బులా వాడేస్తున్నారు.

  • ప్రజలంటే భయంగానీ, ప్రజాస్వామ్య విలువలంటే ఏమాత్రం గౌరవంగానీ లేనివాళ్లు వైకాపా నాయకులు. వాళ్ల గూండాగిరీని ప్రత్యక్షంగా చూశాను. వాళ్లు అత్యాశతో ఉన్నారనిపించింది. ఎన్ని అక్రమాలు చేసైనా... అధికారంలోకి రావాలన్నదే వాళ్ల లక్ష్యం. అందుకే 2014 నుంచి ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.

  • రూ.వేల కోట్లలో జరిగే రాజకీయ అవినీతిని ఆపకుండా, ఏసీబీని ప్రభుత్వ ఉద్యోగులపై మాత్రమే ప్రయోగిస్తే ఏం ప్రయోజనం. రూ.200 తీసుకునే ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కి... రూ.200 కోట్లు దోచుకునే రాజకీయ నాయకుడికి మధ్య తేడా ఉంది కదా? రూ.వేల కోట్ల దోపిడీ చేసేవాళ్లే ఏసీబీని నియంత్రించడం విషాదం.

పూర్తిస్థాయి రాజకీయాల వైపు..

సినిమాలు చేస్తున్నది పార్టీ కోసమే. నేను నా కోసం, పార్టీ కోసం, సమాజం కోసం కట్టుబడి ఉన్నానని అర్థం చేసుకోవాలి. పూర్తిగా వ్యవస్థీకృతమైన పార్టీలను దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు ఎప్పుడు అవుతారు అని నన్ను అడగకూడదు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిని అవ్వాలంటే కొంత సమయం పడుతుంది. పదేళ్లుగా ఎంతో ఎదుగుతూ వచ్చాం. అదే క్రమంలో ఉన్నాం. జనసేన పార్టీ కార్యకర్తలు పవన్‌కల్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఏ పార్టీలోనైనా తమ నాయకుడిని ఆ స్థానంలో చూడాలనుకోవటం సహజం. అందుకే నేను సీఎంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జనసేన కార్యకర్తలకు చెప్పాను.


వైకాపా ఓట్లు 14-18% తగ్గుతాయి

మెజారిటీ ప్రజలు ఇప్పుడు మేలుకున్నారు. సమాజంలో 30 శాతం ప్రజలు ఎప్పుడూ వాస్తవాల్ని గ్రహించరు. ఒకవేళ గ్రహించినా వివిధ పరిస్థితుల వల్ల వాళ్ల నిర్ణయం మార్చుకోరు. ఇదివరకు వాళ్లను చూసి ఓట్లు వేసిన మిగతా వారిలో కచ్చితంగా మార్పు వస్తుంది. వారిలో 10-14 శాతం మంది కచ్చితంగా మారతారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓట్లు 14 నుంచి 18 శాతం తగ్గుతాయి. వైకాపా ఓట్ల శాతం 38-39కి పడిపోతుంది. జనసేనకు ఓట్ల శాతం పెరిగిందంటే మిగతా పార్టీల్లో ఏదో ఒకదానికి తగ్గాలి కదా? ప్రధానంగా అధికార పార్టీకే తగ్గుతుంది.


మధ్యతరగతి వర్గాలు దగ్గరవుతున్నాయి..!

1970, 80ల నుంచి మధ్యతరగతి మేధావులు రాజకీయ ప్రక్రియకు దూరమయ్యారు. ప్రభుత్వాలపై వారికున్న కోపాన్ని, అసంతృప్తిని... ఇప్పుడు నోటాకి ఓట్లు వేయడం ద్వారా ప్రదర్శిస్తున్నారు. 3-4 శాతం మంది నోటాకి ఓట్లు వేస్తున్నారు. అలాంటివారందరినీ ఈ యాత్రలో కలుస్తున్నాను. చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు, మహిళలు, గృహిణులు, సమాజంలోని వివిధ వర్గాల వారితో సమావేశమవుతున్నాను. వారితో బృంద చర్చలు నిర్వహిస్తూ... అధికార పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకుల అవినీతి, అక్రమాల గురించి నేరుగా తెలుసుకుంటున్నాను. పిఠాపురంలో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయంతో చెరువుల్లో 40 నుంచి 60 అడుగుల లోతున మట్టి తవ్వేయడాన్ని ఆధారాలతో సహా నాకు చూపించారు. వాటిపై మినీ పోలవరం ప్రాజెక్టులు కట్టొచ్చు. అంత లోతుగా తవ్వేశారు. వాటిలోని నీళ్లు రైతుల పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. రెవెన్యూవాళ్లు, పోలీసులు, ఇతర వ్యవస్థలు ఏమాత్రం దాన్ని పట్టించుకోవడం లేదు. ఆ అక్రమాల్లో స్వయంగా భాగస్వామి కాబట్టి స్థానిక ఎమ్మెల్యేకి అసలే పట్టదు.


వచ్చే ఎన్నికలపై స్పష్టతతో ఉన్నాను

వచ్చే ఎన్నికలకు మా పార్టీ అన్ని విధాలా సంసిద్ధంగా ఉంది. చాలా నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తున్నాం. ఆకాశంలో విహరించడం నా తత్వం కాదు. నా కాళ్లెప్పుడూ నేలపైనే ఉంటాయి. రాజకీయాల్లో అవగాహన పెంచుకుంటూ వచ్చాను. నా బలాలు, బలహీనతలపై చాలా స్పష్టత ఉంది. గత పదేళ్లుగా నాతో ఉన్నవారికి క్షేత్రస్థాయి అనుభవం వచ్చింది. మాకు ఎంత శాతం ఓటింగ్‌ ఉంది? ఏ ప్రాంతంలో పెరుగుతుందన్న విషయంలో ప్రాక్టికల్‌గా నాకొక అవగాహన ఉంది.


ఆ 20 శాతం ఓటర్లూ పోలింగ్‌కు వస్తారు..

ఎన్నికల ప్రక్రియలో పాల్గొనని 20 శాతం ఓటర్లంతా ఈ వర్గాలకు చెందినవారే. వారిని అనుసంధానం చేసే బాధ్యత మొదట నేను తీసుకున్నాను. మత్స్యకారులు, దళిత సంఘాలు, మైనారిటీల దగ్గరకు ఎలా వెళుతున్నామో, అలాగే వీరి దగ్గరకూ రాజకీయ పార్టీలు రావాలి. ఎందుకు ఓటు వేయాలో వారికి వివరించాలి. నేను చేస్తోంది అదే. వారు ప్రభావవంతమైన ప్రజలు కాబట్టే ఓటు అడుగుతున్నామని చెబుతున్నాను.

ఫొటోలు: బి.మరిడయ్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని