తెలంగాణ చరితకు అద్దం

తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భాజపా ఏర్పాటు చేసిన ప్రదర్శన కళ్లకు కట్టింది. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలు, సాయుధ పోరాటం, తెలంగాణ విమోచనతోపాటు.. రాష్ట్ర ఆవిర్భావం

Published : 02 Jul 2022 06:15 IST

భాజపా ప్రదర్శనను ఆసక్తిగా తిలకించిన నాయకులు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే-మాదాపూర్‌: తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భాజపా ఏర్పాటు చేసిన ప్రదర్శన కళ్లకు కట్టింది. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలు, సాయుధ పోరాటం, తెలంగాణ విమోచనతోపాటు.. రాష్ట్ర ఆవిర్భావం వరకూ ప్రతి ఘట్టాన్ని ఆవిష్కరించింది. భాజపా పాలనలో ముఖ్యఘట్టాలూ ఇందులో చోటుచేసుకున్నాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని హెచ్‌ఐసీసీలో ‘గొల్లకొండ ప్రదర్శన’ పేరుతో ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది. బతుకమ్మలు, చేనేత వస్త్రాలు, తెలంగాణ పంటలు, పిండివంటలను కొలువుదీర్చారు. ఉద్యమంలో భాజపా పాత్ర, పార్లమెంటులో బిల్లు ఆమోద సమయంలో పరిణామాల చిత్రాలను ప్రదర్శనలో ఉంచినట్టు.. ఈ కార్యక్రమ పర్యవేక్షకుడు విఠల్‌ చెప్పారు.

హైదరాబాద్‌ రాష్ట్ర పూర్వ స్వరూపం సహా చారిత్రక విశేషాలను ప్రదర్శనలో ఉంచారు. సమావేశాలకు వచ్చిన అతిథులకు తెలంగాణ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. గుస్సాడి, థింసా, లంబాడీ నృత్య ప్రదర్శనలు అలరించాయి.  నోవాటెల్‌ హోటల్‌లో బస చేసిన అతిథులకు సాదర స్వాగతం లభించింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ మేయర్‌ బండ కార్తీక వారికి గులాబీ పువ్వును అందజేసి.. ముత్యాలహారం మెడలో వేసి స్వాగతం పలికారు. మేళతాళాలతో ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని