మంత్రి కాకాణిని బర్తరఫ్‌ చేయాలి

నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ వ్యవహారంలో వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు తేలిపోయిందని, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి డిమాండు చేశారు.

Published : 28 Nov 2022 03:32 IST

బెయిల్‌ రద్దు చేసి వెంటనే అరెస్టు చేయాలి
తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజం

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ వ్యవహారంలో వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు తేలిపోయిందని, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి డిమాండు చేశారు. ఆయన బెయిలును రద్దు చేసి, అరెస్టు చేయాలని కోరారు. ఈ కేసు నుంచి ఆయనను కాపాడేందుకు ఎస్పీ విజయరావు, కొంత మంది స్థానిక పోలీసులు కోర్టులో చోరీ ఘటన దర్యాప్తును తప్పుదారి పట్టించారని చెప్పారు. హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే జిల్లా పోలీసు అధికారులు సీబీఐకి సహకరిస్తారన్న నమ్మకం తమకు లేదని అభిప్రాయపడ్డారు. ఎస్పీ విజయరావును బదిలీ చేయాలని డిమాండు చేశారు. నెల్లూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

కోర్టునే తప్పుదారి పట్టించారు..

హైకోర్టుకు నెల్లూరు పీడీజే ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా ఎస్పీ, స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఒక జిల్లా న్యాయమూర్తే.. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరిగ్గా లేదంటూ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు కోరాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు అవమానం ఏముంటుందని ప్రశ్నించారు.

ఆ ల్యాప్‌టాప్‌లు వెనక్కి ఇచ్చేశారా?

‘కోర్టులో చోరీ అయ్యాయని పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో సమాచారం ఏమీ లేదని, సెల్‌ఫోన్లు పని చేయట్లేదని నెల్లూరు పోలీసులే తేల్చేశారు. అవి పోలీసు స్టేషన్‌లోనే ఉన్నాయా? కాకాణి వెనక్కి ఇచ్చేశారా? లేకపోతే స్టేషన్‌లో ల్యాప్‌ట్యాప్‌లు కోర్టులో ఉన్నట్లు చూపించి... అక్కడ అవే చోరీ అయ్యాయని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? కోర్టులో చోరీ జరిగితే.. పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ను ఎందుకు పంపించలేదు? వేలిముద్రలు, పాదముద్రలు ఎందుకు తీయలేదు? కాకాణి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే చోరీ జరగటం ఏంటి? అత్యంత భద్రత ఉండే కోర్టు గదిలో 8 అల్మారాలుంటే.. ఒక్క అల్మారాలో, అదీ ఆ సంచినే తీసుకెళ్లడమేంటి? ఇవన్నీ సీబీఐ దర్యాప్తులో తేలుతాయి’ అని వెంకటరమణారెడ్డి చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు