అంతా తానై... ఒంటిచేత్తో గుజరాత్ బాధ్యత ఎత్తుకున్న మోదీ
అసెంబ్లీ ఎన్నికలంటే ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్రస్థాయి నేతలు ప్రధానం! భాజపా, కాంగ్రెస్‌లాంటి పార్టీల తరఫునైతే జాతీయ స్థాయి ముఖ్యనేతలు ఒకట్రెండు ప్రచార సభల్లో పాల్గొని వెళతారు.
అసెంబ్లీ ఎన్నికలంటే ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్రస్థాయి నేతలు ప్రధానం! భాజపా, కాంగ్రెస్‌లాంటి పార్టీల తరఫునైతే జాతీయ స్థాయి ముఖ్యనేతలు ఒకట్రెండు ప్రచార సభల్లో పాల్గొని వెళతారు. కానీ గుజరాత్ ఎన్నికల ప్రచారం ఇందుకు పూర్తి భిన్నంగా సాగింది! ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అంతా తానై కలియదిరిగారు. ఎంతగా అంటే తానే ముఖ్యమంత్రి అభ్యర్థా అన్నంతగా!
స్వరాష్ట్రంలో భాజపా అధికారాన్ని భారీ మెజార్టీతో నిలబెట్టే బాధ్యతను ప్రధాని నరేంద్రమోదీ ఒంటిచేత్తో తీసుకున్నారు. అందుకే మొదటి విడతేకాదు.... స్వల్ప గడువే ఉన్న రెండో విడతలోనూ (రేపే ఎన్నిక) సుడిగాలి పర్యటనలు చేశారు. ఇంటింటికి ప్రచారం, వివాహాలకు హాజరు, ఓటరు స్లిప్‌ల పంపిణీ... ఇలా ఓటర్లతో కలిసే ఏ అవకాశాన్నీ విడవకుండా ప్రధాని మోదీ గుజరాత్ ఎన్నికల పర్యటనల ప్రణాళిక రచించింది భాజపా! గురువారంనాడు అన్ని పార్టీలూ తొలి విడత పోలింగ్ హడావుడిలో ఉంటే... మోదీ మాత్రం భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లో మూడుగంటల పాటు సాగిన 50 కిలోమీటర్ల రోడ్‌షో ద్వారా ఏకబిగిన దాదాపు 15 నియోజకవర్గాలను మోదీ చుట్టిరావటం విశేషం. దేశంలో ఇప్పటిదాకా ఇంత భారీ రోడ్‌షో జరగలేదంటున్నారు. 10 లక్షల మందిదాకా పాల్గొన్న ఇందులో 35 చోట్ల ఆగి ప్రజలకు అభివాదం చేశారు. మొత్తం మీద గుజరాత్ ప్రచారంలో మోదీ 31 ర్యాలీలు, రెండు భారీ రోడ్‌షోలు చేశారు.
మోదీ ప్రచారతీరుపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీలు సహజంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓటమి భయంతోనే మోదీ అతిగా ప్రచారం చేస్తున్నారని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అన్నట్లుగా ఉందని ఆప్, కాంగ్రెస్ ఎద్దేవా చేశాయి. అందులో నిజానిజాలెలా ఉన్నా... రాష్ట్రంలో భాజపా పూర్తిగా బ్రాండ్ మోదీపై ఆధారపడి ఉందనేది వాస్తవం. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఎదురులేని విజయాలతో సాగిన భాజపా ఆయన ప్రధానిగా దిల్లీకి వచ్చాక 2017లో తొలి పరీక్షనెదుర్కొంది. ఆ పరీక్షలో అధికారాన్ని నిలబెట్టుకున్నా బొటాబొటి (99) మెజార్టీతోనే! అదీ...ఆనాటి ఎన్నికల రెండో విడతలో మోదీ విస్తృతంగా ప్రచారం చేయటం వల్లే ఆ మాత్రమైనా సీట్లు భాజపా ఖాతాలో పడ్డాయి. లేదంటే మరింత తగ్గేవంటారు.
ప్రభావం చూపని నేతలు
మోదీ తర్వాత ముఖ్యమంత్రులుగా చేసిన ఆనందీబెన్, విజయ్‌రూపానీలు పెద్దగా ప్రభావం చూపించకపోవటం అటుంచి వ్యతిరేక పవనాలు వీచేలా కనిపించింది. అందుకే భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రి పీఠంపైకి మోదీ, షాలు కూర్చోబెట్టారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన్ను నమ్ముకొని పార్టీ ఎన్నికలకు వెళ్లలేదు. అమిత్‌షాలాంటి వారున్నా... వ్యూహాలకే పరిమితమయ్యారేగాని ప్రజాకర్షణ అంతగా లేదు. చివరకు మళ్లీ బ్రాండ్ మోదీయే భాజపాకు శ్రీరామరక్ష! అందుకే ఈసారి ఎన్నికల్లో ఏమాత్రం తగ్గకుండా మోదీ బ్రాండ్‌ను భాజపా పూర్తిస్థాయిలో వాడుకుంటోంది. ఇంటింటికీ ప్రచారం, వివాహాలకు హాజరులాంటి స్వల్పస్థాయి ప్రచారానికీ ప్రధానిని భాగం చేసేలా వ్యూహం రచించటం ద్వారా... గుజరాత్ ముద్దుబిడ్డ ఇప్పటికీ అందుబాటులో ఉన్నారనే సందేశాన్ని సామాన్యులకు చేరవేసింది.
మోదీ మంత్రం ఫలించేనా..!
2017లో పాటిదార్ ఉద్యమంతో భాజపా సీట్ల సంఖ్య తగ్గింది. ఈసారి కేజ్రీవాల్ పార్టీ ఆప్ ప్రచారంలో దూకుడు పెంచింది. సీట్లెన్ని గెలుస్తుందో తెలియకున్నా... తమకు బలమైన పట్టణ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేస్తుందనే ఆందోళన భాజపాలో ఒకింత లేకపోలేదు. వీటికి తోడు ఎన్నికలకు ముందు మోర్బీలాంటి దుర్ఘటన చోటు చేసుకోవటం భాజపాకు ఇబ్బందికరంగా మారింది. మోదీని పూర్తిస్థాయిలో రంగంలోకి దించటం ద్వారా ఈ సమస్యలన్నీ తీరినట్లేనని కమలనాథులు భావిస్తున్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
General News
TSPSC: పేపర్ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Navjot Singh: సిద్ధూ భార్యకు క్యాన్సర్.. ‘ఇక వేచి ఉండలేనంటూ’ ట్వీట్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్