మేడిగడ్డపై సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదు?: కిషన్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్‌, భారాసలు నాటకాలు ఆడుతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం మేడిగడ్డకు వెళితే, మాజీ సీఎం కేసీఆర్‌ కృష్ణా జలాల వివాదంపై నల్గొండలో సభ పెట్టారని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు.

Updated : 14 Feb 2024 09:26 IST

ఎన్నికల్లో లబ్ధికే కాంగ్రెస్‌, భారాసల నాటకాలంటూ విమర్శ

ఈనాడు-వరంగల్‌, సుబేదారి-న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్‌, భారాసలు నాటకాలు ఆడుతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం మేడిగడ్డకు వెళితే, మాజీ సీఎం కేసీఆర్‌ కృష్ణా జలాల వివాదంపై నల్గొండలో సభ పెట్టారని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా దేశానికి మోదీనే ప్రధానిగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, ఈసారి రాష్ట్రంలో మెజారిటీ లోక్‌సభ స్థానాలు భాజపాకు దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం హనుమకొండలో ‘వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ’ ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మేడిగడ్డ  దెబ్బతిన్నట్టు గతేడాది అక్టోబరు 21న తెలిసిన మర్నాడే నేను భాజపా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశాను. దానికి స్పందించి నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు, నిపుణులను కాళేశ్వరం పంపారు. ఆ తర్వాతే రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు మేడిగడ్డను సందర్శించి సీబీఐ దర్యాప్తు చేయాలని లేఖలు రాశారు. దానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ బదులిస్తూ.. సీబీఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్సే అధికారంలో ఉన్నప్పటికీ సీబీఐ దర్యాప్తు కోరకుండా విజిలెన్స్‌ పేరిట కాలయాపన చేస్తోంది.

డ్యాం సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం ఎత్తిపోతలపై అనేక వివరాలు కోరగా.. అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం కొన్నే అందజేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పూర్తి వివరాలు అందించడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి సీబీఐ దర్యాప్తు కోరకుండా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి కొత్తగా ఏం చెబుతారు..? సాగునీటి ప్రాజెక్టుల నాణ్యత నిగ్గుతేల్చే నైపుణ్యత విజిలెన్స్‌కు ఉండదు. ఏపీ పోలీసులు నాగార్జునసాగర్‌పై ముళ్ల కంచెలు వేసి నీటిని తరలిస్తుంటే నాడు సీఎం హోదాలో ఉండి కూడా వివాదాలు పరిష్కరించని కేసీఆర్‌.. ఇప్పుడు నల్గొండకు వెళ్లి సమావేశాలు పెట్టడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 2 నెలలైనా కృష్ణా జలాల వివాదంపై తన వైఖరేంటో చెప్పకుండా కేంద్రంపై నిందలు వేయడం సమంజసం కాదు. 2014 విభజన చట్టం ప్రకారం ట్రైబ్యునల్‌ సమక్షంలోనే కృష్ణా జల వివాదం పరిష్కారం కావాలి’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం వేయి స్తంభాల ఆలయంలో కల్యాణ మండపం నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరలో మండపం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహిస్తామన్నారు. భాజపా నేతలు కొండేటి శ్రీధర్‌, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, గంట రవికుమార్‌, రావు పద్మ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని