ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి

‘ఓటేసే ముందు కుటుంబంతో కూర్చుని ఒకటికి పదిసార్లు ఆలోచించండి.  ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి.

Published : 20 Apr 2024 04:41 IST

వైకాపాను గెలిపిస్తే పథకాలు... లేదంటే రద్దే
కాకినాడ ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్‌

ఈనాడు-కాకినాడ, రాజమహేంద్రవరం: ‘ఓటేసే ముందు కుటుంబంతో కూర్చుని ఒకటికి పదిసార్లు ఆలోచించండి.  ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు కావు. వచ్చే అయిదేళ్ల్లు మీ జీవితాలు, మీ తలరాతల్ని మార్చేవని గుర్తుపెట్టుకోండి’.. అని సీఎం జగన్‌ అన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో మేమంతా సిద్ధం బహిరంగసభలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. ‘‘వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా, పేదల భవిష్యత్తు మారాలన్నా, పథకాలు కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన ఉండాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, ఆసుపత్రులు మెరుగుపడాలన్నా.. ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుపై రెండు బటన్లు నొక్కి గెలిపించాలి. 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు.. 25కి 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీల్లేదు. మీరు సిద్ధమేనా? జరగబోతున్నది కురుక్షేత్ర యుద్ధం.. మీరు సిద్ధమేనా?’’ అని జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబుకు, ఆయన కూటమికి తన మీద వేయడానికి, వేయించడానికి గులకరాళ్లే మిగిలాయని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు జీహుజూర్‌

‘‘వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదిది.. మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషుల్ని పంపితే ఏర్పడిన కూటమి. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఎవరు పోటీచేయాలో.. చివరికి ఆయనకు ఎక్కడ టికెట్‌ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. దత్తపుత్రా నీకు ఇచ్చేది 80 కాదు.. 20 అంటే దానికీ జీహుజూర్‌.. ఇదీ ఆయన పరిస్థితి’’ అని పవన్‌ కల్యాణ్‌ను ఎద్దేవా చేశారు. ఆయనకు మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే.. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్‌ వెళ్లిపోతారన్నారు. పోటీ చేసే ప్రాంతంపై ప్రేమ ఉండదని, ఈయనకు నియోజకవర్గాలూ ఎక్కువేనని ఎద్దేవా చేశారు.

బాబు కోవర్టు ఈ వదినమ్మ

‘బాబు చేరమని చెబితే ఈ వదినమ్మ కాంగ్రెస్‌లో చేరారు. భాజపాకు ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ ఇవ్వగానే అక్కడ చేరారు. 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవర్టుగానే ఉన్నారు. ఆయన ఎవరికి టికెట్లు ఇవ్వాలంటే వాళ్లకే ఇస్తారు. బీఫాం భాజపాదైనా, కాంగ్రెస్‌దైనా, టీగ్లాస్‌దైనా.. యూనిఫాం మాత్రం చంద్రబాబుదే’ అని సీఎం జగన్‌ విమర్శించారు.

హామీలు చంద్రబాబు నెరవేర్చారా?

ఇదే కూటమి గతంలో మేనిఫెస్టో ఇంటింటికీ పంపారని, ఒక్కటైనా నెరవేర్చారా అని జగన్‌ ప్రశ్నించారు. ‘ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నారు నిర్మించారా? ప్రత్యేక హోదా తెచ్చారా?’ అని ప్రశ్నించారు. ‘ఇదే చంద్రబాబు కూటమి, మళ్లీ ఈ ముగ్గురూ కలిసి సూపర్‌ 6, 7 అంట.. ఇంటింటికీ కేజీ బంగారం అంట.. బెంజి కారంట నమ్ముతారా..?’ అని జగన్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని