AP CID: చిత్రహింసలు పెట్టారు: దారపనేని నరేంద్ర

‘సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో నన్ను నిర్బంధించిన గదిలోకి అర్ధరాత్రి తర్వాత మఫ్టీలో ఉన్న అయిదుగురు వచ్చారు.

Updated : 14 Oct 2022 06:55 IST

అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ సీఐడీ వారు కొట్టారు

ఝండూబామ్‌ రాసి మరీ హింసించారు

గుంజీలు తీయించారు.. రెండు కాళ్లూ సాగదీసి కొట్టారు

న్యాయమూర్తి ఎదుట వాపోయిన తెదేపా మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్ర

జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయించి నివేదిక సమర్పించాలని సీఐడీని ఆదేశించిన న్యాయమూర్తి

ఆ తర్వాతే రిమాండు అంశం పరిశీలిస్తామని వెల్లడి

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే-గుంటూరు లీగల్‌, గుంటూరు నగరం: ‘సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో నన్ను నిర్బంధించిన గదిలోకి అర్ధరాత్రి తర్వాత మఫ్టీలో ఉన్న అయిదుగురు వచ్చారు. అప్పటి నుంచి తెల్లవారుజామున 5.30 వరకూ కొడుతూనే ఉన్నారు. దెబ్బలు బయటకు కనపడకుండా కొట్టారు. ఝండూబామ్‌ రాసి మరీ హింసించారు. గుంజీలు తీయించి, రెండు కాళ్లూ సాగదీసి థర్డ్‌డిగ్రీ ప్రయోగించారు. నరకం చూపిస్తామని హెచ్చరించారు’ అని తెదేపా మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రబాబు న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాదులు మీడియాకు వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయంలో ఇటీవల వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్‌కు సీఎంఓలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉందని వాట్సప్‌ గ్రూపులో పోస్టులు ఫార్వర్డ్‌ చేశారన్న ఆరోపణతో బుధవారం రాత్రి 8.30 సమయంలో సీఐడీ అధికారులు నరేంద్రను అరెస్టుచేశారు. అనంతరం ఆయన్ను గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు గుంటూరులోని సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం ప్రాంగణానికి తీసుకొచ్చారు. అప్పటికే కోర్టు సమయం ముగిసిపోవడంతో న్యాయమూర్తి ఇంటివద్ద హాజరుపరిచారు. సీఐడీ అధికారులు తనను తీవ్రంగా హింసించారని న్యాయమూర్తి కె.శృతవింద ఎదుట నరేంద్ర వాపోయారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న న్యాయమూర్తి... నరేంద్రకు జీజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయించి ఆ నివేదిక అందజేయాలని సీఐడీ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాతే రిమాండుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని వైద్యశాలకు తరలించి పరీక్షలు చేయించాలని నరేంద్ర తరఫు న్యాయవాదులు కోరగా, జీజీహెచ్‌ నుంచి నివేదిక అందాక అవసరమైన చర్యలు చేపడతామని న్యాయమూర్తి చెప్పారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య రాత్రి 10.30 సమయంలో నరేంద్రను సీఐడీ పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆయనకు పరీక్షలు నిర్వహించేందుకు జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థో, ఎనస్థీషియా విభాగాల వైద్యులతో అధికారులు కమిటీ ఏర్పాటుచేశారు. గురువారం రాత్రి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు.

రిమాండును తిరస్కరించాలి: న్యాయవాదులు 

నరేంద్రకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇవ్వలేదని ఆయన తరఫు న్యాయవాదులు కేఎం కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, డి.కోటేశ్వరరావు వాదించారు. ఇదే కేసులో ఇంతకుముందు అరెస్టయిన కొల్లు అంకబాబు రిమాండును కోర్టు తిరస్కరించి, దర్యాప్తు అధికారికి షోకాజ్‌ నోటీసు జారీచేసిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. నరేంద్ర రిమాండును తిరస్కరించాలని కోరారు. సీఎంఓను, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకే నరేంద్ర ‘అమరావతి’ పేరిట వాట్సప్‌ గ్రూపు ఏర్పాటుచేసి అందులో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, బాగా పలుకుబడి కలిగిన ఆయనకు రిమాండు విధించకపోతే కేసు దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని సీఐడీ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కళావతి వాదించారు.

సీఐడీ కార్యాలయం ఎదుట ఆందోళన 

తెదేపా నేతలు గురువారం ఉదయం సీఐడీ కార్యాలయం వద్దకు చేరుకుని నరేంద్రను విడుదల చేయాలంటూ ఆందోళన చేశారు. కార్యాలయాలకు వెళ్లేవారినీ అడ్డుకోవడంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. తెదేపా నాయకులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ 

నరేంద్రను సీఐడీ అధికారులు అరెస్టు చేయడంపై ఆయన భార్య సౌభాగ్యం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గురువారం లేఖ రాశారు. ‘12వ తేదీ రాత్రి ఏడుగురు గుర్తుతెలియని వ్యక్తులు నా భర్తను అక్రమంగా తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళుతున్నారని అడిగితే సీఐడీ పోలీసులమని చెప్పి చేత్తో రాసిన కాగితంపై సంతకం తీసుకున్నారు. కొందరు పోలీసు అధికారులు నా భర్తను కిడ్నాప్‌ చేశారు. నేను, నా పిల్లలు భయాందోళనలో ఉన్నాం. నా భర్త నేరమేంటో కూడా చెప్పకుండా.. ఇంట్లోకి చొరబడి 41ఏ నోటీసులు ఇవ్వాలన్న నిబంధనను పట్టించుకోకుండా ఎలా అరెస్టుచేస్తారు? దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా లాక్కెళ్లారు. అర్ధరాత్రి ఎవరి ఇంట్లోకైనా చొరబడే హక్కు పోలీసులకు ఉందా? నా భర్తకు ఏదైనా జరిగితే దానికి సీఐడీ పోలీసులే బాధ్యత వహించాలి. నా భర్తను కిడ్నాప్‌ చేసిన సీఐడీ పోలీసులపై కఠినచర్యలు తీసుకోవాలి’ అని లేఖలో విజ్ఞప్తి చేశారు.

సీఐడీ కార్యాలయంలో వైద్యపరీక్షలు 

గురువారం ఉదయం జీజీహెచ్‌ నుంచి సీఐడీ కార్యాలయానికి వెళ్లిన ఇద్దరు వైద్యులు నరేంద్రకు వైద్యపరీక్షలు నిర్వహించారు. సాయంత్రం 4గంటల సమయంలో నరేంద్రను జీజీహెచ్‌కు తరలించి వైద్యపరీక్షలు చేయించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నారు.

చిత్రహింసలు పెట్టారు: న్యాయవాదులు 

సీఐడీ పోలీసులు నరేంద్రను దెబ్బలు కనపడకుండా చిత్రహింసలు పెట్టారని తెదేపా లీగల్‌సెల్‌ న్యాయవాది కోటేశ్వరరావు అరోపించారు. నరేంద్రపై తొలుత మూడు సెక్షన్లు పెట్టిన సీఐడీ పోలీసులు అదనంగా మరో సెక్షన్‌ పెట్టి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారన్నారు.  న్యాయవాది హరిబాబు మాట్లాడుతూ సీఐడీ పోలీసులు ఇలా చేయడంపై న్యాయపరంగా ముందుకు వెళతామన్నారు.

సీఐడీ ఎప్పుడూ కొట్టదు 

‘చట్టప్రకారమే నిందితుల్ని సీఐడీ అరెస్టు చేస్తుంది. అయితే వారు ప్రతి సందర్భంలోనూ సీఐడీ అధికారులు తమను కొట్టారని లేనిపోని అభాండాలు వేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు’ అని ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పేర్కొంది. సీఐడీ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.


సునీల్‌కుమార్‌ను విధుల్లోంచి తొలగించాలి: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఐడీని జగన్‌ జేబుసంస్థగా మార్చిన సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ను వెంటనే విధుల్లోంచి తొలగించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండు చేశారు. నరేంద్రపై సీఐడీ ప్రకటన అబద్ధాల పుట్టని గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘సామాజిక మాధ్యమాల్లో పోస్టును ఫార్వర్డ్‌ చేస్తే అర్ధరాత్రి అరెస్టుచేయడం అన్యాయం. ఇదే కేసులో సీనియర్‌ పాత్రికేయుడు అంకబాబు అరెస్టు అక్రమమని కోర్టు చెప్పినా.. ఇప్పుడు నరేంద్రను అలాగే అరెస్టు చేశారు. అసలు 41ఏ నోటీసు ఎందుకు ఇవ్వలేదు? కస్టడీలో నరేంద్రను హింసించిన పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


భర్తను కిడ్నాప్‌ చేశారని నరేంద్ర భార్య ఫిర్యాదు

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే: సీఐడీ పోలీసులమంటూ తన భర్తను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని నరేంద్ర భార్య సౌభాగ్యం గుంటూరు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదుచేశారు. మాజీమంత్రి దేవినేని ఉమా, తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, ఇతర నేతలతో కలిసి సౌభాగ్యం, ఆమె కుమారుడు విష్ణు బుధవారం అర్ధరాత్రి దాటాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేంద్ర ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని